China: భారత్‌పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నుంచి నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు

China: భారత్‌ సహా కొన్ని కీలక దేశాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే లక్ష్యంగా చైనా గడ్డ నుంచి కొన్ని నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉద్భవిస్తున్నాయని మెటా నివేదిక వెల్లడించింది.

Published : 05 Dec 2023 19:02 IST

దిల్లీ: భారత్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా గడ్డ నుంచి ఉద్భవిస్తున్న నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల (Fake Facebook accounts from China) ముప్పును టెక్‌ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. మన దేశంపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అందుకోసం అధునాతన వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం విడుదల చేసిన ఓ త్రైమాసిక నివేదికలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

చైనా నుంచి ఉద్భవిస్తున్న అనేక నకిలీ ఖాతాలను (Fake Facebook accounts from China) గుర్తించి రద్దు చేసినట్లు మెటా వెల్లడించింది. భారతీయులుగా నటిస్తూ.. దేశ రాజకీయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ఈ ఖాతాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయని వివరించింది. పాత్రికేయులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకొంటూ ఈ నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్నారని తెలిపింది. ఎక్కువగా ఇంగ్లిష్‌లో పోస్ట్‌లు పెడుతున్నారని.. అప్పుడప్పుడు హిందీ, చైనీస్‌ భాషలను కూడా ఉపయోగించినట్లు వెల్లడించింది. స్థానిక వార్తలు, సంస్కృతి, క్రీడలు, టిబెట్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపైనా పోస్టులు చేస్తున్నారని పేర్కొంది.

కొన్ని నకిలీ ఖాతాలు (Fake Facebook accounts from China) టిబెట్‌పై దృష్టి సారించినట్లు మెటా నివేదిక తెలిపింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆయన అనుచరులు అవినీతి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయని వెల్లడించింది. అరుణాచల్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నకిలీ ఖాతాలు భారత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసినట్లు తెలిపింది. అలాగే మణిపూర్‌లో హింసను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు దుష్ప్రచారం చేశాయని బహిర్గతం చేసింది. పైగా ఇదంతా అధీకృత సమాచారమని నమ్మించేందుకు.. పోస్టులపై కామెంట్లు చేయడం, వారి మధ్యలో వారే షేర్‌ చేయడం కూడా చేసినట్లు పేర్కొంది.

అలాంటి ఖాతాలను (Fake Facebook accounts from China) గుర్తించి తమ సామాజిక మాధ్యమ వేదికలన్నింటి నుంచి తొలగించినట్లు మెటా వెల్లడించింది. మరికొన్ని ఖాతాలు అమెరికా లక్ష్యంగానూ పనిచేసినట్లు తెలిపింది. గర్భ విచ్ఛిత్తి, అధ్యక్ష అభ్యర్థులు, అమెరికా-చైనా సంబంధాలు తదితర అంశాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని