కేకేఆర్‌ చేతికి హెల్తియమ్‌ మెడ్‌టెక్‌

సర్జికల్‌ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్‌ మెడ్‌టెక్‌లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్‌ రూ.7,000 కోట్ల (840 మిలియన్‌ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది.

Published : 05 May 2024 02:26 IST

విలువ రూ.7,000 కోట్లు
అపాక్స్‌ నుంచి కొనుగోలుకు రంగం సిద్ధం

సర్జికల్‌ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్‌ మెడ్‌టెక్‌లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్‌ రూ.7,000 కోట్ల (840 మిలియన్‌ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. హెల్తియమ్‌ మెడ్‌టెక్‌లో వాటా విక్రయించడానికి కొంతకాలంగా అపాక్స్‌ అనే పెట్టుబడుల సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కోసం వివిధ ఔషధ కంపెనీలు, పీఈ సంస్థలు పోటీ పడ్డాయి. కేకేఆర్‌తో పాటు నోవో హోల్డింగ్స్‌, మ్యాన్‌కైండ్‌ ఫార్మా- క్రిస్‌ కేపిటల్‌ బిడ్లు వేశాయి. కానీ రూ.7,000 కోట్లతో అధిక బిడ్‌ దాఖలు చేసిన కేకేఆర్‌కే దీన్ని సొంతం చేసుకునే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. మ్యాన్‌కైండ్‌ ఫార్మా, క్రిస్‌ కేపిటల్‌ రూ.6,500 కోట్లకు బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. అపాక్స్‌కు హెల్తియమ్‌ మెడ్‌టెక్‌లో 99.8% వాటా ఉంది. మిగిలిన 0.2% వాటా సంస్థ ఎండీ, సీఈఓ అనీష్‌ బాఫ్నాకు ఉంది.

1992లో ఏర్పాటు: హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ ను 1992లో ఎల్‌జీ చంద్రశేఖర్‌, ఎస్‌.సుబ్రమణియమ్‌ నెలకొల్పారు. ఈ ఇద్దరికీ స్మిత్‌ అండ్‌ నెఫ్యూ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.820 కోట్ల ఆదాయాన్ని, రూ.256 కోట్ల ఎబిటాను ఈ సంస్థ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు మించుతుందని, ఎబిటా రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎబిటాకు 20 రెట్లు విలువ కట్టి, దాని ప్రకారం కేకేఆర్‌ ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా 4వ అతిపెద్ద సంస్థ: సూదులు, ఇతర సర్జికల్‌ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ నాలుగో అతిపెద్ద సంస్థ. మనదేశం నుంచి దాదాపు 90 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. మనదేశంలో దాదాపు 18,000 ఆసుపత్రుల్లో ఈ పరికరాలను వినియోగిస్తున్నారు. సర్జికల్‌ పరికరాల విభాగంలో ప్రపంచ మార్కెట్లో ఎథికాన్‌ ఇంక్‌ (జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ గ్రూపు సంస్థ), ఆంత్రాక్స్‌ ఇంక్‌, కొవిడీన్‌ హోల్డింగ్‌ ఇంక్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఏడాదిలోనే యత్నాలు

హెల్తియమ్‌ మెడ్‌టెక్‌లో వాటా విక్రయించడానికి అపాక్స్‌ ఈ ఏడాది ప్రారంభంలో కసరత్తు మొదలు పెట్టింది. జెఫ్రీస్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా ఎంచుకుంది. హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ రెండేళ్ల క్రితం యూకేలోని తన సబ్సిడరీ కంపెనీని కేకేఆర్‌కు విక్రయించింది. అదే కేకేఆర్‌ ఇప్పుడు మాతృ సంస్థనూ కొనుగోలు చేయనుండటం ఆసక్తికర అంశం. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ విషయం అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థ యాజమాన్యం చేతులు మారినప్పటికీ ప్రస్తుత ఎండీ, సీఈఓ అనీష్‌ బాఫ్నా, అదే స్థానంలో కొనసాగుతారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని