జగన్‌ పెత్తనం.. పట్టణాలకు పెనుశాపం!

‘నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగు నీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి’’ అని సీఎంగా చిటికెల పందిళ్లు వేశారు జగన్‌.

Updated : 18 Apr 2024 16:52 IST

‘‘నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగు నీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి’’ అని సీఎంగా చిటికెల పందిళ్లు వేశారు జగన్‌. అదే మనిషి.. రోడ్ల మీది గుంతల్లో పట్టణాభివృద్ధిని పాతిపెట్టేశారు. ఆస్తిపన్నును  అడ్డగోలుగా పెంచేసిన జగన్‌- మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వకుండా నగరాలను నరక కూపాలుగా మార్చేశారు. చెత్తపన్నుతో జనాన్ని చావగొట్టి, వాళ్ల కష్టార్జితాలను కొల్లగొట్టేశారు. ఆపై ఎక్కడి చెత్త కుప్పలను అక్కడే వదిలేసి ప్రజారోగ్యాన్ని జబ్బుల పాల్జేశారు. మంచినీళ్లు రావు.. మురుగునీళ్లు పోవు.. వీధి దీపాలు వెలగవు.. వైకాపా విధ్వంసక ఏలుబడిలో పట్టణ, నగరవాసుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చెత్తపాలనతో ప్రజలను చిత్రవధ చేసిన జగన్‌ పాతకాలెన్నో లెక్కతేల్చడం ఆ చిత్రగుప్తుడి వల్ల కూడా కాదు!

రాజ్యాంగ ద్రోహి జగన్‌

ప్రజాస్వామ్య పునాదులపై పట్టణ ప్రాంతాలు సమగ్ర అభివృద్ధికి నోచుకోవాలన్న లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ జరిగింది. దాని ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత లభించింది. పుర పాలికలు స్వపరిపాలనా సంస్థలుగా పని చేసేందుకు అవసరమైన తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం అందించాలని 243(డబ్ల్యూ) రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ప్రజాస్వామ్యం పేరు వింటేనే ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకినట్లు కంపరమెత్తిపోయే జగన్‌- రాజ్యాంగ ఆశయాలను పాతాళానికి తొక్కేశారు. పురపాలక సంఘాల నిధులను దొడ్డిదారిలో తన వశం చేసుకుని- స్థానిక ప్రభుత్వాల స్వతంత్రతకు సమాధికట్టారు. ‘‘ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలి’’ అని 2020లో జగన్‌ మహా గొప్పగా సెలవిచ్చారు. అదే చేతల్లోకి వచ్చేసరికి పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని సొమ్మునూ తన గుప్పిట్లోనే పెట్టేసుకున్నారు. మొన్న ఫిబ్రవరి నాటికి మున్సిపాలిటీలకు రూ.450 కోట్ల వరకు బకాయిలను పేరబెట్టారు జగన్‌. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనా కర్రపెత్తనం చేసిన జగన్‌- పట్టణ ప్రాంత ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారు. పగిలిపోయిన తాగునీటి పైపులైన్లను మార్చడం నుంచి దోమల నివారణ దాకా దేనికీ మున్సిపాలిటీల దగ్గర డబ్బు లేకుండా చేశారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో అత్యధికం వైకాపా చేతుల్లోనే ఉన్నాయి. అయినా ప్రజాసమస్యలేవీ తీరడం లేదంటే కారణం జగనే. పాలనలో దార్శనికత, ప్రజల బాగోగులపై పట్టింపు లేని ఆయన వల్ల ఏపీలోని పట్టణాలన్నీ ప్రగతికి దూరమయ్యాయి.

పచ్చి మోసాల మనిషి!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి కోయని కోతల్లేవు. ‘‘జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి’’ లాంటి డైలాగులు చెబుతూ అప్పట్లో ఆయన ఊరూరా ఏకపాత్రాభినయాలు చేశారు. ‘‘నంద్యాల అభివృద్ధిని నాకు వదిలేయండి.. సీఎం కుర్చీలో కూర్చున్నాక దాన్ని పరుగులు పెట్టిస్తా’’ వంటి వాగ్దానాలతో ప్రతి చోటా జనాన్ని బులిపించారు జగన్‌. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకును పట్టి చూస్తే తెలిసిపోతుంది. నంద్యాల దుర్గతిని చూస్తే చాలు- జగన్‌మోహన్‌రెడ్డి అంటే మాట తప్పి మడమ తిప్పే పచ్చి మోసాల మనిషి అని తేలిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానన్న జగన్‌- ఆఖరికి అక్కడ కనీసం మురుగునీటి కాల్వల నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నడుంకట్టింది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కేంద్ర నిధులతో వందల కిలోమీటర్ల మేర పనులు చేయించింది. అవి పూర్తయ్యే లోపే ప్రభుత్వం మారిపోయింది. అభివృద్ధిని అసహ్యించుకునే జగన్‌ జమానాలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. దాంతో చిన్న చినుకు పడితే చాలు- రోడ్లన్నీ మురుగునీటి చెరువులవుతున్నాయి. డోన్‌ వంటి పట్టణాల్లో కాల్వల్లేక ఇళ్లలో వాడుకునే నీళ్లన్నీ వీధులను ముంచెత్తుతున్నాయి. అనంతపురం, ఆత్మకూరు, గుత్తి, గుంతకల్లు, గూడూరు తదితర చోట్ల మురుగు కంపును భరించలేక జనం నానా పాట్లూ పడుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారాన్ని పక్కకు తోసేసిన జగన్‌ ప్రత్యర్థులపై పగ సాధించడానికే పదవిని వాడుకున్నారు.

జగన్‌ సర్వభ్రష్ట పాలన

‘‘మురుగునీరు నేరుగా నదుల్లో కలవకుండా చూడాలి. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి’’ అంటూ నీతిశతకాలెన్నో చెప్పిన జగన్‌- ఆ పనులకు నిధులేమీ విదల్చలేదు. కేంద్ర ప్రభుత్వ ‘అమృత్‌’ పథకం కింద తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో వందల కోట్ల రూపాయలతో కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులు ప్రారంభించింది. వాటిని పూర్తి చేస్తే ప్రజారోగ్యానికి రోగాల ముప్పు ఉండదని తెలిసినా జగన్‌ ఆ పని చేయలేదు. ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్వహణ లోపాలతో మూతపడుతున్నా ఆయన బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు. దానివల్ల ఏమైంది.. పట్టణాలు, నగరాల్లో రోజూ ఉత్పత్తయ్యే 288 కోట్ల లీటర్ల మురుగునీటిలో ఎనభై శాతానికి పైగా జలవనరుల్లోనే కలుస్తున్నాయి. దానిమూలంగా గోదావరి, కృష్ణా, నాగావళి, పెన్నా, తుంగభద్ర నదులన్నీ కాలుష్య కాసారాలవుతున్నాయి. చిత్తూరులోని నీవా నది ఒకప్పుడు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేది. ఇళ్లలోని మురుగు అంతా దాని కడుపులోకే చేరుతుండటంతో ఇప్పుడది అధ్వానంగా తయారైంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు కొరవడటంతో రాష్ట్రవ్యాప్తంగా అరవైకి పైగా పట్టణాల్లో వ్యర్థజలాలన్నీ నేరుగా నదుల్లోకి వచ్చిపడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే- జగన్‌ మోహన్‌రెడ్డి సర్వభ్రష్ట పాలనకు సాక్ష్యాలెన్నో కనపడతాయి.

నోట్లో బెల్లం.. కడుపులో విషం!

‘‘77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేశాం’’ అని ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ దరువేసుకుంటున్నారు. జనం సొమ్మును కాజేసేందుకు కొత్త కుటిల మార్గాలు కనిపెట్టడం తప్ప జనం బతుకుల్లో ఆయన తెచ్చిన మార్పులేమీ లేవు. నోట్లో బెల్లం, కడుపులో విషం పెట్టుకుని రాష్ట్రాన్ని పాలించిన జగన్‌- చెత్తపన్ను రూపేణా ప్రజలపై రూ.400 కోట్ల అదనపు భారాన్ని మోపారు. ఆస్తిపన్ను బాదుడుతో మరో రూ.950 కోట్లకు పైగా బరువును జనం నెత్తిన పెట్టారు. ఒకపక్క అంత డబ్బును లాక్కుంటూనే- పట్టణాల్లో కనీసం చెత్తకుప్పల బెడదనూ జగన్‌ తప్పించలేదు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు చెత్తనుంచి ఎరువులను తయారుచేయడం, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం వంటి వాటికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఘనవ్యర్థాల నిర్వహణలో జాతీయస్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది. జగన్‌ వినాశక ఏలుబడిలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎరువుల తయారీ పరిశ్రమలూ బయోగ్యాస్‌ ప్లాంట్లు మూతపడ్డాయి. డంపింగ్‌ యార్డుల్లో బయోమైనింగ్‌ మందగించింది. రోడ్లపక్కన, చెరువుల్లో చెత్తను కుప్పపోసే దృశ్యాలు ఇప్పుడు అనేక పట్టణాల్లో కనపడుతున్నాయి. తిరుపతి, ఎమ్మిగనూరు, తాడిపత్రి, కనిగిరి, పొన్నూరు, రాజమహేంద్రవరం, ఏలేశ్వరం, కాకినాడ, సాలూరు.. ఇలా ప్రతిచోటా పాలనలో జగన్‌ నేరపూరిత నిరక్ష్యానికి నిదర్శనంగా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమల దండయాత్రలతో ప్రజానీకం రోగాల పాలవుతోంది.

జగన్‌ ఒక తేనెపూసిన కత్తి!

తేనెపూసిన కత్తిలాంటి వ్యక్తిత్వం జగన్‌ది. అందుకే ఆయన మాటలకూ చేతలకూ పొంతన ఉండదు. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరించాలంటూ అధికారులకు ఉచిత సలహాలు అనేకం ఇచ్చారు జగన్‌. అలా వట్టి పోసుకోలు కబుర్లు చెప్పడమే తప్ప, రోడ్లపై గుంతలను పూడ్పించడానికీ ఆయన సొమ్ములివ్వలేదు. పురపాలక నిధులను జగన్‌ బిగపట్టేయడంతో రోడ్లూ కల్వర్టుల నిర్మాణం, మరమ్మతుల వంటివన్నీ ఆగిపోయాయి. వానాకాలంలో వెల్లువెత్తే వరదనీరు వల్ల నగర జీవనం ఎంత దుర్భరం అవుతుందో అందరికీ తెలిసిందే. ఆ సమస్యను రూపుమాపడానికి తెలుగుదేశం ప్రభుత్వం రూ.2,048 కోట్లు కేటాయించి 2,381 కిలోమీటర్ల మేర వరదనీటి కాల్వలను కట్టించింది. మరో 3,915 కి.మీ.ల మేర కాల్వల నిర్మాణ పనులనూ చేపట్టింది. వైకాపా హయాంలో ఆ పనులన్నీ పక్కకు పోయాయి. తాను సీఎం అయినప్పటి నుంచి నిరుడు డిసెంబరు నాటికి కేవలం 162 కి.మీ. మేర వరదనీటి కాల్వల నిర్మాణాన్నే పూర్తి చేయగలిగారు జగన్‌. దానిమూలంగా వానలొస్తే చాలు- రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నీ మునిగిపోతున్నాయి. తాగునీటి ప్రాజెక్టులనూ అటకెక్కించిన వైకాపా అధినేత కారణంగా పట్టణాల్లో దాహార్తి కేకలు మిన్నంటుతున్నాయి. అలాంటి జగన్‌ ఇప్పుడు రోడ్డెక్కి ‘‘అయిదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తున్నాం’’ అంటూ సిగ్గుమాలిన స్వోత్కర్షలు చేసుకుంటున్నారు.

పట్టణాంధ్రకు ప్రథమ శత్రువు

ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిస్తూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో పట్టణాలు, నగరాలు కీలకపాత్ర పోషిస్తాయి. మౌలిక వసతులతో తులతూగే నగరాలకు పెట్టుబడులూ విరివిగా వస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ క్రమంలోనే అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రంతో కలిసి రూ.4 వేల కోట్లతో తెదేపా ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యమంత్రి కాగానే అమరావతికి ఉరిపోసిన జగన్‌- రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులకు అవసరమైన నిధులివ్వని జగన్‌ జగమొండితనం వల్ల మిగిలిన మూడు నగరాల్లోనూ ప్రజోపయోగ పనులు పూర్తి కాలేదు. స్మార్ట్‌సిటీల తరహాలోనే శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం నగరాల సమగ్రాభివృద్ధికి తెదేపా సర్కారు అప్పట్లో బృహత్తర ప్రణాళికలు సిద్ధంచేసింది. వాటికి చెదలు పట్టించిన జగన్‌- పట్టణాంధ్రకు ప్రథమ శత్రువు అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని