Health Insurance: ఆరోగ్య బీమా క‌వ‌ర్‌ను పెంచుకోవాలా?  

పాల‌సీ పునరుద్ధ‌ర‌ణ స‌మయంలో ప్ర‌తీ బీమా సంస్థ పాల‌సీ అందించే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు అవ‌కాశం ఇస్తుంది.

Updated : 30 Oct 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే కుంటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది ఆరోగ్య బీమా పాల‌సీ. కొవిడ్ త‌రువాత  వైద్య ఖ‌ర్చులు భారీగా పెరిగాయి. మ‌రి ప్ర‌స్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాల‌సీ.. పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఉందా? క‌వ‌రేజ్ మొత్తం స‌రిపోతుందా? ఒక‌వేళ స‌రిపోదు అనుకుంటే ఏం చేయాలి?

నిజానికి కొవిడ్‌-19 త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న పెరిగింది. ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాల‌సీని తీసుకునేముందు కుటుంబ స‌భ్యులంద‌రి వైద్య అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌గిన‌ కవ‌రేజ్‌తో పాల‌సీని ఎంచుకోవాలి. ఒక‌వేళ ఇప్ప‌టికే ఆరోగ్య బీమా ఉన్న‌వారు.. క‌వ‌రేజ్ స‌రిపోదు అనుకుంటే పెంచుకునే వీలుంది. అయితే అద‌న‌పు ప్రీమియం చెల్లించేందుకు మిమ్మ‌ల్ని మీరు సిద్ధంచేసుకోవాలి.

క‌వ‌రేజ్‌ను పెంచుకునే మార్గాలు..
1. బీమా మొత్తాన్ని పెంచ‌డం: పాల‌సీ పునరుద్ధ‌ర‌ణ స‌మయంలో ప్ర‌తి బీమా సంస్థ పాల‌సీ అందించే బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఒక‌వేళ ప్ర‌స్తుత‌ పాల‌సీతో వ‌చ్చే క‌వ‌రేజ్‌ స‌రిపోదు అనుకుంటే పునురుద్ధ‌ర‌ణ స‌మయంలో పెంచుకోవ‌చ్చు. దీనివ‌ల్ల ప్ర‌స్తుత పాల‌సీ ద్వారా వ‌చ్చే వెయిటింగ్ పీరియడ్ (నిరీక్ష‌ణ కాలం) వంటి ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా ఉంటారు. ఒక‌వేళ మీరు కొత్త ఆరోగ్య బీమా పాల‌సీకి మారితే ముందుగా ఉన్న వ్యాధుల కోసం దాదాపు నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్‌ ఉండొచ్చు. 

2. సూప‌ర్ టాప్-అప్ ప్లాన్‌: ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు అయ్యే ఖర్చు.. ప్రాథ‌మిక ఆరోగ్య బీమా పాల‌సీ ప‌రిమితిని మించిన‌ప్పుడు సూప‌ర్ టాప్‌-అప్ ప్లాన్ అద‌న‌పు ర‌క్ష‌ణ అందిస్తుంది. కానీ సూప‌ర్ టాప్-అప్ పాల‌సీ డిడ‌క్ట్‌బుల్‌తో వ‌స్తుంది. (సాధార‌ణంగా ఇది ప్రాథ‌మిక ఆరోగ్య బీమా హామీ మొత్తం ప‌రిమితికి స‌మానంగా ఉంటుంది). నిర్దేశించిన డిడక్టబుల్ లిమిట్ దాటితేనే సూప‌ర్ టాప్‌-అప్ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. సూప‌ర్ టాప్‌-అప్ పాల‌సీలు ప్రీ, పోస్ట్ ఆసుప‌త్రి ఖ‌ర్చులు, ముందుగా ఉన్న ఆరోగ్య‌ ప‌రిస్థితులు, పిల్ల‌ల సంర‌క్ష‌ణ ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తాయి. పైగా పూర్తి వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీల కంటే సూప‌ర్ టాప్‌-అప్ పాల‌సీల ఖ‌ర్చు కూడా త‌క్కువ‌. ప్ర‌స్తుతం ఉన్న‌ ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసిన సంస్థ నుంచే సూప‌ర్ టాప్‌-అప్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది. ఎందుకుంటే నిర్దిష్ట వినియోగదారుని కోసం ఒక బీమా సంస్థ‌తో అయితేనే ఆసుప‌త్రులు మెరుగ్గా స‌మ‌న్వ‌యం చేయ‌గ‌లుగుతాయి.

3.ఆల్ ఇక్లూజివ్ ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ: వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా కంటే స‌మ‌గ్ర కుటుంబ బీమాను కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. కుటుంబంలోని ప్ర‌తి వ్య‌క్తికీ పాల‌సీ కొనుగోలు చేయాలంటే చాలా ఖ‌ర్చు అవుతుంది. ఈ స‌మ‌స్య‌ను ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాలసీతో అధిగమించ‌వ‌చ్చు. ఒకే ప్రీమియంను చెల్లించవ‌చ్చు. అలాగే వివిధ వైద్య అవ‌స‌రాల కోసం క‌వ‌రేజ్‌ను పొందొచ్చు. కుటుంబంలోని పెద్ద వ‌య‌సు ఉన్న స‌భ్యుని ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి చిన్న వ‌య‌సులో ఉన్న‌వారు (అంటే 30 నంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారు) ప్ర‌యోజ‌నం పొందుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని