రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా

దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది.

Published : 05 May 2024 02:23 IST

మారుతీ సుజుకీ ఇండియా అంచనా

దిల్లీ: దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. దేశీయంగా ప్రయాణికుల కార్ల విభాగంలో ఒకప్పుడు చిన్న కార్లదే హవా. కానీ ప్రస్తుతం ఈ విభాగం వాటా 30% లోపునకు వచ్చేసింది. 2018-19 తర్వాత ద్విచక్ర వాహనాల విభాగం ఎలాగైతే నెమ్మదించి మళ్లీ ఇప్పుడు పుంజుకుందో.. చిన్న కార్ల విభాగమూ అదే విధంగా తిరిగి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ భావిస్తోంది.

ప్రస్తుతం ఎస్‌యూవీ వాటా 53.6%: ‘మొత్తం ప్రయాణికుల కార్ల విభాగంలో స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఎస్‌యూవీ) విభాగం వాటా 53.6 శాతానికి పెరిగింది. ఇంతవరకు చిన్నకార్లు వాడుతున్న వారు, మరింత మెరుగైన వాహనానికి అప్‌గ్రేడ్‌ కావాలనుకోవడం, కుటుంబం అంతా కలిసి వెళ్లేందుకు, సౌకర్యవంతంగా ఉంటుందనే భావనతో ఎస్‌యూవీల వైపు మొగ్గుచూపడం వల్లే.. మొత్తం అమ్మకాల్లో చిన్న కార్ల విభాగం వాటా తగ్గిందని’ మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) పార్ధో బెనర్జీ తెలిపారు. భద్రత, ఉద్గార ప్రమాణాలకు సంబంధించి నియంత్రణ నిబంధనలు, ఇంకా పలు కారణాల రీత్యా హ్యాచ్‌బ్యాక్‌ చిన్న కార్ల ధరలు గణనీయంగా పెరిగాయని.. ఆ స్థాయిలో చిన్న కార్ల కొనుగోలుదార్ల కొనుగోలు శక్తి  పెరగనందున, హ్యాచ్‌బ్యాక్‌ కార్ల విభాగం వాటా తగ్గిందని తెలిపారు. ఇది తిరిగి పుంజుకునే అవకాశం ఉందని, 2026 చివరకు లేదా 2027లో ఈ విభాగం మళ్లీ వృద్ధి బాట పట్టడాన్ని చూస్తామని బెనర్జీ తెలిపారు. ద్విచక్ర వాహనం నుంచి కారుకు మారాలనుకునే వారికి, ‘అందుబాటు ధరలో లభ్యత’ అనేదే ప్రధాన సవాలుగా మారిందని అన్నారు. ఈ విషయంలో పరిస్థితి మెరుగైతే చిన్న కార్ల విభాగం పుంజుకుంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని