టిడ్కో ఇళ్లపై జగన్‌ పిడుగు

‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం... ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించారు.

Updated : 18 Apr 2024 16:22 IST

అందమైన ఇళ్లు అన్నారు..
జగనన్న ఊళ్లు అన్నారు..
సీఎం మాటలు నమ్మిన పేదలు..
కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు.
ఐదేళ్లలో ఊళ్లు నిర్మించడం కాదు కదా...
చిన్నగూడు కూడా పూర్తి చేయలేదు...
గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లనూ
కక్షతో గాలికొదిలేసిందీ వివక్ష సర్కారు!

‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం... ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక అదే చేత్తో పేదల కంచంలో మట్టిపోశారు. బీదసాదల కోసమని గత ప్రభుత్వం చేపట్టి, దాదాపుగా పూర్తిచేసిన ‘టిడ్కో’ ఇళ్లను జగన్‌ మూలనపడేశారు. తలదాచుకోవడానికి తమకంటూ ఒక సొంతగూడు సమకూరబోతోందని సంతోషించిన లక్షలాది బడుగు జీవుల కళ్లల్లో కారంకొట్టారు. 


బడుగుల నెత్తిన బండరాయి

ప్రజలకు మేలుచేసే పనులకు మోకాలొడ్డటంలో జగన్‌ ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పట్టణ ప్రాంత పేదలకోసం ఉద్దేశించిన ‘టిడ్కో’ ఇళ్ల విషయంలో ఆయన నిర్వాకాలన్నీ ప్రజావ్యతిరేకమైనవే. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 3.13 లక్షల నివాసగృహాల నిర్మాణం చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతతో సకల సౌకర్యాలతో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అందజేయాలని నాటి సర్కారు తలపోసింది. అర్హతలకు అనుగుణంగా లబ్ధిదారులనూ ఎంపిక చేసింది. ‘టిడ్కో’ గృహాల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో లక్షన్నర రూపాయల చొప్పున సాయంచేస్తాయి. లబ్ధిదారులు తమ వాటా కింద 300 చ.అ. ఇంటికి రూ.500 చెల్లించాలి. 365, 430 చ.అ. గృహ లబ్ధిదారులేమో రూ.50వేలు, లక్ష రూపాయల వంతున కట్టాలి. నిర్మాణవ్యయంలో ప్రభుత్వ రాయితీ, లబ్ధిదారుల వాటా పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా ‘టిడ్కో’ సమకూర్చుకుంటుంది. లబ్ధిదారుల పేరిట తీసుకునే ఆ అప్పులపై రెండేళ్ల మారటోరియం ఉంటుంది. ఆ లోపు పనులన్నీ పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేస్తే, ఆపై నెలవారీ వాయిదాల్లో వారు రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఈ పద్ధతిలో 2019 ఎన్నికల నాటికి 81,040 ఇళ్ల పనులు తొంభైశాతం పూర్తయ్యాయి. మరో 71,488 నివాస గృహాలేమో 75-90శాతం నిర్మితమయ్యాయి. జగన్‌కు నిజంగానే పేదలపై ప్రేమ ఉంటే- దాదాపుగా ఒక ఆకారానికి వచ్చిన ఆ ఇళ్లకు వీలైనంత త్వరగా తుదిమెరుగులు దిద్దించి, లబ్ధిదారులకు అందజేయాలి కదా. ఆ పని చేయడానికి ఆయనకు మనసొప్పలేదు. సరికదా- రాజకీయ రాగద్వేషాలతో పేదలకు తీరని అన్యాయం చేశారు. ‘‘ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా పక్కా ఇళ్లు కట్టిస్తాం’’ అని ఎన్నికల మ్యానిఫెస్టోలో, ప్రచార సభల్లో జగన్‌ ఊదరగొట్టారు. సీఎం కుర్చీ ఎక్కీ ఎక్కగానే ఆ వాగ్దానాన్ని ఏట్లో కలిపి 51,616 ‘టిడ్కో’ ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి పారేశారు. తెదేపా సానుభూతిపరులు కావొచ్చు అన్న అనుమానంతో వేలాది సామాన్యులకు మొండిచెయ్యి చూపించి, వారి కుటుంబాల ఉసురుపోసుకున్నారు.


అడకత్తెరలో పోకచెక్కలు

ద్దు చేసినవి పోను మిగిలిన 2.62 లక్షల ఇళ్లనైనా జగన్‌ వేగంగా పూర్తిచేయించి, పంపిణీ చేశారా అంటే అదీ లేదు. మరేమి చేశారయ్యా ఆ మహానుభావుల వారంటే- ‘టిడ్కో’ కాలనీల పేరును ‘వైయస్‌ఆర్‌ జగనన్న నగర్‌’ అని మార్పించారు. ఆయా గృహసముదాయాలకు వైకాపా రంగులు కొట్టించారు. ఇదిగిదిగో ఇళ్లు సిద్ధమవుతున్నాయ్‌... అదిగదిగో ఆ రోజుకల్లా లబ్ధిదారుల చేతుల్లో తాళాలు పెట్టేస్తామంటూ మాయ మాటలు చెబుతూ కాలం గడిపేసింది జగన్‌ సర్కారు. దాంతో పట్టించుకునే నాథుడు లేక అప్పటికే ఒక కొలిక్కి వచ్చిన ‘టిడ్కో’ ఇళ్లకు చెదలు పట్టాయి. కొన్ని చోట్ల కిటికీలు, స్విచ్‌బోర్డులు, వైర్లు వంటివి దొంగల పాలయ్యాయి. తెదేపా హయాంలో గృహనిర్మాణాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంకులు- ఆర్థిక అరాచకత్వానికి పేరుమోసిన జగన్‌ జమానాలో వెనక్కిపోయాయి. దానికితోడు అంతకు మునుపు మంజూరైన రుణాలపై మారటోరియం గడువు తీరిపోవడంతో ఇళ్లు చేతిలోకి రాకమునుపే డబ్బులు తిరిగికట్టాల్సిన దుస్థితిలోకి చాలామంది లబ్ధిదారులు జారిపోయారు. ఒకపక్క ఇంటి అద్దెలు, మరోవైపు బ్యాంకు వాయిదాల చెల్లింపుల భారాన్ని పేదలపై మోపిన జగన్‌- వారి బతుకులను అడకత్తెరలో పడేశారు.


అక్షరాలా నయవంచన

మూడొందల చ.అ. ‘టిడ్కో’ గృహాలను రూపాయికే అందిస్తామన్న జగన్‌- 365, 430 చ.అ. ఇళ్ల లబ్ధిదారుల వాటాలోనూ యాభైశాతం రాయితీ ఇస్తామని ఊరించారు. సంబంధిత నిధుల విడుదలలోనూ విపరీతమైన జాప్యంతో బాధితుల శాపనార్థాలను చవిచూశారు. ఇలా లబ్ధిదారులకు రకరకాలుగా చుక్కలు చూపించిన జగన్‌- సంవత్సరాల తరబడి ‘టిడ్కో’ ఇళ్లకు బూజుపట్టించారు. పుణ్యకాలమంతా గడచిపోయాక  గత నెలాఖరు నాటికి కేవలం 90,472 ఇళ్లను పంపిణీ చేశారు. కానీ, అందులోనూ ఆయన గొప్పేమీ లేదు. లబ్ధిదారులకు అందించిన ‘టిడ్కో’ ఇళ్లలో అత్యధికం తెదేపా ఏలుబడిలోనే దాదాపుగా సిద్ధమయ్యాయి.  ఆయా గృహ సముదాయాల్లో మిగిలిపోయిన చిన్నాచితకా పనులు పూర్తిచేసి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన జగన్‌ సర్కారు-  వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు.  చాలాచోట్ల ఒట్టిగా ప్రచారంకోసం కనీస వసతుల్లేని ‘టిడ్కో’ ఇళ్లను లబ్ధిదారులకు  అంటగట్టేసింది. దాంతో ఆ గృహాల్లోకి అడుగుపెట్టిన వారిలో అనేకులు  నానా అగచాట్ల పాలవుతున్నారు. కరెంటు, తాగునీరు తదితరాలకూ దిక్కులేక అల్లాడిపోతున్నారు. ఆ గృహ సముదాయాల్లో సదుపాయాలన్నీ ఎప్పటికీ ఏర్పాటవుతాయో, మిగిలిన 1.70 లక్షలకు పైగా ‘టిడ్కో’ ఇళ్లు పూర్తయ్యేది ఎన్నటికో ఎవరికీ తెలియదు. జగన్‌ చేతకానితనం,  ప్రజాప్రయోజనాలను నెరవేర్చడంలో ఆయన నేరపూరిత నిర్లక్ష్యాల ఫలితమిది.  పేదలతో ఆశల మేడలు కట్టించి, వాటినే మెట్లుగా మార్చుకుని అధికార పీఠాన్ని అధిరోహించిన వైకాపా అధినేత దగాకోరు పాలన ప్రతిఫలమిది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని