Updated : 09 Jun 2022 15:12 IST

Home Loans: గృహ రుణాల ప‌రిమితిని రెట్టింపు చేసిన‌ స‌హ‌కార బ్యాంకులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: స‌హ‌కార బ్యాంకుల గృహ రుణాల‌పై ఉన్న రుణ ప‌రిమితిని ఆర్‌బీఐ బాగా పెంచింది. పెరిగిన గృహ రుణ ప‌రిమితులు ప్రాథ‌మిక అర్బ‌న్ స‌హ‌కార బ్యాంకులు, గ్రామీణ స‌హ‌కార బ్యాంకులు రెండింటికీ వ‌ర్తిస్తాయి. పెరిగిన ఇళ్ల ధరలను దృష్టిలోఉంచుకుని ఈ పరిమితిని పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

ప‌ట్ట‌ణ‌ స‌హ‌కార బ్యాంకులు 2011లో, గ్రామీణ స‌హ‌కార బ్యాంకులు 2009లో ఈ గృహ రుణ ప‌రిమితులు చివ‌రిస‌రిగా స‌వ‌రించారు. రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహ రుణాన్ని ఇచ్చే బ్యాంకులు రూ.70 ల‌క్ష‌ల వ‌ర‌కు, రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాన్ని అంజేసే బ్యాంకులు రూ.1.40 కోట్ల వ‌ర‌కు రుణాల‌ను ఇచ్చే విధంగా ఆర్‌బీఐ నిబంధనలను స‌వ‌రించింది. రూ.100 కోట్ల కంటే త‌క్కువ నిక‌ర విలువ క‌లిగిన గ్రామీణ స‌హ‌కార బ్యాంకుల‌కు సంబంధించి రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచారు. ఇత‌ర గ్రామీణ స‌హ‌కార బ్యాంకులు రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.75 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచ‌డం జ‌రిగింది. గ్రామీణ స‌హ‌కార బ్యాంకులు, రాష్ట్ర స‌హ‌కార బ్యాంకులు, జిల్లా కేంద్ర స‌హ‌కార బ్యాంకులు కూడా రుణ ప‌రిమితుల‌ను పెంచ‌డంలో పాత్ర ఉంటుంది.

మిగ‌తా బ్యాంకుల్లా స‌హ‌కార బ్యాంకుల‌ను కూడా ఆర్‌బీఐ స‌మాన భాగ‌స్వాములుగా ప‌రిగ‌ణించింది. త‌ద్వారా వారి రుణ ప‌రిమితిని 100% పెంచింది. అంటే ఈ బ్యాంకులు ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తున్న‌ మొత్తం కంటే రెట్టింపు రుణాల‌ను ఇక‌ నుంచి ఇవ్వ‌గ‌ల‌వు. ఈ చ‌ర్య స్థిరాస్తి రంగానికి ప్ర‌ధాన ప్రోత్సాహ‌కంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు నివాస గృహ విభాగానికి సుల‌భ‌మైన రుణ‌ ల‌భ్య‌త‌ను మెరుగుప‌రుస్తుంద‌ని బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు. దాదాపు ఒక ద‌శాబ్దం క్రితం ఈ ప‌రిమితులు చివ‌రిసారిగా సవరించారు. గృహ‌, స్థిరాస్తి ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప‌రిమితి పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆర్‌బీఐ భావించింది. ఇది స‌ర‌స‌మైన నివాస రంగానికి రుణ మెరుగుద‌ల‌ను పెంచుతుంది.

ఈ గృహ రుణ ప‌రిమితిని పెంచ‌డానికి చాలా బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో స్టీల్‌, సిమెంట్‌, ఇసుక లాంటి గృహాల‌కు ఉప‌యోగించే  ప్ర‌ధాన ముడి స‌ర‌కులు ధ‌ర‌లు బాగా పెరిగి పోవ‌డం, ఇంకా ర‌వాణా ఛార్జీలు పెర‌గ‌డం, కూలీల స‌మ‌స్య కూడా ప్ర‌ధానంగా ఉండ‌టం చేత ఒక్క‌సారిగా గృహ నిర్మాణం ఖ‌ర్చులు బాగా పెరిగాయి. అంతేకాకుండా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థ‌లాల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగాయి. ఇవ‌న్నీ కూడా గృహ నిర్మాణ‌దారుడిపై అద‌నం భారంగా ఉండ‌టం చేత బ్యాంకులు రుణ ప‌రిమితిని పెంచ‌క త‌ప్ప‌లేదు. అంతేకాకుండా బ్యాంకుల వ‌ద్ద నిధుల ల‌భ్య‌తకు ఇబ్బందులు లేక‌పోవ‌డం కూడా బ‌ల‌మైన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

రుణ గ్ర‌హీత‌లు వ్య‌క్తిగ‌త గృహాలు/ ఫ్లాట్‌ల నిర్మాణం, కొనుగోలు కోసం లేదా వ్య‌క్తుల ద్వారా ఇళ్లు/ఫ్లాట్‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు, మార్పులు, చేర్పులు చేయించుకుంటే.. అటువంటి వాటి ఖ‌ర్చుల‌కు కూడా గృహ రుణాలు తీసుకోవ‌డానికి అర్హ‌త ఉంటుంది. గృహ రుణాల‌ను మార‌టోరియం లేదా తిరిగి చెల్లించే విరామ స‌మ‌యంతో స‌హా గ‌రిష్ఠంగా 20 సంవ‌త్స‌రాల‌లోపు తిరిగి గృహ రుణాన్ని చెల్లించ‌వ‌చ్చు. గృహ రుణం తీసుకున్న త‌ర్వాత తాత్కాలికంగా కొంత కాలం చెల్లింపును కూడా ల‌బ్దిదారుని అభీష్టంపై వాయిదా వేస్తారు. నిర్మాణాలు పూర్త‌య్యే వ‌ర‌కు లేదా రుణం సంబంధించి మొద‌టి విడ‌త పంపిణీ చేసిన తేదీ నుంచి 18 నెల‌లు, ఏది ముందుగా ఉంటే ఆ విధంగా మంజూరు చేస్తారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని