వ్యవసాయ రంగం భేష్‌

కొత్త వ్యాపార నమోదుల్లో వ్యవసాయ రంగం రికార్డు నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 103 శాతం వృద్ధితో అత్యధికంగా 12,368 కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు ఈ విభాగంలో నమోదయ్యాయి. 2019-20లో ఈ విభాగంలో 6,107...

Updated : 12 Aug 2021 07:57 IST

కొత్త వ్యాపార నమోదుల్లో 103% వృద్ధి

ముంబయి: కొత్త వ్యాపార నమోదుల్లో వ్యవసాయ రంగం రికార్డు నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 103 శాతం వృద్ధితో అత్యధికంగా 12,368 కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు ఈ విభాగంలో నమోదయ్యాయి. 2019-20లో ఈ విభాగంలో 6,107 వ్యాపారాలే కొత్తగా నమోదయ్యాయని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అధ్యయన పత్రం వెల్లడించింది. ‘బిజినెస్‌ డైనమిజమ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదల చేసిన శ్వేత పత్రంలో తయారీ రంగ కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు 26,406 నుంచి 50 శాతం వృద్ధితో 39,539కు చేరినట్లు పేర్కొంది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,95,880 వ్యాపారాలు నమోదయ్యాయని ఇది కూడా రికార్డు అని తెలిపింది. సేవల రంగంలో కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు 14 శాతం వృద్ధితో 83,079 నమోదయ్యాయి. కొత్త వ్యాపారాల ఏర్పాటు రేటు (బర్త్‌ రేట్‌) వృద్ధి దిశగా వెళుతోందని, 2015-16లో 7.8 శాతం ఉండగా, 2019-20 నాటికి 10.2 శాతానికి చేరిందని తెలిపింది. 2020-21లో కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించినా సరే ఇది 11.6 శాతంగా నమోదైందని వివరించింది. ఉప రంగాలైన వ్యవసాయ ఉత్పత్తి (క్రాప్స్‌), ఆహారం, మన్నికేతర వస్తువుల టోకు, రసాయనాల తయారీ, సామాజిక సేవలు, విద్యా సేవలు, కంప్యూటర్‌ ఆధారిత సేవల్లోనూ గణనీయంగా కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైల బయట నమోదవుతున్న వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2020-21లో అగ్రశ్రేణి 10 నగరాల్లో 42 శాతమే కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 2016-17లో ఇవి 55 శాతంగా ఉన్నాయి.


మా ఫండ్‌ మదుపర్లకు రూ.21,080 కోట్లిచ్చాం
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఎమ్‌ఎఫ్‌

దిల్లీ: మూసివేసిన ఆరు డెట్‌పథకాలకు చెందిన మదుపర్ల(యూనిట్‌ హోల్డర్ల)కు ఇప్పటిదాకా రూ.21,080 కోట్లను వెనక్కి ఇచ్చినట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఎమ్‌ఎఫ్‌) తెలిపింది. ఈ పథకాలను మూసివేసిన(ఏప్రిల్‌ 23, 2020) నాటికి నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో(ఏయూఎమ్‌) ఈ మొత్తం 84 శాతానికి సమానం. బాండ్‌ మార్కెట్లో ద్రవ్యలభ్యత లేకపోవడంతో పాటు రెడెమ్షన్ల ఒత్తిడి పెరుగుతుండడంతో పథకాలను మూసివేస్తున్నట్లు ఫ్రాంక్లిన్‌ ఆ సమయంలో పేర్కొంది. జులై 31, 2021 నాటికి పంపిణీకి రూ.1111 కోట్ల నగదు ఉన్నట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఇండియా) ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రే మదుపర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా అయిదు దశల్లో మొత్తం రూ.21080 కోట్లను మదుపర్లకు వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. కాగా, మూసివేసిన ఆరు పథకాల్లో రూ.25,000 కోట్ల మేర ఆస్తులున్నాయని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని