ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందం కేసులో అమెజాన్‌ పిటిషన్లపై విచారణ 20న

రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ విలీనానికి అనుకూలంగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెజాన్‌ దాఖలు చేసిన 2 పిటిషన్లపై జులై 20న విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టులో  తెలిపింది. సింగపూర్‌

Published : 09 Jul 2021 00:55 IST

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ విలీనానికి అనుకూలంగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెజాన్‌ దాఖలు చేసిన 2 పిటిషన్లపై జులై 20న విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టులో  తెలిపింది. సింగపూర్‌ ట్రైబ్యునల్‌లో ఈ విషయంపై ఈ నెల 12 నుంచి వాదనలు ప్రారంభమవుతున్నందున, ఒక వారం పాటు ఇక్కడ విచారణ వాయిదా వేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫున ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్న సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే బెంచ్‌ను కోరారు. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అమెజాన్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియన్‌కు ఈ విషయం తెలిపింది. ఇందుకు ఎలాంటి ఇబ్బంది లేదనడంతో ఈ నెల 20న వాదనలు వింటామని కేసును అప్పటికి వాయిదా వేసింది. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ తమ ఫ్యూచర్‌ రిటైల్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని నిలిపివేయాలని అమెజాన్‌ కోర్టును ఆశ్రయించింది.


బీఎమ్‌డబ్ల్యూ, ఆడిలపై ఈయూ అపరాధ రుసుం
 ఫోక్స్‌వ్యాగన్‌, పోషెలపైనా

బ్రసెల్స్‌: నాలుగు జర్మనీ కార్ల తయారీ కంపెనీలపై యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్ల)కు పైగా అపరాధ రుసుము విధించింది. కార్ల ఉద్గార నియంత్రణ వ్యవస్థల అభివృద్ధి, అమలును పరిమితంగా ఉంచడానికి ఈ సంస్థలు కుమ్మక్కయ్యాయని ఈయూ పేర్కొంది. పెట్రోలు, డీజిల్‌ కార్ల నుంచి కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికత విషయంలో పోటీ పడకుండా దైమ్లర్‌, బీఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్‌, ఆడి, పోషెలు కుమ్మక్కయినట్లు ఈయూ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ పేర్కొంది. అయితే దైమ్లర్‌ ఈ సమాచారాన్ని యూరోపియన్‌ కమిషన్‌కు ఇచ్చిన కారణంగా దానికి అపరాధ రుసుము విధించలేదని తెలిపింది. ఈ తరహాలో కుమ్మక్కయిన కంపెనీలపై అపరాధ రుసుము విధించడం యూరోపియన్‌ కమిషన్‌కు ఇదే తొలిసారి. సాధారణంగా ధరల నిర్ణయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. చట్టపరిమితికి మించిన హానికర ఉద్గారాలను తగ్గించే సాంకేతికత కంపెనీల వద్ద ఉన్నా, అవి అలా చేయలేదు. వినియోగదార్లు తక్కువ కాలుష్యం వెలువరించే కార్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోయేలా ఆ కంపెనీలు చేశాయని ఈయూ యాంటీ ట్రస్ట్‌ చీఫ్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌ పేర్కొన్నారు.


డీబీఎస్‌ బ్యాంక్‌ లాభం రూ.312 కోట్లు

ముంబయి: లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను (ఎల్‌వీబీ) విలీనం చేసుకున్న తరవాత డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) రూ.312 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలు కూడా భారీగా పెరిగాయి. 2019-20లో బ్యాంక్‌ రూ.111 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎల్‌వీబీ పోర్ట్‌ఫోలియోలోని మొండి బకాయిలు భారీగా కలవడంతో డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 12.93 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.83 శాతానికి చేరాయి. కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 84 శాతంగా ఉంది. బ్యాంకు మొత్తం డిపాజిట్లు 44 శాతం మేర పెరిగి రూ.51,501 కోట్లకు చేరాయి. ఇందులో రూ.18,823 కోట్లు ఎల్‌వీబీ నుంచి వచ్చినవే. పొదుపు డిపాజిట్లు 207 శాతం, కరెంట్‌ ఖాతా 98 శాతం మేర పెరిగాయి. నికర రుణాలు రూ.36,973 కోట్లకు చేరగా, ఇందులో ఎల్‌వీబీ వాటా రూ.10,685 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో మాతృ సంస్థ నుంచి రూ.2,500 కోట్ల మూలధన సాయం అందడంతో డీబీఎస్‌ బ్యాంక్‌ మూలధన సమర్థత నిష్పత్తి 15.13 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని