మీ బండికి కేవలం థ‌ర్డ్ పార్టీ బీమా స‌రిపోతుందా!

వాహనాల‌కు థ‌ర్డ్ పార్టీ బీమాతో పాటు స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీ పాల‌సీ తీసుకోవ‌డం మంచిది

Published : 20 Dec 2020 17:15 IST

మోటార్ వాహ‌నాల‌పై బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ‌(ఐఆర్‌డీఏ), తృతీయ ప‌క్ష(థ‌ర్డ్ పార్టీ) బీమా ప్రీమియంల‌ను త‌గ్గించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేవ‌లం థ‌ర్డ్ పార్టీ బీమా ఉన్నంత మాత్రానా మీ వాహ‌నం సుర‌క్షిత‌మేన‌ని మీరు భావిస్తున్న‌ట్ల‌యితే, ఈ భావ‌న‌ స‌రైన‌ది కాదు. మీ వాహ‌నానికి అగ్ని, పేలుళ్లు, ప్ర‌మాదాల వ‌ల్ల న‌ష్టం జ‌ర‌గ‌డంతో పాటు చోరికి గురైన సంద‌ర్భాల్లోనూ న‌ష్ట‌పోకుండా ఉండేందుకు స‌మ‌గ్ర బీమా పాల‌సీ క‌వ‌రేజీని పొంద‌డం మంచిది. దీంతో పాటు అద‌నంగా త‌గిన రైడ‌ర్ల‌ను కూడా ఈ పాల‌సీతో జ‌త చేస్తే మ‌రికొన్ని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఇక నుంచి 1000 సీసీ కంటే త‌క్కువ ఇంజిన్ సామ‌ర్థ్యం గ‌ల కార్ల‌పై థ‌ర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్ల‌ను ఐఆర్‌డీఏ రూ.2055 నుంచి రూ.1850 కి త‌గ్గించింది. అయితే 1000 సీసీ కంటే అధిక సామ‌ర్థ్యం గ‌ల కార్ల‌పైన విధించే ప్రీమియం రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచింది. అలాగే 75 సీసీ కంటే త‌క్కువ ఇంజిన్ సామ‌ర్థ్యం గ‌ల ద్విచ‌క్ర వాహ‌నాల‌పై వ‌సూలు చేసే ప్రీమియం రేట్లు రూ.569 నుంచి రూ.427 కి త‌గ్గాయి. అయితే 350 సీసీ కంటే ఎక్కువ సామ‌ర్థ్యం గ‌ల ద్విచ‌క్ర వాహ‌నాలపై ప్రీమియం రేట్లు మాత్రం రూ.1019 నుంచి రూ.2323 కి పెరిగాయి.

స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీ:

వాహ‌నం ఏదైనా ప్ర‌మాదానికి గురైతే స‌మ‌గ్ర బీమా పాల‌సీ త‌గిన ర‌క్ష‌ణ ఇస్తుంది. మీ స్వంత త‌ప్పిదాల వ‌ల్ల జ‌రిగిన న‌ష్టంతో పాటు, థ‌ర్డ్ పార్టీ బీమా కవ‌రేజీ కూడా ఈ పాలసీలో క‌లిపి ఉంటాయి. రోడ్డెక్కే ప్ర‌తీ వాహ‌నానికి విధిగా థ‌ర్డ్ పార్టీ బీమా ప్రీమియం ఉండాల‌ని మోటార్ వాహ‌నాల చ‌ట్టం చెబుతోంది. థ‌ర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్ల‌ను ఐఆర్‌డీఏ నిర్ణ‌యిస్తుంటుంది.

థ‌ర్డ్‌ పార్టీ బీమాలో కేవ‌లం ఎదుటి వ్య‌క్తులు, వాహ‌నాలు, ఆస్తుల వ‌ల్ల సంభ‌వించిన ప్ర‌మాదాల‌కు మాత్ర‌మే బీమా ర‌క్ష‌ణ ఉంటుంది. అయితే దొంగ‌త‌నం, లేదా మీ స్వ‌యం త‌ప్పిదాల వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌కు ఎలాంటి బీమా క‌వ‌రేజీ ఉండ‌దు. 10-15 ఏళ్లు దాటిన వాహ‌నాల‌కు బీమా క‌వ‌రేజీ ఇవ్వ‌డానికి బీమా కంపెనీలు వాహ‌న కండీష‌న్ గురించి త‌నిఖీ చేసి స‌ర్వేయ‌ర్ నుంచి నివేదిక‌ను స‌మ‌ర్పించ‌మ‌ని అడుగుతుంటాయి. ఈ నివేదికను ప్రాతిపాదిక‌గా తీసుకునే బీమా కంపెనీలు స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీని క‌ల్పిస్తాయి. దీంతోపాటు వాహ‌న మ‌ర‌మ్మ‌త్తుల ఖ‌ర్చులు పెరుగుతూ ఉంటే అందుకు త‌గ్గ‌ట్లుగా స‌మ‌గ్ర బీమా క‌వ‌రేజీని కూడా పెంచుకోవ‌డం మంచిది. ఈ నెల నుంచి ఐఆర్‌డీఏ థ‌ర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్ల‌ను త‌గ్గించింది కాబ‌ట్టి స‌మ‌గ్ర బీమా పాల‌సీతో పాటు అద‌నంగా బ్రేక్‌డౌన్‌, ఇంజిన్ క‌వ‌రేజీ, జీరో డిప్రిసియేషన్‌(వాహ‌నం విలువ త‌రుగ‌ద‌ల‌తో సంబంధం లేకుండా) వంటి రైడ‌ర్ల‌ను తీసుకోవ‌డం మంచిదని వాహ‌న రంగ నిపుణులు చెబుతున్నారు.

బీమా పాల‌సీలో నుంచి మిన‌హాయించ‌బ‌డ్డ అంశాల నుంచి మీ వాహ‌నానికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఈ రైడ‌ర్లు తోడ్ప‌డుతాయి. రైడ‌ర్ల వ‌ల్ల య‌జ‌మానుల‌కు అన‌వ‌స‌ర ఖ‌ర్చుల భారం త‌గ్గుతుంది. బేసిక్ బీమా పాల‌సీతో పాటు రైడ‌ర్ల‌ను క‌లిపి తీసుకుంటే మంచిది. దీని ధ‌ర‌ల‌ను బీమా ప్ర‌క‌టిత విలువ(ఐడీవీ) ఆధారంగా లెక్కిస్తారు. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యాల్లో ఏటా ఈ ఐడీవీ విలువ‌ను బీమా కంపెనీలు నిర్ధారిస్తు ఉంటాయి. వాహ‌నం త‌యారైన సంవ‌త్స‌రం, అమ్మ‌కం ధ‌ర‌, బ్రాండ్‌, మోడ‌ల్ బ‌ట్టి ఈ ఐడీవీ విలువ మారుతుంటుంది.

అద‌న‌పు రైడ‌ర్లు:

మీ వాహ‌నం ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు వాహ‌న విలువ‌లో త‌రుగుద‌ల‌తో సంబంధం లేకుండా వాహ‌నం ధర ఎంతుంటే అంత మొత్తాన్ని మీరు జీరో డిప్రిసియేష‌న్ క‌వ‌రేజీ ఉంటే క్లెయిం చేసుకోవ‌చ్చు. ఎలాంటి కో-పే చెల్లింపులు లేకుండా బీమా క‌వరేజీని పొడిగించుకోగ‌ల సౌల‌భ్యం దీనిలో ఉంది. అయితే దీనిని వాహ‌నం త‌యారైన ద‌గ్గ‌ర నుంచి కొద్ది సంవ‌త్స‌రాల లోపు మాత్ర‌మే ఇస్తారు. చాలా బీమా కంపెనీలు వాహ‌నం ఐదేళ్ల లోపు ఉంటే మాత్ర‌మే ఈ రైడ‌ర్‌ని ఇస్తున్నాయి. అయితే ఇంజిన్ మ‌ర‌మ్మ‌త్తులు లేదా మార్పిడికి సంబంధించి దీనిలో ఎలాంటి క‌వ‌రేజీ ఉండ‌దు. కొత్త‌గా వాహ‌నాలు కొనేవారు స‌మ‌గ్ర బీమా పాల‌సీతో పాటు జీరో డిప్రిసియేష‌న్ రైడ‌ర్‌ని తీసుకుంటే మంచిది.

అలాగే ఇంజిన్ వైఫ‌ల్యాల‌కు సంబంధించి ఇంజిన్ క‌వ‌రేజీ తీసుకుంటే వ‌ర‌దలు, నీటి ప్ర‌మాదాల నుంచి త‌గిన ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే బ్రేక్‌డౌన్ రైడ‌ర్ తీసుకంటే రోడ్డు ప్రమాదాల్లో కార్ భాగాలు దెబ్బ తిన్న‌ప్పుడు పాల‌సీదారుల‌కు ఖ‌ర్చుల భారం త‌ప్పుతుంది. అనుకోని ప్ర‌మాదాలు సంభ‌వించి వాహ‌నం దెబ్బ తిన్న‌ప్పుడు సంబంధిత బీమా కంపెనీల‌కు త‌క్ష‌ణ‌మే స‌మాచారం ఇవ్వ‌డం మంచిది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని