హైదరాబాద్‌లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్‌

కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్‌ తెలిపింది.

Published : 28 Apr 2024 01:41 IST

దిల్లీ: కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్‌ తెలిపింది. క్రితం ఏడాది ఇది 1.18 కోట్ల చ.అడుగులుగా ఉంది. దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్‌ లీజింగ్‌ ధోరణులపై శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. దేశ రాజధాని దిల్లీలో కార్యాలయాల లీజింగ్‌ లావాదేవీలు 25 శాతం తగ్గి, 18.1 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 24 లక్షల చ.అడుగుల కార్యాలయాల స్థలం అద్దెకు వెళ్లింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలోనూ దిల్లీలో ఆఫీసు స్థలానికి గిరాకీ తగ్గింది. దేశ వ్యాప్తంగా మొత్తం ఆఫీసు స్థలం అద్దె లావాదేవీలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు 61 శాతం వాటా ఉందని పేర్కొంది. గతంలో ఇది 54 శాతం వరకూ ఉంది. బెంగళూరులో ఆఫీసు లీజింగ్‌ గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 33 లక్షల చ.అడుగులు ఉండగా, ఈ సారి 26.2 లక్షల చ.అడుగులకు పరిమితమయ్యింది. చెన్నైలో 16 లక్షల నుంచి 33.5 లక్షల చ.అడుగులకు చేరింది. హైదరాబాద్‌లో గత ఏడాది 15 లక్షల చ.అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 22.7లక్షల చ.అడుగులకు పెరిగింది. ముంబయిలో 24.9 లక్షలు, కోల్‌కతాలో 1.6 లక్షలు, పుణెలో 7.1 లక్షల చ.అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లింది. ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలు 47 శాతం ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలోని సంస్థలు 11 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ సంస్థలు మిగతా స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఈ సందర్భంగా వెస్టియన్‌ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్యాలయాల స్థలాల అద్దె విషయానికి వస్తే 2024 సానుకూలంగా ప్రారంభమయ్యిందని తెలిపారు. ఆఫీసు స్థలాలకు గిరాకీ తిరిగి వచ్చిందని, ఇది భవిష్యత్‌ వృద్ధిని నడిపిస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని