Stock Market: మందకొడిగా మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్‌(Stock Market) సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలో లాభనష్టాల మధ్య మిశ్రమంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం సూచీలపై కనిపిస్తోంది. 

Published : 27 Apr 2023 09:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ (Stock Market)సూచీలు గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఎఫ్‌అండ్‌వోల ముగింపు ఉండటం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం సూచీలపై పడింది. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌(BSE) 44 పాయింట్ల లాభంతో 60,345 వద్ద, నిఫ్టీ(NSE) 13 పాయింట్ల లాభంతో 17,827 వద్ద ట్రేడవుతున్నాయి. సిటీ యూనియన్‌ బ్యాంక్‌, యూటీఐ ఏఎంసీ, షాపర్స్‌ స్టాప్‌, ఈకేఐ ఎనర్జీ లాభాల్లో ఉండగా.. మిర్జా ఇంటర్నేషనల్‌, బ్రైట్‌కామ్‌, గుజరాత్‌ మినరల్స్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నష్టాల్లో ఉన్నాయి. 

ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు గురువారం ఉదయం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. నేడు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ మీటింగ్‌ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీంతోపాటు అమెరికా జీడీపీ త్రైమాసిక డేటా నేడు విడుదల కానుండటంతో కూడా ఓ కారణంగా నిలిచింది. జపాన్‌, ఆస్ట్రేలియా సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడ్‌ అయ్యాయి.  

కార్పొరేట్‌ రంగంలో కీలక పరిణామాలు

* టాటా మోటార్స్‌ దీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను స్థిర అంచనాతో ‘బీబీ-’ నుంచి ‘బీబీ’కు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పెంచింది. ఆదాయాలు స్థిరంగా మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

* దిల్లీ, ముంబయిల నుంచి దుబాయ్‌కు రోజువారీ విమానాల సంఖ్యను పెంచినట్లు ఎయిరిండియా తెలిపింది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నెట్‌వర్క్‌ మార్పుల ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది.

* జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్‌ గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌కు, ఎన్‌ఐఐఎఫ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నుంచి రూ.631 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

* దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ రెండో దశ వేలంలో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో అతిపెద్ద బిడ్డర్‌గా హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ నిలిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబరులో జరిగిన మొదటి దఫా వేలంలో టొరెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దాఖలు చేసిన రూ.8,640 కోట్ల బిడ్‌ కంటే ఇది అధికం కావడం గమనార్హం. రెండో దశ వేలంలో టొరెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఓక్‌ట్రీ పాల్గొనలేదు.

* జనవరి- మార్చి త్రైమాసికానికి ఎస్‌బీఐ లైఫ్‌ నికరలాభం రూ.77.60 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.67.20 కోట్లతో పోలిస్తే ఈసారి పెరిగింది. మొదటి సంవత్సర  ప్రీమియం ఆదాయం రూ.385.30 కోట్ల నుంచి రూ.408.90 కోట్లకు; రెన్యూవల్‌ ప్రీమియం రూ.281.20 కోట్ల నుంచి రూ.398.60 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.

* సరకు రవాణా సేవలను అందించే వి-ట్రాన్స్‌ (ఇండియా) దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రాబోయే 1-2 ఏళ్లలో 600 మంది ఉద్యోగులను నియమించుకుని, వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటామని  బుధవారం ఇక్కడ వెల్లడించింది.

*జనవరి- మార్చి త్రైమాసికానికి బజాజ్‌ ఫైనాన్స్‌ ఏకీకృత పద్ధతిలో రూ.3,157.79 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.2,419.51 కోట్లతో పోలిస్తే నికర లాభం 30.51 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.8,626.06 కోట్ల నుంచి 31.68 శాతం వృద్ధితో రూ.11,359.59  కోట్లకు చేరింది.

* 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నికర లాభం పెద్దగా మార్పు లేకుండా రూ.358.66 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే మూడు నెలల్లో కంపెనీ లాభం రూ.357.52 కోట్లు. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ.16,054.94 కోట్ల నుంచి రూ.21,426.40 కోట్లకు చేరింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని