ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు

అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్‌’ను అందుబాటులోకి తీసుకురానుంది.

Published : 28 Apr 2024 01:42 IST

ఏడాదికి ప్రీమియం రూ.1,500
‘బీమా విస్తార్‌’ను తీసుకురానున్న ఐఆర్‌డీఏఐ

హైదరాబాద్‌: అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్‌’ను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘బీమా మంథన్‌’లో భాగంగా దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జీవిత, ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద, ఆస్తి బీమా ఒకే పాలసీలో తీసుకురావడమే దీని లక్ష్యం. వ్యక్తిగత పాలసీకి ప్రీమియం రూ.1,500గా ఉండే అవకాశం ఉంది. ఇందులో జీవిత బీమా పాలసీకి రూ.820, ఆరోగ్య బీమాకు రూ.500, వ్యక్తిగత ప్రమాద బీమాకు    రూ.100, ఆస్తి బీమాకు రూ.80 చొప్పున ఉంటాయి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.2,420 ఉంటుంది. బీమా మంథన్‌లో భాగంగా బీమా సంస్థల సీఈఓల సమావేశంలో ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేబాశీస్‌ పాండా ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి విధివిధానాలను, ఇతర నిబంధనలను ఐఆర్‌డీఏఐ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

రూ. 2లక్షల వరకూ..: బీమా విస్తార్‌లో భాగంగా జీవిత, వ్యక్తిగత ప్రమాద బీమా విలువ రూ.2 లక్షల వరకూ ఉండనుంది. ఆరోగ్య బీమా పాలసీని ‘హాస్పిటల్‌ క్యాష్‌’ పేరుతో 10 రోజులకుగాను రోజుకు రూ.500 చొప్పున గరిష్ఠంగా రూ.5,000 వరకూ ఇస్తారు. దీనికి ఎలాంటి బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదు. ఆస్తి బీమా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఉండనుంది.

బీమా విస్తార్‌ను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు బీమా సలహాదారులను ప్రోత్సహించేలా 10 శాతం వరకూ కమీషన్‌ లభిస్తుంది. బీమా సుగమ్‌తోపాటు, బీమా పాలసీల స్వాధీన విలువ లాంటి అంశాలపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యక్తులు తమ కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు బీమా విస్తార్‌ ఎంతో ఉపయోగపడుతుందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ ప్రీమియం ఉండటంతో ఎంతోమంది కొత్తగా బీమా పరిధిలోకి వచ్చేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌, జీవిత బీమా కౌన్సిల్‌లతో కలిసి ఈ బీమా పాలసీకి సంబంధించి ‘యూపీఐ’ తరహా విప్లవం తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని