Credit score: క్రెడిట్ స్కోర్‌ దేనివల్ల దెబ్బతింటుంది?

Credit score: మీ క్రెడిట్‌ స్కోర్‌ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే రుణాలు సులువుగా లభిస్తాయి.

Published : 04 Sep 2023 17:22 IST

Credit score | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో క్రెడిట్‌ స్కోరును (Credit score) మెరుగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ముందుకెళ్లాలంటే ఒక్కోసారి రుణాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే, ఈ రుణాలు అంత తేలికగా లభించవు. మంచి క్రెడిట్‌ స్కోరు, ఆర్థిక క్రమశిక్షణ లాంటివి ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ను నిర్వహించడం కష్టం కాకపోయినప్పటికీ.. అందుకు కాస్త కృషి అవసరం. మీ క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడానికి తప్పనిసరిగా నివారించల్సిన కొన్ని తప్పులను ఇక్కడ చూద్దాం..

చెల్లింపులు

క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు తేదీకి ముందే బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించండి. అలా చేయడంలో వైఫల్యం చెందితే మీ క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. పూర్తి చెల్లింపులు చేయడానికి ఆర్థిక ఇబ్బంది ఉంటే.. మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో కనీస మొత్తాన్ని చెల్లించడానికైనా ప్రయత్నించండి. అలాగని కనీస మొత్తాన్ని చెల్లిస్తే మీ బాధ్యత తీరిపోదు. కనీస మొత్తాన్ని చెల్లించడం అలవాటు చేసుకుంటే మీ రుణం పూర్తవ్వడానికి నెలలు, సంవత్సరాలు కూడా దాటిపోతుంది. వడ్డీ భారం కూడా తీవ్రంగా ఉంటుంది. అందుచేత, సాధ్యమైనంత త్వరలో మిగిలిన బకాయిలను చెల్లించడానికి నిధులను సిద్ధం చేసుకోవాలి. ఆలస్య చెల్లింపులు, డిఫాల్ట్‌లు మీ క్రెడిట్‌ నివేదికలో 7 సంవత్సరాల వరకు ఉంటాయి. కాబట్టి, మీ బిల్లులను సకాలంలో చెల్లించడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వండి. అవసరమైతే చెల్లింపుల తేదీలు మరిచిపోకుండా మీ ఫోన్‌లో క్యాలెండర్‌ రిమైండర్‌లు, ఇ-మెయిల్‌ నోటిఫికేషన్లను సెటప్‌ చేసుకోండి. బ్యాంకు ద్వారా ‘ఆటోమేట్‌’ చెల్లింపులకు ప్రయత్నించడం మంచిది.

ఈఎంఐలు

క్రెడిట్‌ కార్డు బకాయిల మాదిరిగానే, లోన్‌ ఈఎంఐ డిఫాల్డ్‌లు కూడా మీ క్రెడిట్‌ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈఎంఐ డిఫాల్ట్‌లు మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో నమోదవుతాయి. అంతేకాకుండా తరచూ పునరావృతమయ్యే డిఫాల్డ్‌లు మీ క్రెడిట్‌ స్కోర్‌కు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తాయి. భవిష్యత్‌లో క్రెడిట్‌ పొందడం మీకు సవాలుగా మారుతుంది. మీ క్రెడిట్‌ స్కోరు ఆరోగ్యంగా ఉంచడానికి మీ లోన్‌ ఈఎంఐలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి.

కార్డు పరిమితి

మీకు అందుబాటులో ఉన్న నెలవారీ క్రెడిట్‌ కార్డు పరిమితిని అనేక సార్లు పూర్తిగా ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్‌ స్కోరు దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో 30% మాత్రమే ఉపయోగించుకుంటే మంచిది. దీనికన్నా తరచూ వినియోగం దాటుతుంటే మాత్రం.. మీ క్రెడిట్‌ స్కోరు కొన్ని పాయింట్లు తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను పెంచాలని క్రెడిట్‌ కార్డు జారీ సంస్థను అభ్యర్థించాలి. మీ అర్హతను బట్టి సాధ్యమైనంత త్వరలో మరొక క్రెడిట్‌ కార్డును పొంది, రెండు కార్డులు సమానంగా వినియోగించడం వల్ల కార్డు వినియోగ పరిమితిని 30%లోపు తగ్గించుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు క్లోజ్‌

క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. కానీ చాలా మంది వ్యక్తులు తమకు తెలియకుండా చేసే ఒక పెద్ద తప్పు ఇది. ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగిన వారు ఒక్కోసారి ఎక్కువ కాలం నుంచి ఉపయోగిస్తున్న క్రెడిట్‌ కార్డును మూసి వేస్తారు. పాత క్రెడిట్‌ కార్డు మెరుగైన క్రెడిట్‌ రికార్డును కలిగి ఉన్నప్పుడు.. దీన్ని రద్దు చేయడం వల్ల క్రెడిట్‌ రికార్డు పోతుంది. ఉదాహరణకు మీరు 5 సంవత్సరాల నుంచి ఒక కార్డు, 2 సంవత్సరాల నుంచి ఒక కార్డు కలిగి ఉంటే.. మీకు సగటున 3.5 సంవత్సరాల క్రెడిట్‌ ఉన్నట్టు. మీరు 5 సంవత్సరాల పాత కార్డును మూసి వేస్తే, మీ క్రెడిట్‌ వయసు 2 సంవత్సరాలకు తగ్గుతుంది. అంతేకాకుండా వినియోగం పెరిగినప్పుడు ఖర్చంతా ఒకే కార్డు మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో కార్డు వినియోగ పరిమితి (CUR) పెరిగిపోతుంది. ఇది కూడా మళ్లీ క్రెడిట్‌ స్కోరు తగ్గడానికి కారణమౌతుంది.

అసురక్షిత రుణాలు

మీ పేరు మీద అనేక అసురక్షిత రుణాలు ఉండడం మీ ఆర్థిక నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ బహుళ రుణాల వల్ల ఆర్థిక భారం ఉంటుంది. కాబట్టి, చెల్లింపులు కష్టతరం కావచ్చు. వీటి వల్ల క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది.

రుణ దరఖాస్తులు

మీరు రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్‌ యోగ్యతను చెక్‌ చేయడానికి రుణ సంస్థ మీ క్రెడిట్‌ నివేదిక కోసం ఎంక్వైరీ చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు రుణానికి ప్రయత్నిస్తే.. ఈ ఎంక్వైరీలన్నీ రికార్డవుతాయి. మీ దరఖాస్తులు బ్యాంకులకు కనిపిస్తాయి. ఇది మిమ్మల్ని ఆర్థిక సమస్యలున్న వ్యక్తిగా, క్రెడిట్‌ కోసం తాపత్రయ పడే వ్యక్తిగా పరిగణిస్తాయి. ఈ అంశం కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గడానికి కారణమవుతుంది. అందుచేత, రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు అనేక రుణసంస్థల్లో దరఖాస్తు చేయకుండా అన్ని అంశాలను పరిశీలించి ఒకే సంస్థను ఆశ్రయించడం మంచిది.

క్రెడిట్‌ నివేదికలో తప్పులు

మీ క్రెడిట్‌ రిపోర్ట్‌.. ఆర్థిక చరిత్రను ప్రతిబింబించే అద్దం లాంటిది. మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లో పొరపాట్లు, వ్యత్యాసాలు మీకు సంబంధం లేకుండా జరిగినా మీకే ఇబ్బంది. క్రెడిట్‌ నివేదికలో రుణ మొత్తం, చెల్లింపుల తేదీలు, బకాయి మొత్తం మొదలైనవి ఉంటాయి. ఒకవేళ మీ క్రెడిట్‌ నివేదికలో లోన్‌ రీపేమెంట్‌ వివరాలు సరిగ్గా నమోదు అవ్వకపోతే.. ఇది మీ క్రెడిట్‌ స్కోరును తగ్గించే అవకాశం ఉంది. మీ క్రెడిట్‌ రిపోర్టును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా ఇటువంటి తప్పుల గురించి ముందే తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు.

రుణ సెటిల్‌మెంట్‌

రుణ సెటిల్‌మెంట్‌ అంటే... బ్యాంకు రుణ మొత్తంలో కొంత భాగాన్ని తగ్గించి రుణగ్రహీతతో సెటిల్మెంట్‌ చేసుకుంటుంది. రుణంలో కొంత భాగం చెల్లించనకర్లేదు కాబట్టి, ఇది రుణగ్రహీతకు ఆకర్షణీయంగా కనిపించొచ్చు. కానీ, ఇది మీ క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్‌ స్థితిని తక్కువ చేస్తుంది. ఇలా సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి బదులుగా, రుణాన్ని తీర్చడానికి మరికొద్ది సమయం కావాలని బ్యాంకును కోరితే మంచిది.

యాడ్‌-ఆన్‌ కార్డు

యాడ్‌-ఆన్‌ కార్డులు అంటే ప్రాథమిక క్రెడిట్‌ కార్డుకు అనుబంధ కార్డులు. వీటిని జీవిత భాగస్వామికి, పిల్లలకు అనుబంధంగా బ్యాంకులు జారీ చేస్తాయి. ఈ యాడ్‌-ఆన్‌ కార్డులు ఎవరు ఉపయోగించినా.. ఎంత ఖర్చు చేసినా ఆ ఖర్చంతా ప్రాథమిక కార్డుదారుడి క్రెడిట్‌ కార్డులో కలుస్తుంది. ఆ బకాయిని చెల్లించాల్సింది కూడా ప్రైమరీ కార్డు హోల్డరే. కాబట్టి, యాడ్‌-ఆన్‌ కార్డుదారులు అధికంగా ఖర్చు పెడితే.. ఆ బకాయిలను తీర్చలేని పరిస్థితిలో ప్రాథమిక కార్డుదారుడి క్రెడిట్‌ స్కోరు ప్రభావితమవుతుంది.

నగదు అడ్వాన్స్‌

మీ క్రెడిట్‌ కార్డుతో ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయొచ్చు. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. సాధారణ కొనుగోళ్లకు ఉండే గ్రేస్‌ పీరియడ్‌ దీనికి వర్తించదు. అంతేకాకుండా నగదు అడ్వాన్సు రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఇది అడ్వాన్స్‌లో 3-5% వరకు ఉండొచ్చు. ఈ మొత్తానికి వడ్డీ కూడా అధికంగానే ఉంటుంది. నెలకు 3-4% వరకు వడ్డీ ఉండొచ్చు. చాలా మంది ఈ నగదు విత్‌డ్రా చేసిన తర్వాత చెల్లింపుల విషయంలో డిఫాల్టవుతారు. ఇది కూడా క్రెడిట్‌ స్కోరు తగ్గడానికి కారణమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని