Stock Market: భారత స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపే 5 కీలక అంశాలు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల కదలికలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్థూల, సూక్ష్మ అర్థశాస్త్ర కారణాల కింద వర్గీకరించొచ్చు....

Published : 29 Mar 2022 12:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీల కదలికలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్థూల, సూక్ష్మ అర్థశాస్త్ర కారణాల కింద వర్గీకరించొచ్చు. కంపెనీల అంతర్గత అంశాలు ఆ సంస్థ షేర్లపై ప్రభావం చూపుతుంటాయి. ఇవి సూక్ష్మ అర్థశాస్త్ర కారణాలుగా చెప్పొచ్చు. సంస్థతో సంబంధం లేకుండా యావత్తు దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు కూడా షేర్లను ప్రభావితం చేస్తుంటాయి. వీటినే స్థూల అర్థశాస్త్ర కారణాల కింద వర్గీకరిస్తుంటారు. వీటిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచితే.. మార్కెట్‌ సూచీల కదలికల్ని ముందే అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లోకి అడుగుపెడుతున్న వారు వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డాలర్‌ సూచీ..

భారత మార్కెట్‌ సూచీలను ప్రభావితం చేయడంలో డాలర్‌ ఇండెక్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండింటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే.. మరొకటి తగ్గడమన్నమాట! డాలర్‌ పెరిగిన ప్రతిసారీ భారత సూచీలు కుంగుబాటుకు గురవడం గమనించొచ్చు. ఈ రెండింటికి సంబంధించిన గత కొన్నేళ్ల చార్టులను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణమేంటంటే..

డాలర్‌ విలువ పడిపోతే.. విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్‌లో మదుపు చేయడానికి మొగ్గుచూపుతారు. డాలర్లలో మదుపు చేయడం కంటే భారత స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడికి ఆస్కారం ఉండడమే అందుకు కారణం. అదే డాలర్‌ విలువ పెరిగితే భారత మార్కెట్లు పతనాన్ని చవిచూస్తాయి. ముఖ్యంగా డాలర్లలో లావాదేవీలు ఎక్కువగా ఉండే రంగాల్లోని కంపెనీలపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్స్‌, ఆయిల్‌అండ్‌గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, లోహ.. రంగాలపై డాలర్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.

చమురు ధరలు..

చమురు ధరలు, భారత మార్కెట్ల మధ్య కూడా విలోమ సంబంధమే. భారత్‌ నికర చమురు దిగుమతిదారుగా ఉంది. మన దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. ముడి చమురు ధరలు పెరిగితే.. టైర్లు, లాజిస్టిక్స్‌, శుద్ధి కర్మాగారాలు, విమానయానం, ల్యూబ్రికెంట్స్‌, పెయింట్స్‌.. వంటి రంగాలు నేరుగా ప్రభావితమవుతాయి. నిఫ్టీ50లో ఇంధన ఆధారిత కంపెనీలది 12.5 శాతం వాటా. అదే సెన్సెక్స్‌లో ఈ వాటా 15 శాతంగా ఉంది. పైగా చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి ఫలితంగా ద్రవ్యోల్బణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఇది కూడా మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక అంశం.

అమెరికా 10 ఏళ్ల బాండ్ల రాబడులు..

ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు 10 ఏళ్ల కాలపరిమితి గల అమెరికా బాండ్లలో మదుపు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. వీటిని సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా పరిగణిస్తుంటారు. కాబట్టి ఈ బాండ్ల రాబడులు పెరిగితే పెట్టుబడులు అటువైపు మళ్లుతాయి. అలాగే బాండ్ల రాబడులు పెరిగిన ప్రతిసారీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లనూ పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతుంటాయి. దీంతో భారత్‌ సహా ఇతర మార్కెట్లలో ఉన్న పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు ఉపసంహరించుకొని బాండ్లవైపు మొగ్గుచూపుతుంటారు. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేలచూపులు చూస్తుంటాయి.

అమెరికా మార్కెట్‌ సూచీలు..

ప్రపంచీకరణ కారణంగా యావత్తు ప్రపంచం ఒకే ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఒకదానికొకటి అనుసంధానమైపోయాయి. అదే తరహాలో మెజారిటీ దేశీయ కంపెనీలు ఏదో రకంగా విదేశీ కంపెనీలతో సంబంధాలు కలిగి ఉంటాయి. మనందరికీ తెలిసినట్లుగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. సాధారణంగానే అక్కడి మార్కెట్లలో ఏమాత్రం ప్రతికూల సంకేతాలు ఉన్నా.. ఆ ప్రభావం భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తుంటుంది. దీనికి 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మంచి ఉదాహరణ.

ఇతర భారత మార్కెట్‌ సూచీలు..

భారత స్టాక్‌ మార్కెట్లను విశ్లేషించేందుకు నిఫ్టీ మిడ్‌క్యాప్‌, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్స్‌, సెన్సెక్స్‌.. ఇలా ప్రతి సూచీని నిశితంగా పరిశీలించాలి. డోజోన్స్‌ థియరీ ప్రకారం.. వీటన్నింటి సగటును ప్రధాన సూచీ ప్రతిబింబించాలి. లేదంటే మార్కెట్లు ప్రతికూల దశలో పయనించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని