Published : 09 Aug 2022 04:50 IST

Mukesh Ambani: 1000 నగరాల్లో జియో 5జీ

హరిత ఇంధనంలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు

రూ.30,000 కోట్లతో రిటైల్‌ వ్యాపార విస్తరణ

రిలయన్స్‌ వార్షిక నివేదిక 2021-22

దిల్లీ: టెలికాం దిగ్గజం జియో దేశంలోని 1000 నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు వ్యవస్థను సిద్ధం చేసింది. సొంత 5జీ టెలికాం గేర్లతో ఇప్పటికే క్షేత్రస్థాయి పరీక్షలను నిర్వహించినట్లు మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తన వార్షిక నివేదిక 2021-22లో వెల్లడించింది. 6జీ పరిశోధనలో ముందున్న ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఓలుతోనూ జియో చేతులు కలిపినట్లు వెల్లడించింది. టెలికాం రంగంలో జియోతో ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో, భవిష్యత్తులో హరిత ఇంధన వ్యాపారంలోనే అదే తరహా దూకుడు ప్రదర్శించాలని రిలయన్స్‌ బావిస్తోంది. ఈ రంగంలో  రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ‘వచ్చే 12 నెలల్లో హరిత ఇంధన వ్యాపారంలో మా పెట్టుబడులు ప్రారంభం కానున్నా’ని కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. ‘వచ్చే 5-7 ఏళ్లలో ఈ కొత్త వ్యాపారం ప్రస్తుత అన్ని వ్యాపారాలన్నిటి కంటే ముందుండి నడిపిస్తుంద’ని అంబానీ అంచనా వేశారు. ‘ప్రజలకు ఏ కొత్త సాంకేతికతను దగ్గర చేయాలన్నా.. ప్రయోజనం చేకూర్చాలన్నా.. అందుబాటు ధర చాలా కీలకమని మాకు తెలుసు. వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో సృష్టించిన రికార్డులను ఈ రంగంలో తిరగరాస్తామ’ని పేర్కొన్నారు.

1.5 లక్షల ఉద్యోగాలు

2021-22లో రిలయన్స్‌ ఇండస్టీస్‌ తన రిటైల్‌ వ్యాపారంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది.  2,500 కొత్తవి జత చేరడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 15,196కు చేరుకుంది. గిడ్డంగుల స్థలాన్ని రెట్టింపు చేసి 22.7 మిలియన్‌ చదరపు అడుగులకు చేర్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలివ్వడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3.61 లక్షలకు చేరింది.

అంబానీకి.. రెండో ఏడాదీ సున్నా వేతనమే

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలోనూ వేతనం తీసుకోలేదు. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ ప్రభావం పడినందున 2020-21లో తన వేతనాన్ని వదిలేసుకుంటున్నట్లు జూన్‌ 2020లో ముకేశ్‌ ప్రకటించారు. 2021-22లోనూ ఆయన ‘సున్నా’ వేతనం పొందారు. ఈ రెండేళ్లలో ఎటువంటి భత్యాలు, ప్రయోజనాలు, స్టాక్‌ఆప్షన్లను ఆయన పొందలేదు. 2008-09 నుంచి వార్షిక వేతనాన్ని పరిమితం చేసుకుని, 2019-20 వరకు ఏటా రూ.15 కోట్ల చొప్పున ముకేశ్‌ అందుకున్నారు. ఆయన బంధువులైన నిఖిల్‌, హితాల్‌ మేస్వానీల వార్షిక వేతనం రూ.24 కోట్ల వద్దే మార్పు లేకుండా ఉంది. వారికి రూ.17.28 కోట్ల కమీషన్‌ జత చేరింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లయిన పీఎమ్‌ఎస్‌ ప్రసాద్‌కు రూ.11.99 కోట్ల నుంచి రూ.11.89 కోట్లకు;, పవన్‌ కుమార్‌ కపిల్‌కు రూ.4.24 కోట్ల నుంచి రూ.4.22 కోట్లకు వేతనం తగ్గింది.
* ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కంపెనీ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సిట్టింగ్‌ ఫీజు రూపంలో రూ.5 లక్షలు, కమీషన్‌ రూపంలో రూ.2 కోట్లు పొందారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని