Gautam Adani: గుజరాత్‌లో అదానీ గ్రూప్‌ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

Gautam Adani: వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.

Updated : 10 Jan 2024 14:08 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్‌ (Adani Group ) ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) ప్రకటించారు. 2025 నాటికి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో రూ.55 వేల కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌ 2024’ (Vibrant Gujarat Summit 2024)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బుధవారం ఈ ప్రకటన చేశారు.

‘‘ప్రధాని మోదీజీ.. మీరు భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాదు.. దాన్ని తీర్చిదిద్దుతున్నారు. మీ నాయకత్వంలో 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతోంది. ప్రపంచ పటంలో భారత్‌ను మీరు శక్తిమంతమైన దేశంగా నిలిపారు. స్వయం సమృద్ధిగా మార్చారు. గత దశాబ్ద కాలంలో సాధించిన పురోగతి అనిర్వచనీయం. 2014 నుంచి దేశ ‘స్థూల దేశీయోత్పత్తి (GDP)’ 185 శాతం, తలసరి ఆదాయం 165 శాతం పెరిగింది. గత పదేళ్లలో తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్‌ మహమ్మారి వంటి సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ విజయాలు అసమానమైనవి’’ అని అదానీ (Gautam Adani) వ్యాఖ్యానించారు.

గుజరాత్‌ కచ్‌ జిల్లాలోని ఖావ్‌డాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన పార్కును నిర్మిస్తున్నట్లు అదానీ (Gautam Adani) తెలిపారు. 725 చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంటుందని వెల్లడించారు. భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా మార్చడంలో భాగంగా అదానీ గ్రూప్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని వివరించారు. సౌర ఫలకలు, విండ్‌ టర్బైన్లు, హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్లు, హరిత అమ్మోనియా, పీవీసీ, సిమెంట్‌, రాగి ఉత్పత్తిని విస్తరిస్తున్నామని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని