Ambani succession plan: నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా అంబానీ వారసులు.. షేర్‌హోల్డర్ల ఆమోదం

Ambani succession plan: గత ఏడాదే మూడు విభాగాల వ్యాపార నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ముకేశ్‌ అంబానీ వారసులు ఇకపై నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు.

Published : 27 Oct 2023 13:57 IST

Ambani succession plan | ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) వారసులు ఈశా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీలను నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమిస్తూ చేసిన తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రిలయన్స్ (Reliance Industries) శుక్రవారం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తన వారసత్వ ప్రణాళికను వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ముగ్గురు పిల్లలు వ్యాపార నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నారని ప్రకటించారు.

కవలలైన ఈశా, ఆకాశ్‌ల నియామకానికి 98 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అనంత్‌ అంబానీ (Anant Ambani)కి 92.75 శాతం ఓట్లతో మద్దతు తెలిపినట్లు పేర్కొంది. వీరి నియామకాన్ని ఆమోదిస్తూ కంపెనీ బోర్డు ఆగస్టులోనే తీర్మానం చేసింది. దీనికి తాజాగా షేర్‌హోల్డర్ల అనుమతి కూడా లభించడంతో వారు నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమైంది. మరోవైపు ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బోర్డు డైరెక్టర్‌గా వైదొలగిన విషయం తెలిసిందే. తమ పిల్లలకు మార్గం సుగమం చేయడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె పూర్తిగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలను చూసుకోనున్నారు.

గత ఏడాది రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బాధ్యతల్ని ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్ఫోకామ్‌ అనుబంధ సంస్థగా ఉంది. ప్లాట్‌ఫామ్స్‌ మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries). జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్‌, మెటా వంటి బడా సంస్థలకు వాటాలు ఉన్నాయి. మరోవైపు ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్‌ రిటైల్‌ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్‌ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్‌ నిర్వహణని స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని