YES Bank: యస్‌బ్యాంక్‌పై ఎఫ్‌ఐఆర్‌ నిలిపివేత..!

సుప్రీం కోర్టులో యస్‌బ్యాంక్‌కు ఊరట లభించింది. ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు వద్ద చేసిన ఫిర్యాదుకు సంబంధించి యస్‌బ్యాంక్‌, వీడియోకాన్‌ డీ2హెచ్‌ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published : 30 Nov 2021 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుప్రీంకోర్టులో యస్‌బ్యాంక్‌కు ఊరట లభించింది. ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు వద్ద చేసిన ఫిర్యాదుకు సంబంధించి యస్‌బ్యాంక్‌, వీడియోకాన్‌ డీ2హెచ్‌ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత డిష్‌టీవీ ఇండియాలో యస్‌బ్యాంక్‌కు ఉన్న ఓటింగ్‌ హక్కులను యూపీ పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గౌతం బుద్ధనగర్‌లో పోలీసులు కూర్చోని డిష్‌టీవీ ఇండియాలో యస్‌బ్యాంక్‌ ఓటింగ్‌ హక్కులను నిలిపివేస్తామంటే చూస్తూ ఊరుకోమని పేర్కొంది.

 కంపెనీ లా ట్రైబ్యూనల్‌ కూడా యస్‌బ్యాంక్‌ ఓటింగ్‌ హక్కులను రద్దు చేయలేదు.. అలాంటిది యూపీ పోలీసులు చేయడం దేశంలో చట్టవిరుద్ధతకు దారితీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయ వ్యవస్థ ఆదేశాలను పోలీసులు ధ్వంసం చేయడమేనని వ్యాఖ్యానించింది. ‘‘సివిల్‌ ప్రొసీడింగ్స్‌లో క్రిమినల్‌ లా విధానాలను అనుమతించడం చాలా ప్రమాదకరం. ఆ తర్వాతి పరిణామాలను కూడా చూడాల్సి ఉంటుంది’’ అని న్యాయస్థానం పేర్కొంది. 

ఏజీఎం షెడ్యూల్‌ను నెలపాటు వాయిదా వేస్తున్నట్లు గత రాత్రి డిష్‌టీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిష్‌ టీవీ ప్రమోటర్లు రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో యస్‌బ్యాంక్‌ ఆ కంపెనీలో 24.5శాతం వాటాలను తీసుకొంది. దీంతో గత డిష్‌టీవీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర బ్యాంక్‌పై పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాంక్‌ అక్రమంగా వీడియోకాన్‌ డీ2హచ్‌, డిష్‌టీవీ విలీనానికి ఒప్పందం చేసుకొందని ఆరోపించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని