సంక్షిప్త వార్తలు

డీమార్ట్‌ సూపర్‌మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం.

Published : 05 May 2024 02:22 IST

డీమార్ట్‌ లాభం రూ.563 కోట్లు

దిల్లీ: డీమార్ట్‌ సూపర్‌మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.10,594 కోట్ల నుంచి రూ.12,727 కోట్లకు పెరిగింది. నీ 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఏకీకృత నికరలాభం రూ.2536 కోట్లకు పెరిగింది. 2022-23లో ఇది రూ.2378 కోట్లే. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.42,840 కోట్ల నుంచి రూ.50,789 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 41తో కలిపి, మొత్తం విక్రయశాలల సంఖ్య 365కు చేరింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, డెలివరీ ఇస్తున్న డీమార్డ్‌ రెడీ వ్యాపార విభాగం కూడా రాణిస్తోందని, దేశంలోని 23 నగరాల్లో ఈ సేవలందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.


జెన్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: జెన్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.138.04 కోట్ల ఆదాయాన్ని, రూ.33.03 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.3.96గా నమోదైంది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.74.33 కోట్లు, నికరలాభం రూ.17.27 కోట్లే ఉన్నాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం, లాభం బాగా పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జెన్‌ టెక్నాలజీస్‌ రూ.444.20 కోట్ల ఆదాయాన్ని, రూ.129.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.15.61 నమోదైంది. 2022-23లో ఆదాయం రూ.168.48 కోట్లు, నికరలాభం రూ.37.63 కోట్లు, ఈపీఎస్‌ రూ.4.75గా ఉన్నాయి. వాటాదార్లకు 100 శాతం (రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరుకు   రూ.1 చొప్పున) తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.1,402 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.


44% పెరిగిన ఐడీబీఐ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,628 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,133 కోట్లతో పోలిస్తే ఇది 44% ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.7,014 కోట్ల నుంచి రూ.7,887 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.3,280 కోట్ల నుంచి రూ.3,688 కోట్లకు చేరింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 55% పెరిగి జీవన కాల (ఆల్‌టైమ్‌) గరిష్టమైన రూ.5,634 కోట్లకు చేరింది. 2022-23లో ఇది   రూ.3,645 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.24,942 కోట్ల నుంచి రూ.30,037 కోట్లకు పెరిగింది.  
  • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.50 (15%) చొప్పున డివిడెండ్‌ను చెల్లించేందుకు బ్యాంక్‌ బోర్డు ప్రతిపాదించింది.

రష్యా నుంచి అధికం.. సౌదీ, ఇరాక్‌ నుంచి తగ్గింపు
ఏప్రిల్‌లో చమురు దిగుమతులు ఇలా

దిల్లీ: భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. మన దేశానికి రష్యానే అతిపెద్ద ముడిచమురు సరఫరాదారుగా కొనసాగుతుంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో రష్యా నుంచి మనదేశానికి చమురు దిగుమతులు పెరగ్గా, ఇరాక్‌, సౌదీ అరేబియా నుంచి తగ్గినట్లు కెప్లెర్‌, ఎల్‌ఎస్‌ఈజీల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. రష్యా నుంచి భారత రిఫైనరీ సంస్థల చమురు కొనుగోళ్లు ఏప్రిల్‌లో 13-17% పెరిగాయి. ఇరాక్‌ నుంచి 20-23% తగ్గాయి. ఏప్రిల్‌లో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజుకు 1.75 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉండగా, మే నెలలో ఈ మొత్తం రోజుకు 1.1 మిలియన్‌ బ్యారెళ్లకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక, తక్కువ ధరకు లభిస్తున్నందున రష్యా నుంచి చమురు కొనుగోళ్లను  భారత రిఫైనరీలు పెంచిన సంగతి తెలిసిందే. రష్యా చమురు ఎగుమతులపై పాశ్చాత్య దేశాల ఆంక్షల దృష్ట్యా, చౌకగా చమురు లభించడాన్ని భారత్‌ తనకు అనుకూలంగా మల్చుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని