Nobel Prize 2021: సామాజిక సమస్యలకు సహజ పరిష్కారం

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన ముగ్గురు ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. వలస కార్మిక విపణి గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందించిన

Updated : 27 Feb 2024 20:10 IST

వలసలు, కనీస వేతనాల అంశాల్లో ఆవిష్కరణలు
ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్‌

స్టాక్‌హోమ్‌: సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన ముగ్గురు ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. వలస కార్మిక విపణి గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందించిన డేవిడ్‌ కార్డ్‌ (65), సహజ పరిశోధనల్లో కార్యకారణ సంబంధాల విశ్లేషణతో ఎలాంటి నిర్ధారణలకు రావచ్చో వివరించిన జోష్వా యాంగ్రిస్ట్‌(61), గైడోఇంబెన్స్‌(58) మనకు సరికొత్త మార్గదర్శనం చేశారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ పేర్కొంది. వీరి విధానాలను ఇతర రంగాలకూ అనువర్తింపజేయవచ్చని తెలిపింది.

‘‘సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కార్యకారణ సంబంధం ఉంటుంది. వలస విధానం..వేతనాలు, ఉపాధి అవకాశాలపై ఎంత ప్రభావం చూపుతుంది? దీర్ఘకాలం కొనసాగే చదువులు ఒక వ్యక్తి భవిష్యత్తు ఆదాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. ఎందుకంటే తులనాత్మకంగా పరిశీలించి చెప్పడానికి మన వద్ద ముందస్తు ఆధారాలు లేవు. వలస కార్మికులు తగ్గిపోతే, ఒక వ్యక్తి చదువును కొనసాగించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే, ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాన్ని అందుకోబోతున్న ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే మార్గాలను సూచించారు’’ అని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ సోమవారం ప్రకటనలో వివరించింది.

వలసలు, కనీస వేతనాలు..
కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్‌ కార్డ్‌ (65)వలస కార్మిక విపణి, కనీస వేతనాలు చూపే ప్రభావంపై 1990 నుంచి పరిశోధనలు కొనసాగించారు. ఈ రంగాల్లో ఉన్న సంప్రదాయ భావనలను సవాల్‌ చేసేలా వినూత్న విశ్లేషణలను, లోతైన పరిజ్ఞానాన్ని అందించారు. కనీస వేతనాలను పెంచడం వల్ల ఇతరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన అవసరంలేదని నిరూపించారు. వలస కార్మికుల వల్ల స్వదేశంలోని వ్యక్తుల ఆదాయం వృద్ధిచెందడంతోపాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని స్పష్టం చేశారు. డేవిడ్‌ కార్డ్‌ ఈ అంశాన్ని నిరూపించే వరకు కొత్త వలసలపై ప్రతికూలమైన అభిప్రాయాలు ఉండేవి. డేవిడ్‌ కార్డ్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. నోబెల్‌ బహుమతిగా లభించే 11.45లక్షల డాలర్లలో సగం మొత్తం డేవిడ్‌ కార్డ్‌కు, మిగతా సగాన్ని జోష్వా, గైడోలకు పంచుతారు.

చదువుల పొడిగింపు ప్రభావంపై..
అమెరికాలోని కొలంబస్‌లో జన్మించిన జోష్వా యాంగ్రిస్ట్‌(61), నెదర్లాండ్స్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన గైడో ఇంబెన్స్‌(58)...వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపేప్రభావాన్ని విశ్లేషించారు. ఒక బృందంలోని వ్యక్తుల చదువును ఏడాదిపాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమని అప్పటి వరకు అనుకునేవారు. కానీ, 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన యాంగ్రిస్ట్‌, గైడో ఇంబెన్స్‌ విధాన ప్రకియలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించారు. సహజ పరిశోధనల ద్వారా కార్యకారణ సంబంధాన్ని విశ్లేషిస్తూ కచ్చితమైన నిర్ధారణలకు రావచ్చని నిరూపించారు. జోష్వా.. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో, గైడో ఇంబెన్స్‌..స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ఫ్రొఫెసర్లుగా ఉన్నారు.

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే
డేవిడ్‌ కార్డ్‌: 1956లో కెనడాలో జన్మించారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ(1983). ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌.
జోష్వా డి.యాంగ్రిస్ట్‌: అమెరికాలోని కొలంబస్‌లో 1960లో జననం. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ (1989). ప్రస్తుతం మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌.
గైడో డబ్ల్యు.ఇంబెన్స్‌: 1963లో నెదర్లాండ్స్‌లో జన్మించారు. అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ(1991). ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని