ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!

దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి.

Published : 05 May 2024 02:25 IST

2033కు రావొచ్చు: ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌

దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. 2033 నాటికి దేశంలో ప్రయాణ, పర్యాటక రంగాల్లో 5.82 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని గ్లోబల్‌ టెక్నాలజీ, డిజిటల్‌ నైపుణ్యాలు అందించే ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ అంచనా వేసింది. ‘దేశంలో ప్రయాణ, పర్యాటక రంగం వృద్ధి జోరు కొనసాగుతోంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో స్థిరమైన ఉపాధి కల్పనకు ఇది దారితీయనుంది. 2020 నాటికి చూస్తే పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం ఉద్యోగుల్లో ఇది 8 శాతానికి సమానం. కరోనా తర్వాత వేగంగా పుంజుకున్న రంగాల్లో ఇదొకటి’ అని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈఓ సచిన్‌ అలుగ్‌ తెలిపారు. 2023 ఆగస్టులో పర్యాటక రంగంలో నిపుణులకు గిరాకీ 44% పెరిగిందని, 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలు లభించాయని అన్నారు. విదేశీ మారకపు ద్రవ్యం ఆర్జించేందుకు కీలక వనరుగా ప్రయాణ - పర్యాటక రంగం ఉందని, 2022లో భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.9 లక్షల కోట్లు (దాదాపు రూ.191.25 బిలియన్‌ డాలర్లు) సమకూర్చిందని వెల్లడించారు. 2023లో ఇది    రూ.16.5 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా వేశారు.

దేశీయ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అగ్రగామి అయిదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. నియామకాలు ఎక్కువగా ఉన్న అగ్రశేణి నగరాల్లో దిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, పుణె, కొచి.. ద్వితీయ శ్రేణి నగరాల్లో జైపుర్‌, అహ్మదాబాద్‌, చండీగఢ్‌ నిలిచాయి.

ఉద్యోగాల వారీగా చూస్తే.. విక్రయాలు (18%), బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (17%), చెఫ్‌లు (15%), ట్రావెల్‌ కన్సల్టెంట్లు (15%), టూర్‌ ఆపరేటర్లు (15%), ట్రావెల్‌ ఏజెంట్‌లు (15%), హోటలియర్స్‌ (15%), గైడ్‌లు (20%), వైల్డ్‌లైఫ్‌ ఎక్స్‌పర్ట్‌లు (12%), ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రొవైడర్ల (15%)కు అధిక గిరాకీ ఉంది.

  • ఇవి దూసుకెళ్తాయ్‌: ప్రయాణ, పర్యాటక రంగం మార్పులకు లోనవుతోందని.. ఉపవిభాగాలైన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ట్రావెల్‌, మత ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటకం, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ టూరిజం, ఎకో టూరిజం, కల్చరల్‌ టూరిజం, రూరల్‌ టూరిజం వంటివి వచ్చే దశాబ్దాంలో దూసుకెళ్లొచ్చని సచిన్‌ తెలిపారు.
  • ఈ రంగంలో గిరాకీని అందుకునేందుకు గిగ్‌ విధానాన్ని సైతం కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ట్రాన్స్‌లేటర్‌లు, ఫోటోగ్రాఫర్లు, టూర్‌ గైడ్‌లు వంటి తాత్కాలిక ఉద్యోగాలు 14% పెరిగాయి. వచ్చే రెండేళ్లలో ఇవి 18-20% పెరిగే అవకాశం ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని