Adani stocks: అదానీ స్టాక్స్‌లో భారీ ర్యాలీ.. రూ.1లక్ష కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

Adani stocks: అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. కేసు విచారణ సమయంలో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్లు రాణించాయి.

Published : 28 Nov 2023 17:34 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group)లోని 10 నమోదిత కంపెనీల షేర్లు మంగళవారం భారీగా ర్యాలీ అయ్యాయి. అత్యధికంగా ‘అదానీ టోటల్‌ గ్యాస్‌’ బీఎస్‌ఈలో 19.99 శాతం పెరిగి రూ.644.20 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. తర్వాత అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ స్టాక్‌ ధర 19.06 శాతం పెరిగి రూ.868.15 దగ్గర ముగిసింది. అదానీ పవర్‌ షేరు 12.34 శాతం ఎగబాకి రూ.446.20 దగ్గర ముగిసింది. గ్రూపులోని ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 8.66 శాతం పెరిగి రూ.2,423.70కు చేరింది. మొత్తంగా గ్రూపులోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.1.05 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.11.31 లక్షల కోట్లు దాటింది. గత 19 నెలల్లో గ్రూప్‌ స్టాక్స్‌కు ఒకరోజులో అత్యధిక లాభం నమోదైంది మంగళవారమే (2023 నవంబర్‌ 28) కావడం గమనార్హం.

అమెరికా షార్ట్‌సెల్లర్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు (Adani Group)పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని సుప్రీం కోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు రాణించాయి. ‘సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నిటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేద’ని పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లలోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ మంగళవారం ఇంట్రాడేలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ.. అదానీ గ్రూప్‌ షేర్లు మాత్రం ట్రేడింగ్‌ ఆరంభం నుంచీ రాణిస్తూనే వచ్చాయి. ఎట్టకేలకు ఆఖర్లో వచ్చిన కొనుగోళ్ల అండతో సెన్సెక్స్‌ (Sensex) 204.16 పాయింట్లు లాభపడి 66,174.20 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 19,889.70 దగ్గర ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు