Gautam Adani: హిండెన్‌ బర్గ్‌ను ఎదుర్కొనేందుకు అదానీ వ్యూహం ఇదీ..!

భారత్‌ మార్కెట్లను భయపెట్టిన హిండెన్‌బర్గ్‌ నివేదికను తాము విభిన్నమైన వ్యూహంతో ఎదుర్కొన్నామని గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. ఆ స్ట్రాటజీని ఆయనే స్వయంగా వివరించారు.

Updated : 14 Mar 2024 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ భారత్‌కు చెందిన అదానీ గ్రూపుపై చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్‌ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి.. హిండెన్‌బర్గ్‌ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచింది. ఈ విషయాన్ని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌతమ్‌ అదానీ (Gautam Adani) స్వయంగా వెల్లడించారు. ఆ వ్యూహమేమిటో ఆయన మాటల్లోనే..

పాత ఆరోపణలే అని తొలుత పట్టించుకోలేదు..

‘‘హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై నా స్పందన విషయానికొస్తే.. తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొందని గుర్తించాను. గతంలో వంటిదేనని భావించాను. తొందరగానే ఆ వివాదం చల్లారుతుందనుకొన్నాను. ఇలాంటివి సర్వసాధారణమే అని సర్దిచెప్పుకొన్నాను’’ 

రెండువైపులా పదునున్న దాడి..

‘‘హిండెన్‌ బర్గ్‌ చేసిన పని సామాన్యమైంది కాదు.. ప్రపంచంలో ఓ కార్పొరేట్‌ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి. ఇది చాలా విభిన్నమైందని చెప్పేందుకు నేను వెనుకాడను. సాధారణంగా షార్ట్‌సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్‌ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకొంది. ఈ రెండు వేదికలపై చాలా సమన్వయంతో మమ్మల్ని లక్ష్యంగా చేసుకొన్నారు. హిండెన్‌ బర్గ్‌ నివేదిక ఫలితాన్ని నేను తొలుత తక్కువగా అంచనావేశాను’’

ఎదుర్కొనేందుకు పలు అంచెల వ్యూహం..

‘‘చాలా తొందరగానే హిండెన్‌బర్గ్‌ కుట్రలోతును అర్థం చేసుకొన్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దీంతో మా సొంతంగా విభిన్నమైన ప్లాన్‌ సిద్ధం చేసుకొన్నాం. దీనిలో భాగంగా తొలుత నైతికత చూపుతూ మా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకొన్నాం. 

ఆ తర్వాత రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్‌ మార్జిన్‌ లింక్డ్‌ ఫైనాన్సింగ్‌తో అత్యంత శక్తిమంతమైన నిధిని ఏర్పాటు చేసుకొన్నాం. 

మా వ్యాపార సామ్రాజ్యంలోని కీలకమైన సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లను వివాదం గురించి పట్టించుకోకుండా వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టాలని సూచించాం.

అదే సమయంలో కంపెనీ వృద్ధి రేటును కొనసాగేలా చూశాం. ఖావ్డ, ధారావి, కాపర్‌ స్మెల్టర్‌ వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. అదే సమయంలో ఓ వార్‌రూమ్‌ ఏర్పాటు చేశాను. ఎదురైన అన్ని ప్రశ్నలకు మేం సమాధానం ఇచ్చాం. మా భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’’ 

చిరు వాటాదార్లు నష్టపోవడం బాధించింది..

‘‘ఈ మొత్తం వ్యవహారం నుంచి మేం ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్‌ మరింత పెంచుకోవాలి. అది సమయానుకూలంగా.. ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవాలి. హిండెన్‌బర్గ్‌ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. అకారణంగా వారు డబ్బు పోగొట్టుకొన్నారు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం కూడా లేదు. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక ఈ విషయం తేటతెల్లం అయింది’’ అని గౌతమ్‌ అదానీ తమ కంపెనీ పోరాటాన్ని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని