టాటా స్టీల్‌లో 7 లోహ కంపెనీల విలీనం

తన 7 లోహ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేయాలని టాటా గ్రూపు నిర్ణయించింది. సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు, వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిగా షేర్ల బదిలీ ద్వారా ఈ విలీన ప్రక్రియ జరగనుందని

Published : 24 Sep 2022 03:00 IST

సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపు కోసమే

దిల్లీ: తన 7 లోహ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేయాలని టాటా గ్రూపు నిర్ణయించింది. సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు, వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిగా షేర్ల బదిలీ ద్వారా ఈ విలీన ప్రక్రియ జరగనుందని టాటా స్టీల్‌ వెల్లడించింది. అనుబంధ సంస్థలైన టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్, టాటా మెటాలిక్స్, ద టిన్‌ప్లేట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, టీఆర్‌ఎఫ్, ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రోడక్ట్స్, టాటా స్టీల్‌ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ కంపెనీలను విలీనం చేసుకునేందుకు టాటా స్టీల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా మెటాలిక్స్, టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ విలీనం కోసం ఇంతకుముందు చేసిన ప్రతిపాదనను టాటా స్టీల్‌ ఉపసంహరించుకుంది.

షేర్ల స్వాప్‌ నిష్పత్తి ఇలా..

టాటా స్టీల్‌లో 7 లోహ కంపెనీల విలీనానికి సంబంధించి షేర్ల స్వాప్‌ నిష్పతి ఇలా ఉండనుంది.

* టీఆర్‌ఎఫ్‌కు 17:10 శ్రేణిలో అంటే 10 టీఆర్‌ఎఫ్‌ షేర్లకు గాను 17 టాటాస్టీల్‌ షేర్లు జారీ చేస్తారు.

* టీఎస్‌ఎఫ్‌ఎల్‌కు 67:10 (పది టీఎస్‌ఎఫ్‌ఎల్‌ షేర్లకు గాను 67 టాటాస్టీల్‌ షేర్ల జారీ)

* టిన్‌ ప్లేట్‌కు 33:10 (10 టిన్‌ ప్లేట్‌ షేర్లకు గాను 33 టాటాస్టీల్‌ షేర్లు)

* టాటా మెటాలిక్స్‌ 79:10 (10 టిన్‌ ప్లేట్‌ షేర్లకు గాను 79 టాటా షేర్లు)

* ఏడు లోహ సంస్థల్లో మెజార్టీ వాటా టాటా స్టీల్‌కే ఉంది. టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌లో 74.91%, టిన్‌ప్లేట్‌లో 74.96%, టాటా మెటాలిక్స్‌లో 60.02%; ఇండియన్‌ స్టీల్‌ అండ్‌ వైర్‌ ప్రోడక్ట్స్‌లో 95.01% చొప్పున వాటా కలిగి ఉంది.

* టాటా స్టీల్‌ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌లు టాటా స్టీల్‌కు 100 శాతం అనుబంధ సంస్థలుగా ఉన్నాయి.

* టీఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ (34.11 శాతం ఈక్విటీ వాటా)ను టాటాస్టీల్‌లో విలీనం చేయాలని బోర్డు నిర్ణయించింది.

* ప్రతిపాదన విలీనానికి ఈ సంస్థల బోర్డులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని టాటా స్టీల్‌ వెల్లడించింది. ఒక్కో సంస్థ విలీన ప్రతిపాదనకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఎన్‌సీఎల్‌టీ సహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

* విలీన సంస్థల వనరులను ఒక్క చోటకే తేవడం ద్వారా, వ్యయాలు తగ్గించుకుని, వాటాదార్ల విలువను మరింత పెంచేందుకు అవకాశం ఉంటుందని టాటా స్టీల్‌ తెలిపింది. ముడి పదార్థాలకు రక్షణ, కేంద్రీకృత సమీకరణ, వనరుల సమర్థ వినియోగం, రవాణా వ్యయాలను తగ్గించడం, ప్రాంగణాలను మెరుగ్గా వాడుకునేందుకు వీలవుతుందని పేర్కొంది.

చంద్రశేఖరన్‌ నేతృత్వంలో

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ పగ్గాలు చేపట్టాక.. గ్రూప్‌లో ఒకే తరహా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలను ఏకీకృతం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టాటా కన్జూమర్, టాటా కాఫీల విలీనం కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా విమానయాన రంగంలోనూ ఎయిరిండియాలో ఎయిరేషియా ఇండియా, విస్తారాను విలీనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని