అధిక పింఛనుపై ఈపీఎఫ్‌వో నిర్లక్ష్యం

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించి ఏడాది అవుతున్నా ఆ ఫలాలు చందాదారులకు అందడం లేదు. దరఖాస్తులు స్వీకరించిన ఈపీఎఫ్‌వో పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

Updated : 06 Nov 2023 07:29 IST

సుప్రీం తీర్పు వచ్చి ఏడాదవుతున్నా అంతే
వచ్చిన దరఖాస్తులు 17.48 లక్షలు
అందులో 1.8 శాతానికే డిమాండ్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించి ఏడాది అవుతున్నా ఆ ఫలాలు చందాదారులకు అందడం లేదు. దరఖాస్తులు స్వీకరించిన ఈపీఎఫ్‌వో పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తోంది. పింఛను లెక్కింపుపై ప్రాంతీయ కార్యాలయాలకు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేశాయి. దేశవ్యాప్తంగా అధిక పింఛనుకు అర్హత కోసం 17.48 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు 32,592 మందికి ఎంత మొత్తం అదనంగా చెల్లించాలో డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. అంటే అందిన దరఖాస్తుల్లో 1.8 శాతానికే నోటీసులు ఇచ్చి వేతన జీవులు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.1,974 కోట్లుగా లెక్క తేల్చింది. నోటీసుల ప్రకారం కొందరు అదనంగా చెల్లించాల్సిన మొత్తం కట్టినప్పటికీ... పింఛను గణనపై స్పష్టత లేకపోవడంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది.

తొలి నుంచి నిర్లక్ష్యమే...

అధిక పింఛను అవకాశాన్ని సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో కల్పించింది. అయినా దరఖాస్తుల స్వీకరణ, తదుపరి ప్రక్రియపై ఈపీఎఫ్‌వో తీవ్ర జాప్యం చేసింది. కొన్ని కార్మిక సంఘాలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని కూడా హెచ్చరించాయి. తుదకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోలేదు. అధిక పింఛనుకు అర్హత కలిగిన వేతన జీవులు ఈపీఎస్‌ చందాను మూలవేతనం+డీఏలో 8.33కి బదులుగా 9.49 శాతం చెల్లించాలంటూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈపీఎఫ్‌వో నిర్ణయించే పింఛను లెక్కింపు విధానానికి కట్టుబడి ఉంటామని దరఖాస్తు సమయంలోనే హామీని తీసుకుంది. పింఛను గణనపై 2023 జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇలాఉంటే రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం పార్ట్‌-1, పార్ట్‌-2 విధానాన్ని తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. పింఛను గణనపై స్పష్టత ఇవ్వాలని, రవుర్కెలా విధానం సరికాదంటూ కార్మిక సంఘాలవారు, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం పింఛను గణనపై స్పష్టత ఇవ్వనందున దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఇటీవల నిలిపివేశాయి.


పింఛనుదారుల్లో పరిష్కరించిన దరఖాస్తు ఒక్కటే...

సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం దాదాపు 4.10లక్షల మంది పింఛనుదారులు అధిక పింఛను కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే డిమాండ్‌ నోటీసు జారీ చేయడం గమనార్హం. అక్టోబరు 31న జరిగిన సీబీటీ సమావేశంలో అధిక పింఛను దరఖాస్తుల స్థితిని సభ్యులు పరిశీలించారు. డిమాండ్‌ నోటీసుల మేరకు నగదు చెల్లించిన వారికి అదనపు పింఛను సదుపాయాలు కల్పిస్తామని ఈపీఎఫ్‌వో.. సీబీటీకి ఇచ్చిన నివేదికలో తెలిపింది. పింఛను గణనపై కేంద్ర కార్యాలయం, రవుర్కెలా పేర్కొన్న విధానాల్లో తీవ్ర వైరుధ్యం ఉందని.. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని సీబీటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని