PV Sales: 2022లో 40 లక్షల ప్రయాణికుల వాహన విక్రయాలు!

ఈ ఏడాది ప్రయాణికుల వాహనాలకు గిరాకీ బలంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు....

Published : 12 Sep 2022 22:09 IST

మారుతీ సుజుకీ అంచనా

ఉదయ్‌పూర్‌: ఈ ఏడాది ప్రయాణికుల వాహనాలకు గిరాకీ బలంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో 2022లో విక్రయాలు 40 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రానిక్స్‌ చిప్‌ల కొరత గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

వివిధ కంపెనీల వద్ద దాదాపు 7.5 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. ఒక్క మారుతీ సుజుకీ ఇండియా వద్దే 4.18 లక్షల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఒకవేళ డిసెంబరు చివరికి 40 లక్షల వాహనాలు విక్రయమైతే.. ఒక కేలండర్‌ సంవత్సరంలో ఇప్పటి వరకు అదే రికార్డు అని తెలిపారు. ఇప్పటి వరకు 2018లో నమోదైన 33.94 లక్షల వాహన విక్రయాలే అత్యధికమని పేర్కొన్నారు.

కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడడమే ఈ రికార్డు స్థాయి విక్రయాలకు కారణమని శ్రీవాస్తవ వెల్లడించారు. వాహన విక్రయాలు ఆర్థిక వృద్ధిని అనుసరిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కరోనా సమయంలో వ్యక్తిగత వాహన వినియోగానికి డిమాండ్‌ పెరిగిందని గుర్తుచేశారు. ఆ సమయంలో భారీ ఎత్తున ఆర్డర్లు అందాయని తెలిపారు. కానీ, డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరఫరా చేయలేకపోయాయన్నారు. దీంతో ఆర్డర్లు భారీ ఎత్తున పేరుకుపోయాయని వివరించారు.

మారుతీ సుజుకీ నుంచి వచ్చే ఎర్టిగా, బ్రెజా, బాలెనో, ఎక్స్‌ఎల్‌6 వంటి వాహనాలకు సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని శ్రీవాస్తవ తెలిపారు. వీటి కోసం దాదాపు ఆరు నెలల వరకు కూడా ఆగాల్సి వస్తోందన్నారు. ఇంకా ధర ప్రకటించని కొత్త గ్రాండ్‌ విటారాకు ఇప్పటికే 52 వేలకు పైగా బుకింగ్‌లు అందాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని