YS Avinash Reddy: నాంపల్లి కోర్టులో అవినాష్‌ అనుచరుల హడావుడి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు స్థానికంగా ఉన్న వైకాపా కార్యకర్తలతోపాటు వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి కూడా గణనీయ సంఖ్యలో వచ్చారు.

Updated : 15 Aug 2023 07:14 IST

వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి
ఎంపీ, భాస్కరరెడ్డిలను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు స్థానికంగా ఉన్న వైకాపా కార్యకర్తలతోపాటు వైయస్‌ఆర్‌ జిల్లా నుంచి కూడా గణనీయ సంఖ్యలో వచ్చారు. దీంతో కోర్టు ఆవరణలో కొంత హడావుడి నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విచారణకు కోసం సోమవారం కోర్టుకు హాజరయ్యారు. ఇతర నిందితులైన వైఎస్‌ భాస్కరరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్‌యాదవ్‌, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి,  ఉమాశంకర్‌రెడ్డిలను సీబీఐ అధికారులు జైలు నుంచి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. వీరి హాజరును నమోదు చేసుకున్న అనంతరం రిమాండ్‌ను సెప్టెంబరు 1వ తేదీ వరకు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేష్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్‌ దస్తగిరి హాజరు మినహాయంపు కోరగా కోర్టు అనుమతించింది. విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు అతని తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న వారి అనుచరులు పెద్దఎత్తున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఎంపీ, పార్టీ అనుచరుల వాహనాలతోపాటు, జైలు నుంచి నిందితులను తీసుకువచ్చిన పోలీసు వాహనాలతో కోర్టు ఆవరణ నిండిపోయింది. దీంతో న్యాయవాదులు తమ వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.

శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణ 17న

వివేకా హత్య కేసులో 5వ నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. అభియోగ పత్రం దాఖలు చేసిన నేపథ్యంలో బెయిలు మంజూరు చేయాలని శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల ఆయన బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు