Botsa: పిల్లల్ని వేరే బడుల్లో చేర్పించుకోండి: మంత్రి బొత్స

రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బడుల్లోని విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సలహా ఇచ్చారు. ఇది ఆదేశం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తన అభ్యర్థన మాత్రమేనన్నారు.

Updated : 20 Jun 2023 08:51 IST

98మంది పిల్లలున్న ప్రాథమికోన్నత బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేమని వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత బడుల్లోని విద్యార్థులను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సలహా ఇచ్చారు. ఇది ఆదేశం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులకు తన అభ్యర్థన మాత్రమేనన్నారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేకపోతున్నందున.. విద్యార్థులకు మంచి చదువు వస్తుందనుకున్న బడుల్లో చేర్పించుకోవాలని సూచించారు. ఒకవేళ బడి దూరమవుతుందనుకుంటే కేజీబీవీ, ఎస్సీ, బీసీ, ఇతర ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో చేర్పిస్తే మంచిదని తెలిపారు. పాఠశాల దూరంగా ఉన్నా తల్లిదండ్రులు రోజు తీసుకువెళ్లి, తీసుకువస్తే పర్వాలేదని ఉచిత సలహా ఇచ్చారు.

విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒక ప్రశ్నకు మంత్రి బొత్స ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117ను తీసుకొచ్చింది. దీని ప్రకారం 98 మంది లోపు విద్యార్థులుండే ప్రీ హైస్కూల్‌(ప్రాథమికోన్నత) బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వడం లేదు. ఇక్కడ 3-8 తరగతులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లే(ఎస్జీటీ) చదువు చెబుతారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 98 మందిలోపు పిల్లలు ఉన్న  ప్రీహైస్కూళ్లలో అయిదుగురు సబ్జెక్టు టీచర్లను పెట్టేందుకు వీలు కాదని అభిప్రాయపడ్డారు. టీచర్లను పంపిస్తే అక్కడ అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, పిల్లలు తక్కువై టీచర్లు ఎక్కువైతే ఎలా? అందుకే అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. తక్కువ మంది పిల్లలున్న ప్రీహైస్కూళ్లను సమీప బడుల్లో విలీనం చేయాలని భావిస్తున్నామన్నారు.

9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు..

‘రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడులు 9 వేలు ఉన్నాయి. వీరు సెలవు పెడితే మరో ఉపాధ్యాయుడిని కేటాయించేందుకు మండల స్థాయిలో  3-5 మంది ఉపాధ్యాయులను రిజర్వులో పెడతాం. వీరు సరిపోకపోతే ఎక్కడైన ఎక్కువ ఉన్న చోట నుంచి పంపిస్తాం. మండల విద్యాధికారి(ఎంఈఓ)-1కు సంబంధించిన 355 ఖాళీలను ప్రభుత్వ ఉపాధ్యాయులతో భర్తీ చేస్తాం. 6-10 తరగతి గదుల్లో డిసెంబరు నుంచి 60వేల ఐఎఫ్‌పీ ప్యానళ్లను ఏర్పాటు చేయబోతున్నాం. బదిలీలకు 82,548 మంది దరఖాస్తు చేస్తే 52,240 మందికి బదిలీలు జరిగాయి. 833 మందికి రిలీవర్లు లేకపోవడంతో అక్కడే పని చేయాల్సి వస్తోంది. బోధనేతర సిబ్బందిగా కంప్యూటర్‌ ఆపరేటర్లను ఇవ్వనున్నాం. ఎండల కారణంగా పిల్లలు రావడం లేదు. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం కింద 87మందిని సన్మానించనున్నాం’ అని మంత్రి తెలిపారు.

జనసేనలోనే రౌడీలున్నారు..

‘జనసేన పార్టీలోనే దొంగలు, గుండాలు, రౌడీలు ఉన్నారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసులు ఉండొచ్చేమో కానీ, నాపై ఒక్క కేసూ లేదు. టిడ్కో గృహాల పంపిణీపై తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు సరైనవి కావు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదు? ఆయన మేము మొదలు పెట్టామని చెబితే పర్వాలేదు. అనవసర విమర్శలు ఎందుకు’ అని బొత్స ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని