Elon Musk Twitter: ట్విటర్‌ సీఈఓగా ఎలాన్‌ మస్క్‌?

తాత్కాలికంగా ఎలాన్‌ మస్కే ట్విటర్‌ సీఈఓ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.....

Published : 06 May 2022 12:42 IST

తాత్కాలికంగా ఆయనే బాధ్యతలు స్వీకరించే అవకాశం

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ (Twitter) ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లిన తర్వాత ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal) నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. తర్వాత ఆ పదవిలోకి వచ్చే కొత్తవారెవరన్న దానిపై ఇప్పటి వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, తాత్కాలికంగా ఎలాన్‌ మస్కే (Elon Musk) సీఈఓ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ పత్రికల కథనాలు పేర్కొంటున్నాయి.

ట్విటర్‌ (Twitter) 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు ప్రక్రియ అధికారికంగా పూర్తయిన వెంటనే.. మస్క్‌ (Elon Musk) సీఈఓ బాధ్యతలు స్వీకరిస్తాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి తెలిపినట్లు రాయిటార్స్ వెల్లడించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న ఆయన ఇప్పటికే టెస్లా, బోరింగ్‌ కంపెనీ, స్పేస్‌ఎక్స్‌ సంస్థలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. డీల్‌ అధికారికంగా పూర్తయ్యే వరకు పరాగ్‌ సీఈఓగా వ్యవహరించనున్నారు. 

ఈ వార్తల నేపథ్యంలో టెస్లా షేర్లు గురువారం 8 శాతానికి పైగా కుంగాయి. ట్విటర్‌ (Twitter)పై మస్క్‌ దృష్టి పెట్టడం వల్ల టెస్లాపై ఆయన శ్రద్ధ తగ్గే అవకాశం ఉందన్న ఊహాగానాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ట్విటర్‌ షేర్లు 4 శాతానికి పైగా ఎగబాకి 50.89 డాలర్లకు పెరిగింది. రోజురోజుకీ కంపెనీ షేర్ల విలువ డీల్‌ ధర అయిన 54.20 డాలర్లకు చేరువవుతుండటం గమనార్హం.

మరోవైపు డీల్‌కు కావాల్సిన నిధుల్లో దాదాపు 7.14 బిలియన్‌ డాలర్లు సమకూర్చడానికి పలువురు పెద్ద పెట్టుబడిదారులు ముందుకు వచ్చినట్లు మస్క్‌ (Elon Musk) గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీ కమిషన్లకిచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. వీరిలో సెకోయా క్యాపిటల్‌ సహా ఒరాకిల్‌ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌, సౌదీ అరేబియా యువరాజు అల్వాలీద్‌ బిన్‌ తలాల్‌ వంటి వారు ఉన్నారు. మస్క్‌ ఆఫర్‌ చేసిన ధర తనకు సమ్మతం కాదని డీల్‌ ఖరారుకు ముందు అల్వాలీద్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా ఇప్పుడు ఆయనే తన 1.89 బిలియన్‌ డాలర్లు విలువ చేసే వాటాలను డీల్‌లో భాగం చేయడానికి ముందుకు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని