సంక్షిప్త వార్తలు (9)

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను వారికి అందజేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) మహేశ్వరరెడ్డి మంగళవారం హైకోర్టుకు తెలిపారు.

Updated : 17 Apr 2024 06:27 IST

అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను అందజేశాం
హైకోర్టుకు నివేదించిన ఎస్‌జీపీ

 ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను వారికి అందజేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) మహేశ్వరరెడ్డి మంగళవారం హైకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి వినతి సమర్పించడంతో సంబంధిత సమాచారాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సైతం వివరాలు అందినట్లు కోర్టుకు తెలిపారు. వాటిని నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి వ్యాజ్యాలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అందుబాటులో ఇంటర్‌ షార్ట్‌ మెమోలు

ఈనాడు, అమరావతి: ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్‌ షార్ట్‌ మెమోలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. హాల్‌టికెట్‌ నంబరు, పుట్టిన తేదీల ద్వారా ఈ మెమోలను పొందవచ్చు. వీటిల్లో మార్కులతో పాటు గ్రేడ్‌లనూ పొందుపరిచారు.


సవాళ్లను అధిగమించే శక్తినివ్వాలి: గవర్నర్‌

ఈనాడు, అమరావతి: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ధర్మం, ప్రేమ, సంతోషంతో కూడిన జీవితాన్ని గడిపేందుకు పురుషోత్తముడైన శ్రీరాముడు మనందరికీ మార్గదర్శనం చేయాలని.. సవాళ్లను అధిగమించేందుకు శక్తి, ధైర్యం అందిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం’ అని ప్రజలకు సందేశమిచ్చారు.


అవినీతిని వీరేశలింగం ఆనాడే ఎత్తిచూపారు

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సామాజిక దురాచారాలపై కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఆనాడే ఆయన ఎత్తిచూపారని పేర్కొన్నారు. వీరేశలింగం జయంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా తెలుగుప్రజలకు సందేశమిచ్చారు. ‘మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో ఆయనే స్ఫూర్తి. ఈ స్ఫూర్తికి పునరంకితమవుదాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మూఢ నమ్మకాలపై అలుపెరగని పోరాటం చేసిన అనేక మంది సంఘసంస్కర్తలకు వీరేశలింగం స్ఫూర్తిగా నిలిచారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి.. బాలికా విద్యపై ఆయన అవగాహన కల్పించారని ఎక్స్‌ వేదికగా కొనియాడారు.


ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉపాధి కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కన్నబాబుకు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. రెండు నెలలుగా సుమారు రూ.208 కోట్లు బకాయి ఉన్నట్లు మంగళవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


సుజనా చౌదరి వ్యాజ్యం 19కి వాయిదా

ఈనాడు, అమరావతి: విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి వై.సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) మంగళవారం అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి విచారణ చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. అయిదుగురు ఎస్పీలను కేసుల వివరాలివ్వాలని కోరామన్నారు. అందులో ఇద్దరు మాత్రమే సమాచారం ఇచ్చారని తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హోం శాఖ జీపీని ఆదేశించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.  


బాబ్లీ కేసు విచారణ 23కు వాయిదా

బోధన్‌ గ్రామీణం, పెద్దపల్లి, న్యూస్‌టుడే: బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలీ కోర్టులో మరోసారి ఈ నెల 23కు వాయిదా పడింది. మంగళవారం జరిగిన విచారణకు.. తెలంగాణలోని కరీంనగర్‌, పెద్దపల్లి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, చింతకుంట విజయరమణారావు, ప్రకాశ్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, కేఎస్‌ రత్నం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్‌బాబు తదితరులు హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సహా 9 మంది నాయకులు కేసు విచారణకు హాజరు కాలేదు.  


కఠినశిక్ష పడేలా చేయడంలో ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తోట త్రిమూర్తులుకు కఠినశిక్ష పడేలా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నల్లప్ప, మాల్యాద్రి విమర్శించారు. ఈ కేసులో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని మండిపడ్డారు.


కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కి వాయిదా

ఈనాడు, దిల్లీ: ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరగాల్సి ఉన్నా రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా సెలవుపై వెళ్లడంతో కేసు తదుపరి విచారణను 22కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు