మ్యూచువ‌ల్ ఫండ్స్‌ `సిప్‌` వ‌ల‌న లాభాలేంటి?

 సిప్ అనేది మీరు మ్యూచువ‌ల్ ఫండ్‌లో ప్ర‌తి నెలా ముందుగా అంగీక‌రించిన మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టే ఏర్పాటు.

Updated : 15 Feb 2022 14:26 IST

ఎంతో రిస్క్‌తో కూడిన షేర్ల మార్కెట్‌లో ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌తో  ప్ర‌వేశించ‌కుండా, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో  చాలా మంది పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్ నిధుల‌ను అనుభ‌వజ్ఞులైన‌  మేనేజ‌ర్స్ షేర్ల‌లోనూ, వివిధ ఈక్విటీ ఫండ్ల‌లోనూ మ‌న త‌ర‌పున పెట్టుబ‌డులు పెడుతుంటారు. పెట్టుబ‌డిదారునికి షేర్ల బ‌దులు యూనిట్లు కేటాయిస్తారు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌కు డీమ్యాట్ ఖాతా అక్క‌ర్లేదు. బ్యాంక్ పొదుపు ఖాతా స‌రిపోతుంది. అదే షేర్ల కొనుగోళ్ల‌, అమ్మ‌కాల‌కు డీమ్యాట్ ఖాతా త‌ప్ప‌నిస‌రి.

అయితే మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ప్ర‌తిసారి జ్ఞాప‌కం ఉంచుకొని పెట్టుబ‌డిని ప‌ల‌నా తేదీకి ఇన్వెస్ట్ చేయాల‌ని అనుకున్నా కుదరకపోవచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో `సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌` (SIP) ఆప్ష‌న్ ఉంది. ఈ సిప్‌తో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం, ప్ర‌తి నెలా ఇలా కాల‌వ్య‌వ‌ధిని సిద్ధం చేసుకుని పెట్టుబ‌డిదారుడు బ్యాంక్ నుండి మ్యూచువ‌ల్ ఫండ్‌కి `సిప్‌` ఆప్ష‌న్ ద్వారా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్డ‌ర్‌ పెట్ట‌వ‌చ్చు. ఆయా తేదీల‌లోనే ఈ న‌గ‌దు పెట్టుబ‌డిదారుని బ్యాంకు ఖాతా నుండి మ్యూచువ‌ల్ ఫండ్‌కు బ‌దిలీ అవుతుంది.

మీ మ్యూచువ‌ల్ ఫండ్ `సిప్‌` కాల‌వ్య‌వ‌ధి ఎలా ఉండాలి.. రోజువారి, వారం లేదా నెల‌వారీ.. పెట్టుబ‌డిదారునికి ఏది స‌రిపోతుందో దాని ఆధారంగా స్వంత నిర్ణ‌యాలు తీసుకోవాలి. రోజువారీ డ‌బ్బుతో కార్య‌క‌లాపాలు చేసే వ్యాపార‌స్తులే కాకుండా, నెల‌వారీ జీతం తీసుకునే వారు కూడా త‌మ పొదుపులో న‌గ‌దుని `సిప్‌` ద్వారా పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లించ‌వ‌చ్చు. `సిప్‌` కాల‌వ్య‌వ‌ధి రోజువారీ, వారానికో లేదా నెల‌వారీ అయినా రాబ‌డిపై స్వ‌ల్ప ప్ర‌భావాన్ని క‌లిగి ఉంటుంది. కాలవ్యవధి ప్రకారం రాబడి అంచనా వేయలేము.

రోజువారి `సిప్‌`ను ఎంచుకుంటే మీ పెట్టుబ‌డిని ప‌ర్య‌వేక్షించ‌డానికి క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. మీరు ప్ర‌తి నెలా స్థిర జీతందారుడైతే వార‌పు `సిప్‌`ల‌కు వెళ్ల‌డం మంచిది. మీరు నెలసరి సిప్ లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇది మీ పెట్టుబ‌డి స‌గ‌టుకి ప్ర‌తిఫ‌లం ఉంటుంది. `సిప్‌` అనేది మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒక సాధ‌నం మాత్రమే. 

అయితే, మీ ఆర్ధిక ప‌రిస్థితిని బ‌ట్టి మీ ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్స్‌ను ఎంచుకోవ‌డంపై దృష్టి పెట్టాలి. సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది మీరు మ్యూచువ‌ల్ ఫండ్‌లో ప్ర‌తి నెలా ముందుగా అంగీక‌రించిన మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టే ఒక ఏర్పాటు. అయితే, మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఒకేసారి ఏక మొత్తాల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌వ‌చ్చు. సిప్ ద్వారా కూడా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. జ‌న‌వ‌రి చివ‌రి నాటికి మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా పెట్టుబ‌డి రూ. 5,76,588 కోట్లుగా ఉంది. జ‌న‌వ‌రిలో సిప్ ఖాతాల సంఖ్య కూడా 5 కోట్ల మార్కుని దాటింది. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబ‌డులు కూడా రూ. 38.88 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి.

అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన‌ది, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి అనేది దీర్ఘ‌కాలం ఉండాలి. 10 సంవ‌త్స‌రాలకంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డి పెట్ట‌డం మంచి విష‌యంగా ప‌రిగ‌ణించాలి. రూ. 5,000 పెట్టుబ‌డిని 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నుంచి ప్రారంభించి 35 సంవ‌త్స‌రాలు ఆగ‌కుండా `సిప్‌` పెట్టుబ‌డిని కొన‌సాగిస్తే.. ఇప్పుడు కొన‌సాగుతున్న వృద్ధిని బ‌ట్టి మీరు రూ. 7.33 కోట్ల‌ను పొందుతారు. అదే మీరు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నుండి `సిప్‌` ప్రారంభిస్తే ఈ రాబ‌డి రూ. 3.46 కోట్ల‌కు ప‌డిపోతుంది. ఇన్వెస్ట్ చేయ‌డంలో 5 ఏళ్లు ఆల‌స్యం చేస్తే రాబ‌డి స‌గానికంటే పైగా త‌గ్గిపోతుంది.

ఇంకొక ముఖ్య‌మైన విష‌యం ద్ర‌వ్యోల్బ‌ణం. 1971 నుండి వినియోగ‌దారుల ధ‌ర‌ల సూచిక 409% పెరిగింది.  1971లో రూ. 100 ఇప్పుడు 4,194 రూపాయ‌ల‌కు స‌మానం. ఈ రోజు స‌గ‌టు వార్షిక ద్ర‌వ్యోల్బ‌ణం రేటు 7.60% శాతంగా ఉంది. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే అన్ని పెట్టుబ‌డుల మాదిరిగానే మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ముందుగానే పెట్టుబ‌డి పెట్టేవారు ఆర్ధికంగా మంచి స్థానంలో ఉంటారు. డబ్బు ఎవ‌రి జీవితంలోనైనా ఒక శ‌క్తివంత‌మైన ఆయుధం. అది జీవితానికి భ‌రోసాని మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఇస్తుంది. పెట్టుబ‌డులు పెట్టేటప్పుడు మంచి ఆర్ధిక స‌ల‌హాదారుని స‌ల‌హాలు తీసుకోవ‌డం మ‌రచిపోకూడ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని