Updated : 27 Oct 2021 19:00 IST

Jiophone Next: దీపావళికే జియోఫోన్‌ నెక్స్ట్‌ .. ధ్రువీకరించిన పిచాయ్‌!

దిల్లీ: జియో-గూగుల్‌ సంయుక్తంగా తీసుకొస్తున్న జియోఫోన్‌ ‘నెక్స్ట్‌’ను దీపావళి సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల భారత్‌ తీవ్రంగా ప్రభావితమైందన్నారు. అయినప్పటికీ.. కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటుపడ్డవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే ఇంకా అనేక మంది ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది తమకు ఓ అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు.

జియోతో కలిసి ప్రాంతీయ భాషల వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల అనేక మందికి స్మార్ట్‌ఫోన్ల ప్రయోజనాలు అందనున్నాయన్నారు. ఈ కొత్త ఫోన్‌తో అనేక మంది తొలిసారి ఇంటర్నెట్‌ సేవల్ని ఉపయోగించుకోనున్నట్లు వివరించారు. దీని ద్వారా కొత్త అవకాశాలు వారి దరికి చేరనున్నాయన్నారు. భారత్‌తో పాటు ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో తమకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. రానున్న 3-5 ఏళ్లలో అనేక మార్పులు రానున్నాయన్నారు. తమ ఉత్పత్తులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడే వ్యక్తులను కలిపేందు కోసం.. మరీ ముఖ్యంగా దేశంలోని 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను లక్ష్యంగా చేసుకుని జియోఫోన్‌ నెక్స్ట్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం రిలయన్స్‌ జియో విడుదల చేసిన వీడియోలో ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. టచ్‌స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో భారత్‌లో పలు భాషలు మాట్లాడే వారికి అనుగుణంగా భాషా - అనువాద టూల్‌ నిక్షిప్తం చేశారు. ఈ ఫీచరు దాదాపు 10 భారతీయ భాషలను అనువాదం చేయగలదు. ఈ ఫీచరు సాయంతో ఒక భాషలో మాట్లాడితే ఫోన్‌ ద్వారా ఇంకో భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. ఫోన్‌లో ఉండే గట్టిగా చదివి వినిపించే ఫీచరు సహాయంతో ఏదైనా యాప్‌లోని కంటెంట్‌ను చదివి వినిపించుకోవచ్చు. జియోఫోన్‌లో క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది తిరుపతి, శ్రీపెరంబదూరులో ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌నకు చెందిన నియోలింక్‌ యూనిట్లలో తయారవుతోంది.

ఇవీ ఫీచర్ల వివరాలు..

వాయిస్‌ అసిస్టెంట్‌: ఈ ఫీచరు సహాయంతో వినియోగదారు ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్‌ చేయించొచ్చు. మనకు నచ్చిన భాషలోనే ఇంటర్నెట్‌లోని కంటెంట్‌/సమాచారాన్ని పొందొచ్చు.

ట్రాన్స్‌లేట్‌: తెరపై ఉన్న ఏ కంటెంట్‌నైనా సరే వినియోగదారుకు ఇష్టమైన భాషలోకి అనువాదం చేస్తుంది.

స్మార్ట్‌ కెమెరా: ఇందులో ఉండే స్మార్ట్‌, శక్తివంతమైన కెమెరాతో పలు మోడ్‌లలో నచ్చిన విధంగా ఫొటోలు తీసుకోవచ్చు. నైట్‌ మోడ్‌ కూడా ఇందులో ఉంది. ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ ఫిల్టర్లు కూడా కెమెరా యాప్‌లో ఉన్నాయి.

బ్యాటరీ: ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు మెరుగైన బ్యాటరీ జీవితం దీని సొంతం. ఎక్కువ కాలం పాటు ఛార్జ్‌ చేయకుండానే వినియోగించుకోవచ్చు.


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts