Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సంపద.. పాక్‌ జీడీపీ కంటే ఎక్కువట

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌పై కాసుల కుంభవృష్టి కురుస్తోంది. ఇటీవల టెస్లా కంపెనీ షేర్లు దూసుకెళ్లడంతో.. కేవలం ఒక్క రోజులోనే

Updated : 30 Oct 2021 16:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌పై కాసుల కుంభవృష్టి కురుస్తోంది. ఇటీవల టెస్లా కంపెనీ షేర్లు దూసుకెళ్లడంతో.. కేవలం ఒక్క రోజులోనే ఆయన 36 బిలియన్‌ డాలర్లు ఆర్జించారు. దీంతో ఆయన సంపద భారీగా పెరగడమే గాక, 300 బిలియన్‌ డాలర్లకు చేరువైంది. యావత్‌ ప్రపంచంలోనే ఈ స్థాయిలో సంపద కలిగిన తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఇంకా ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. పాకిస్థాన్‌ జీడీపీ కంటే మస్క్‌ సంపదే ఎక్కువట.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. ప్రస్తుతం మస్క్‌ నికర సంపద విలువ 292 బిలియన్‌ డాలర్లు. 220 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్థాన్‌ జీడీపీ.. ప్రస్తుతం దాదాపు 280 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే పాక్‌ ప్రజల మొత్తం సంపద కంటే మస్క్‌కే 12 బిలియన్‌ డాలర్ల సంపద ఎక్కువగా ఉంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్‌ లూయీజ్‌ అనే ఓ కాలమిస్ట్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇక మస్క్‌.. పాకిస్థాన్‌ను కొనేస్తారా?’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఈ ఏడాదిలోనే 120 బిలియన్‌ డాలర్లు..

ఇటీవల హెర్ట్జ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ లక్ష టెస్లా కార్లకు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో అక్టోబరు 25 నాటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేరు విలువ అమాంతం పెరిగింది. దీంతో మస్క్ సంపద ఆ ఒక్కరోజే 36 బిలియన్‌ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. 2021లో ఇప్పటివరకు ఆయన సంపద 120 బిలియన్‌ డాలర్లకు పైనే పెరిగింది. టెస్లా స్టాక్‌ విలువ కూడా ఈ ఏడాదిలో 45శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ అగ్ర స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉన్నారు. అయితే బెజోస్‌ సంపద కంటే మస్క్‌ సంపద దాదాపు 100 బిలియన్‌ డాలర్లు ఎక్కువ కావడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని