Adani group: అదానీ గ్రూప్‌లో వాటాలు పెంచుకున్న ప్రమోటర్‌ గ్రూప్‌

Adani group: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో నెల వ్యవధిలోనే రెండోసారి ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలు వాటాలను పెంచుకున్నాయి.

Published : 10 Sep 2023 16:48 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group)లోని రెండు కంపెనీల్లో బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని ప్రమోటర్‌ గ్రూప్‌ తమ వాటాలను పెంచుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 69.87 శాతం వాటాను 71.93 శాతానికి పెంచుకున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్స్‌లో వెల్లడించారు. ఈ కంపెనీ నెల వ్యవధిలోనే రెండోసారి వాటా పెంచుకోవడం గమనార్హం. మరోవైపు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో వాటాను 65.23 శాతం నుంచి 63.06 శాతానికి పెంచుకున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత గ్రూప్‌ (Gautam Adani) కంపెనీల షేర్ల విలువ పతనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం నింపాలనే వ్యూహంలో భాగంగానే ప్రమోటర్ గ్రూప్‌ వాటాల కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో ‘రిస్టర్జెంట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌’ తాజాగా దాదాపు ఒక శాతం వాటాను సొంతం చేసుకుంది. మరో 1.2 శాతం వాటాను ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డీఎంసీసీ కొనుగోలు చేసింది. ఈ రెండూ ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలే. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో కెంపాస్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్ఫైనైట్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ తమ వాటాలను పెంచుకున్నాయి. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 8 మధ్య ఆయా కంపెనీలు వాటాలను కొనుగోలు చేశాయి. అదానీ గ్రూప్‌ (Adani group) సంస్థల్లో అమెరికా పెట్టుబడుల సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ వాటాలను కొనుగోలు చేసిన కొన్ని వారాల్లోనే ప్రమోటర్‌ సంస్థలు కూడా తమ వాటాలను పెంచుకోవడం గమనార్హం.

జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు ఇప్పుడు అదానీ గ్రూప్‌ (Adani group)లోని ఐదు నమోదిత కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఆగస్టు 16న అదానీ పవర్‌లో అదనంగా 7.73 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలైన ఎమర్జింగ్‌ మార్కెట్‌ హోల్డింగ్‌, ఆఫ్రో ఏషియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ బ్లాక్‌ డీల్‌ ద్వారా ఆగస్టు 16న 8.09 శాతం వాటాలను విక్రయించాయి. వీటి నుంచే జీక్యూజీ 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని