2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌ ఉన్నత్‌ పండిట్‌ గురువారం వెల్లడించారు.

Published : 26 Apr 2024 02:21 IST

దిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్స్‌ ఉన్నత్‌ పండిట్‌ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల క్లియరెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నందున, మేధో సంపత్తి (ఇంటెలెక్చువల్‌ ప్రోపర్టీ-ఐపీ) కార్యాలయంలో జాప్యం ఉండట్లేదని పేర్కొన్నారు. అసోచామ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తమ కార్యాలయానికి పరిశీలనకు వచ్చిన 40% దరఖాస్తులను 30 నెలల్లోపే పరిష్కరించామని తెలిపారు. ‘ఐపీ కార్యాలయంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. చట్టంలోని చాప్టర్‌ 8 కింద మంజూరు చేసిన ఐపీని దరఖాస్తుదారు కూడా వినియోగించుకోవాలి. అప్పుడే ఆ ఐపీకి ఆర్థిక విలువ చేకూరుతుంద’ని ఉన్నత్‌ వివరించారు. అపరిష్కృతంగా ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించాం. ఇకపైనా పరిశీలన కోసం వచ్చే దరఖాస్తులను 30-36 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. భారత్‌ మేధో సంపత్తి (ఐపీ) స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి 6 నిమిషాలకు ఒక సాంకేతికత (టెక్నాలజీ) ఐపీ రక్షణ కోసం వస్తోందని, 2023లో జీవన కాల గరిష్ఠ స్థాయిలో 90,300 పేటెంట్‌ దరఖాస్తులు వచ్చాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేటెంట్‌ కార్యాలయం 2023 మార్చి 15 నుంచి 2024 మార్చి 14 మధ్య లక్షకు పైగా పేటెంట్లను మంజూరు చేసిందని తెలిపింది. ప్రతి పని దినాన 250 పేటెంట్లు మంజూరైనట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని