నీరుగార్చే ప్రయత్నాలెన్నో..

దళిత బాధితుల తరపున.. 28 ఏళ్ల కాలంలో అయిదుగురు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ) వాదనలు వినిపించగా, వారిలో ముగ్గురిని వివిధ ఆరోపణలపై పక్కకు తప్పించారంటే శిరోముండనం కేసు ఎన్ని అవరోధాల నడుమ సాగిందో అర్థమవుతోంది.

Updated : 17 Apr 2024 06:25 IST

ఈనాడు-విశాఖపట్నం, కాకినాడ: దళిత బాధితుల తరపున.. 28 ఏళ్ల కాలంలో అయిదుగురు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (పీపీ) వాదనలు వినిపించగా, వారిలో ముగ్గురిని వివిధ ఆరోపణలపై పక్కకు తప్పించారంటే శిరోముండనం కేసు ఎన్ని అవరోధాల నడుమ సాగిందో అర్థమవుతోంది. వైకాపా సర్కారు నుంచీ బాధితులకు సరైన సహకారం లభించలేదు. వారికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం మోకాలడ్డిందంటే.. నిందితులపై ఎంత ప్రేమ చూపిందో అర్థమవుతుంది. తొలుత రఫీ అహ్మద్‌ అనే పీపీని నియమించారు. తర్వాత జవహర్‌ నియమితులయ్యారు. ఆయన తమను బెదిరిస్తున్నారని ప్రధాన నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులు ఫిర్యాదు చేయడంతో జవహర్‌ను మార్చారు. అనంతరం సలాది శ్రీనివాస్‌ను నియమించగా.. ‘నిందితుడు, ఆయన ఒకే సామాజికవర్గానికి చెందిన వారు’ అని బాధితులు అభ్యంతరం తెలిపారు. తర్వాత పీపీగా సుజాతను నియమించగా, అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు కోర్టు నుంచి మాయమయ్యాయి. దీంతో బాధితులు నానా తిప్పలు పడి కొత్తగా కుల ధ్రువీకరణ పత్రాలను తెచ్చి పీపీ సుజాతకు ఇచ్చారు.

అవి కాస్తా హుద్‌హుద్‌ తుపాన్‌లో పోయాయని ఆమె చెప్పడంతో బాధితులు హైకోర్టుకు ఆశ్రయించారు. ఆమెను ఈ కేసు నుంచి తప్పించాలని 2016లో హైకోర్టు సూచించింది. తర్వాత 2018 నుంచి పీపీగా సత్యనారాయణమూర్తి వాదనలు వినిపిస్తున్నారు. ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు.. ఈ కేసును నీరుగార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీంతో బాధితులు న్యాయం కోసం.. సుదీర్ఘ పోరాటం సాగించాల్సి వచ్చింది. ఫలితంగానే తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. 87 రోజులపాటు జైల్లో రిమాండ్‌లో ఉంచారు. జస్టిస్‌ పుట్టుస్వామి కమిషన్‌ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2008లో కేసును రీఓపెన్‌ చేశారు. 2014లో ప్రముఖ దళిత న్యాయవాది బొజ్జా తారకం ఆధ్వర్యంలో 2015 జనవరి 8న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (మాండమస్‌) వేశారు. దీనిపై విచారణ జరిపి కేసును త్వరగా తేల్చి బాధితులకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు 2017లో విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.

కుల ధ్రువీకరణకూ మోకాలడ్డిన వైకాపా సర్కారు

బాధిత దళితులు వైకాపా ప్రభుత్వంలో.. తమ కులధ్రువీకరణ పత్రాల కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వారు ఎస్సీ కులానికి చెందినవారు కాదని క్రైస్తవ మతానికి చెందినవారని, బీసీ-సి కిందకు వస్తారని ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వం విచారణకు జేసీ కోర్టు ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు 2019 జూన్‌ 27న బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యాయి. అవి చెల్లవంటూ వెంకటాయపాలేనికి చెందిన కొందరు, తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితులకు కుల ధ్రువీకరణ ఇవ్వాల్సిందేనని జడ్జి ఆదేశించారు. దీంతో రామచంద్రపురం తహసీల్దారు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా, ఆ బెంచ్‌ అప్పీల్‌ను డిస్మిస్‌ చేసింది. ఇంతజరిగినా సింగిల్‌ బెంచ్‌ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు ఇస్తూ కేసు విచారణ కొనసాగించమని 2019లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆదేశించారు. ఇలా ఈ కేసులో ఏళ్ల తరబడి జాప్యానికి వైకాపా ప్రభుత్వమూ కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని