మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్‌ఎఫ్‌ఓ-న్యూ ఫండ్‌ ఆఫర్‌) విడుదల చేశాయి.

Published : 28 Apr 2024 01:40 IST

దిల్లీ

త ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్‌ఎఫ్‌ఓ-న్యూ ఫండ్‌ ఆఫర్‌) విడుదల చేశాయి. వీటి ద్వారా రూ.66,364 కోట్లు సమీకరించాయి. ఫండ్లపై చిన్న మదుపరుల ఆసక్తి పెరగడం, సానుకూల మార్కెట్‌ వల్ల 2022-23తో పోలిస్తే పెట్టుబడులు 6.5%  పెరిగాయి. 2022-23లో 253 ఎన్‌ఎఫ్‌ఓల ద్వారా ఏఎంసీలు రూ.62,342 కోట్లు సేకరించాయి. ‘పొదుపు మొత్తాలను ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. సంపదను సృష్టించడంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నారు. ఆదాయం, వ్యయాలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో, అధిక రాబడిని అందించే మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మారిన మదుపరుల వైఖరి, నష్టభయం భరించే సామర్థ్యం పెరగడం వల్ల ఈక్విటీల్లోకి పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయి’ అని ఫేర్స్‌ రీసెర్చ్‌ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌ ఆర్థిక వృద్ధి కొనసాగుతుండటం, పెట్టుబడి అవకాశాలు విస్తరిస్తుండటంతో అనేక కొత్త కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో నమోదవుతున్నాయి. వృద్ధి అవకాశాలను కోరుకునే మదుపరులకు ఇది సానుకూలాంశమని పేర్కొంది. ఫేర్స్‌ నివేదిక ప్రకారం..

  • ఈ ఏడాది జనవరి-మార్చిలో అత్యధికంగా 63 ఎన్‌ఎఫ్‌ఓలు వచ్చాయి. వీటి ద్వారా రూ.22,683 కోట్ల నిధులను ఫండ్‌ సంస్థలు సమీకరించాయి. 2023 అక్టోబరు-డిసెంబరు మధ్య  ఏఎంసీలు 49 ఎన్‌ఎఫ్‌ఓలను అందుబాటులోకి తీసుకొచ్చి, రూ.16,093 కోట్లను సేకరించాయి.
  • సాధారణంగా పెట్టుబడిదారులు ఆశావహ దృక్పథంతో ఉండి, మార్కెట్‌ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడు ఎన్‌ఎఫ్‌ఓలు అధికంగా వస్తుంటాయి. 2023-24లో మదుపరులు మార్కెట్‌పై విశ్వాసం చూపించడంతో పాటు, స్టాక్‌ మార్కెట్‌ పనితీరూ, అధిక మొత్తంలో పెట్టుబడులు ఎన్‌ఎఫ్‌ఓల్లోకి వచ్చేందుకు కారణమైందని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ 50 మదుపరులకు 28.6% రాబడిని అందించిందని గుర్తు చేశారు.
  • దేశీయ సంస్థాగత మదుపరులు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టారు. దీనికి రిటైల్‌ మదుపరులు తోడుగా నిలిచారు. క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) ద్వారా 2023 ఏప్రిల్‌లో రూ.13,720 కోట్లు రాగా, 2024 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19,270 కోట్లకు చేరుకుంది.
  • మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నికర పెట్టుబడుల్లో గణనీయ వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర పెట్టుబడులు రూ.3.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో ఇది రూ.76,225 కోట్లుగా ఉంది.
  • హైబ్రిడ్‌ పథకాల్లోకి 2023-24లో నికరంగా రూ.1.45లక్షల కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత ఫండ్లు రూ.1.84 లక్షల కోట్లను ఆకర్షించాయి. వడ్డీ రేట్ల పెంపులో విరామం కనిపిస్తుండటంతో తమ పెట్టుబడులను మదుపరులు డెట్‌ నుంచి ఈక్విటీ, హైబ్రిడ్‌ విభాగం పథకాలకు మార్చడం కనిపించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని