పేటీఎం సీఓఓ భవీశ్‌ గుప్తా రాజీనామా

పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీఓఓ) భవీశ్‌ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపులు, కాంప్లియెన్సెస్‌ తదితర విభాగాలను భవీశ్‌ నడిపించేవారు.

Published : 05 May 2024 02:22 IST

దిల్లీ: పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీఓఓ) భవీశ్‌ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపులు, కాంప్లియెన్సెస్‌ తదితర విభాగాలను భవీశ్‌ నడిపించేవారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షల నేపథ్యంలో ఆ వ్యాపారం పూర్తిగా ప్రభావితమైంది. దీంతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా, వృత్తి జీవితంలో విరామం తీసుకోవాలని నిర్ణయించుకుని భవీశ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరు వరకు ఆయన పేటీఎం వృద్ది అవకాశాలపై సలహాదారు పాత్ర పోషించనున్నారని సమాచారం. క్లిక్స్‌ క్యాపిటల్‌ (గతంలో జీఈ క్యాపిటల్‌) నుంచి 2020 ఆగస్టులో గుప్తా పేటీఎంలో చేరారు. ఈ నెల 31న ఆయన కంపెనీ నుంచి వైదొలగనున్నారు. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షలతో రూ.300-500 కోట్ల మేర నష్టాన్ని పేటీఎం అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలోనే పేటీఎం మనీ సీఈఓగా రాకేశ్‌ సింగ్‌ను నియమించింది. పేటీఎం సర్వీసులకు సీఈఓగా వరుణ్‌ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని