కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.5,302 కోట్లు

ప్రైవేటు రంగ కోటక్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం.

Published : 05 May 2024 02:24 IST

డివిడెండ్‌ 40%

దిల్లీ: ప్రైవేటు రంగ కోటక్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. స్టాండలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ రూ.4,133 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,496 కోట్లతో పోలిస్తే ఇది 18% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.12,007 కోట్ల నుంచి రూ.15,285 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.6,103 కోట్ల నుంచి 13% పెరిగి రూ.6,909 కోట్లకు చేరింది.

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం 22 శాతం పెరిగి రూ.18,213 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.41,334 కోట్ల నుంచి రూ.56,072 కోట్లకు పెరిగింది. ఎన్‌ఐఐ రూ.21,552 కోట్ల నుంచి 21% పెరిగి రూ.25,993 కోట్లకు చేరింది. 2024 మార్చి 31 నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.39 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.34 శాతానికి చేరాయి. నీ సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరింది. రుణ వృద్ధి 20 శాతం నమోదు కావడంతో వడ్డీ ఆదాయం పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 5.28 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇది 5.78 శాతంగా నమోదైంది.  నీ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2 (40%) చొప్పున డివిడెండ్‌  చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.

ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావం తక్కువే..: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షల వల్ల తమ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పెద్దగా ఉండబోదని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశోక్‌ వాస్వానీ వెల్లడించారు. అయితే బ్యాంక్‌ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ, గత నెలలో కోటక్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఛానెళ్ల ద్వారా కొత్త ఖాతాదార్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. కొత్తగా క్రెడిట్‌ కార్డ్‌ల జారీని నిలిపివేయాలనీ పేర్కొంది. దీనిపై వాస్వానీ మాట్లాడుతూ సాంకేతిక వ్యవస్థల మెరుగుకు బ్యాంక్‌ రెండింతలు శ్రమిస్తోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని