Software Jobs: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల అడ్డా... హైదరాబాద్‌

ఐటీ పరిశ్రమకు మూల స్తంభాలు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లే. కోడింగ్‌ రాయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, అప్లికేషన్లలో ఏమైనా సమస్యలు వస్తే సత్వరం పరిష్కరించడం... ఈ పనులన్నీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి.

Updated : 05 Mar 2023 07:31 IST

నియామకాల్లో ప్రపంచ వ్యాప్తంగా 10వ స్థానం
ఎగుమతుల్లో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి'

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ పరిశ్రమకు మూల స్తంభాలు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లే. కోడింగ్‌ రాయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, అప్లికేషన్లలో ఏమైనా సమస్యలు వస్తే సత్వరం పరిష్కరించడం... ఈ పనులన్నీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇటువంటి డెవలపర్ల నియామకాలు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ 10వ స్థానంలో నిలిచింది. ‘కరత్‌.కామ్‌’ అనే మానవ వనరుల సేవల సంస్థ రూపొందించిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల నియామకాలు అధికంగా యూఎస్‌లోని వివిధ నగరాల్లో నమోదవుతుండగా, ఆ తర్వాత అటువంటి నగరాలు ఎక్కువ సంఖ్యలో మన దేశంలోనే ఉండటం ప్రత్యేకత. మన దేశంలో హైదరాబాద్‌, చెన్నై, గురుగావ్‌, బెంగుళూరు, పుణె, ముంబయి నగరాల్లో అధికంగా ఈ నియామకాలు నమోదవుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌ ముందు స్థానంలో ఉండడమే కాకుండా ప్రపంచవ్యాప్త నగరాల్లో 10వ స్థానాన్ని సంపాదించింది.

ఐటీ సంస్థల ఆసక్తి..

హైదరాబాద్‌లో ప్రధానంగా ఆర్థిక సేవలు, బీమా, టెలికామ్‌ రంగాలకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలు అధికంగా ఉండడంతో ఇది సాధ్యపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రంగాలకు సేవలు అందించే ఐటీ కంపెనీలు అధికంగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల నియామకాలు చేపడుతున్నాయి. డెవలపర్ల నియామకాలు అధికంగా ఉన్న దేశాల్లో యూఎస్‌, భారత్‌తో పాటు సింగపూర్‌, జపాన్‌, కెనడా, యూకే కనిపిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌కున్న ప్రత్యేకత... సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల సంఖ్య ఎంతో అధికంగా ఉండడం. అదే సమయంలో వ్యయాలు కూడా ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉన్నాయి. దీని వల్ల కొత్తగా డెవలప్‌మెంట్‌ కేంద్రాలను మన దేశంలో ఏర్పాటు చేసేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లకు అవకాశాలు మున్ముందు ఇంకా పెరిగేందుకే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌కు కలిసి వచ్చే పరిణామాలుగా పేర్కొంటున్నాయి.


8 లక్షలకు పైగా ఉద్యోగులు

సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ హైదరాబాద్‌లో అధిక వృద్ధి నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రంగంలో 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.83 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు నమోదయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో గత ఏడేళ్లలో ఏటా 15 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం గమనార్హం. గత కొన్నేళ్లలో హైదరాబాద్‌లో ఎంతో బలమైన ‘టెక్‌ ఎకో సిస్టమ్‌’ రూపుదిద్దుకుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ పరిశ్రమకు విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ అంశాలన్నీ కలిసి ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ఉన్నత స్థానంలో నిలబెడుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. ‘‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల నియామకాలు అధికంగా నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్‌, ప్రపంచ వ్యాప్తంగా ‘టాప్‌ 20’ నగరాల్లో స్థానం సంపాదించిందని, ఐటీ/ ఐటీఈఎస్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతికి ఇది ప్రత్యేక గుర్తింపు’’ అని తాజాగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‘ట్వీట్‌’ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని