Electric Vehicles: వచ్చే ఏడాది విద్యుత్తు వాహనాల ధరలు పెరగనున్నాయా?

విద్యుత్తు వాహన తయారీ కంపెనీలేమో లిథియం-అయాన్‌ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఈవీల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు....

Updated : 25 Dec 2021 13:25 IST

దిల్లీ: భారత్‌లో వాహన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఓవైపు సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలను తయారీ చేసే సంస్థలు సెమీకండక్టర్ల కొరతతో సతమతమవుతున్నాయి. మరోవైపు విద్యుత్తు వాహన(ఈవీ) తయారీ కంపెనీలేమో లిథియం-అయాన్‌ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీల తయారీలో వినియోగించే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఏర్పడ్డ అవాంతరాలూ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

2021 ప్రారంభం నుంచి ప్రతి త్రైమాసికంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయని బ్యాటరీ తయారీదారులు చెబుతున్నారు. బ్యాటరీల్లో ఉండే ‘సెల్‌’ల ధర 30 శాతం పెరిగిందని పేర్కొన్నారు. బ్యాటరీల తయారీకయ్యే ఖర్చులో 70 శాతం ఈ సెల్‌ల కోసం వెచ్చించేదే. భారత్‌లో ఈవీలకు డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. నవంబరులో గరిష్ఠంగా 42,067 ఈవీలు రిజిస్టర్‌ అయ్యాయి. 40 వేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.

బ్యాటరీల్లో కీలక భాగమైన సెల్స్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. కాంగో దేశం నుంచి లిథియం ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో అక్కడి గనుల్లో కార్యకలాపాలు నెమ్మదించాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఏర్పడ్డ ఇబ్బందులతో ప్రధాన లోహాల సరఫరా నిలిచిపోవడంతో సమస్య మరింత జటిలమైంది. దీంతో 2022లో ఒక్క కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ధర 2.3 శాతం పెరిగి 135 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారత్‌లో ఇప్పటి వరకైతే మెజారిటీ ఈవీ తయారీ కంపెనీలు పెరుగుతున్న ధరల భారాన్ని వినియోగదారులపై మోపలేదు. కానీ, ఈసారి సెల్స్‌ ధరలు మళ్లీ పెరిగితే వాహనాలు మరింత ప్రియం అవడం అనివార్యమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. గత నెలలో రివోల్ట్‌ మోటార్స్‌ ఆర్‌వీ400 ఎలక్ట్రిక్‌ బైక్‌ ధరను రూ.18,000 పెంచారు. హీరో సైకిల్స్‌ సైతం కొన్ని ఈవీల ధరలను రూ.5000 వరకు పెంచింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాల వల్ల పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసుకోగలుగుతున్నామని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ, ముడి పదార్థాల ధరలు మరింత పెరిగితే ఆ భారాన్ని మోయలేమని పేర్కొన్నాయి.

బ్యాటరీ కొరత నేపథ్యంలో వాటి రీసైక్లింగ్‌ ఊపందుకుంది. బ్యాటరీ సెల్స్‌లో వినియోగించే కోబాల్ట్‌ రీసైక్లింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే, కాలం చెల్లిన బ్యాటరీల సేకరణకు భారత్‌లో ఓ నిర్దిష్టమైన విధానం లేకపోవడం అడ్డంకిగా మారింది. మరోవైపు కొన్ని వాహన తయారీ సంస్థలు బ్యాటరీల ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఎంజీ మోటార్స్‌ రూ.300 కోట్ల నిధులతో తమ బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని 11 రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. మరికొన్ని సంస్థలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts