సంక్షిప్తవార్తలు(6)

హైదరాబాద్‌కు ‘ఇంటర్‌కాంటినెంటల్‌’ హోటల్‌ను పరిచయం చేయడం కోసం ఐహెచ్‌జీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌తో బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ జట్టుకట్టింది.

Published : 26 Apr 2024 02:05 IST

హైదరాబాద్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌
బ్రిగేడ్‌, ఐహెచ్‌జీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ జట్టు

దిల్లీ: హైదరాబాద్‌కు ‘ఇంటర్‌కాంటినెంటల్‌’ హోటల్‌ను పరిచయం చేయడం కోసం ఐహెచ్‌జీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌తో బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ జట్టుకట్టింది. భారత్‌లో తన విలాసవంత, జీవనశైలి హోటళ్లను విస్తరించాలన్న ఐహెచ్‌జీ వ్యూహం; హైదరాబాద్‌లో ఆతిథ్య సేవలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న బ్రిగేడ్‌ ప్రణాళికల్లో భాగంగా తాజా భాగస్వామ్యం చోటు చేసుకుంది. 2023లో బ్రిగేడ్‌ ఆధ్వర్యంలో 100 హోటళ్లు, రిసార్టులు 45% వృద్ధిని నమోదు చేశాయి. 2029లో ‘ద ఇంటర్‌కాంటినెంటల్‌ హైదరాబాద్‌ నియోపొలిస్‌’ను ప్రారంభించాలన్నది బ్రిగేడ్‌ ఆలోచనగా ఉంది. ఇందులో 300 గదులు, అయిదు డైనింగ్‌ ఆప్షన్లు (ఒక సిగ్నేచర్‌ రెస్టారెంట్‌, 2 స్పెషాలిటీ రెస్టారెంట్లు సహా), ఒక లాబీ లాంజ్‌ ఉంటాయని అంచనా. కాన్ఫరెన్స్‌ సదుపాయాలు, ఫిట్‌నెస్‌ సెంటర్‌, స్పా, స్విమ్మింగ్‌ పూల్‌, అవుట్‌డోర్‌ రిక్రియేషన్‌ ఏరియా, రిటైల్‌ అవుట్‌లెట్‌ తదితరాలుండొచ్చు.

తాజా వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో గురువారం బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర 1.97% లాభంతో రూ.1036.65 వద్ద స్థిరపడింది.


అవాంటెల్‌కు రూ.13.08 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ, రైల్వే విభాగాలకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు అందించే అవాంటెల్‌ లిమిటెడ్‌, మార్చి త్రైమాసికానికి రూ.42.17 కోట్ల ఆదాయాన్ని, రూ.13.08 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.52.46 కోట్లు, నికరలాభం రూ.10.53 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి సంస్థ రూ.225.21 కోట్ల ఆదాయాన్ని, రూ.55.45 కోట్ల నికరలాభాన్ని నమోదు  చేసింది. వార్షిక ఈపీఎస్‌ రూ.2.28గా ఉంది.2022-23లో ఆదాయం రూ.154.74 కోట్లు, నికరలాభం రూ.30 కోట్లు, ఈపీఎస్‌ రూ.1.23గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 20 పైసల  తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రతిపాదించింది. ఇందుకు మే 23ను రికార్డు తేదీగా నిర్ణయించారు. అవాంటెల్‌ షేర్లు బీఎస్‌ఈలో నమోదై ఉండగా, ఎన్‌ఎస్‌ఈ లోనూ నమోదు చేయనున్నారు.


ఏ350-900 విమానాలకు ఇండిగో ఆర్డరు

దిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్న ఇండిగో, ఇందుకోసం 30 పెద్ద (వైడ్‌బాడీ) విమానాలకు ఆర్డరు ఇచ్చింది. విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు ఏ350-900 విమానాల కోసం ఈ ఆర్డరు ఇవ్వగా, 2027 నుంచి సరఫరా కానున్నాయి. తదుపరి మరో 70 విమానాలకు కూడా ఆర్డరు ఇచ్చే హక్కు ఇండిగోకు ఉంది. వీటికి రోల్స్‌రాయిస్‌ ట్రెంట్‌ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్లు ఉంటాయి. ఇండిగో ప్రస్తుతం దేశీయ మార్గాల్లో మధ్యస్థాయి (నారోబాడీ) విమానాలను వినియోగిస్తోంది. ఇస్తాంబుల్‌ సర్వీసుల కోసం తుర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి లీజుకు తీసుకున్న బోయింగ్‌ 777 విమానాలు 2 మాత్రమే ఇండిగో వద్ద ఉన్న పెద్ద విమానాలు. ప్రస్తుతం ఇండిగో వద్ద 350 విమానాలు ఉండగా, గతేడాది ఎయిర్‌బస్‌ నుంచి 500 విమానాల కొనుగోలుకు ఆర్డరు పెట్టిన సంగతి విదితమే.


36% పెరిగిన కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ

దిల్లీ: కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.43.04 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.31.77 కోట్లతో పోలిస్తే ఇది 36% అధికం. మొత్తం ఆదాయం రూ.184.41 కోట్ల నుంచి రూ.292.96 కోట్లకు చేరింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.161.65 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇది రూ.109.62 కోట్లుగా ఉంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 20 పైసల చొప్పున తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.


ఎల్‌టీటీఎస్‌లో 500 నియామకాలు

ముంబయి: ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎల్‌టీటీఎస్‌), మార్చి త్రైమాసికంలో రూ.340 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసిక లాభం కంటే ఇది 0.2 శాతమే ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం 7% పెరిగి రూ.2537.5 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 800 మందిని నియమించుకోవడం ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 23,812కు చేరినట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుత ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 500 మంది ఉద్యోగులను నియమించుకుంటామని  తెలిపింది. ప్రతి షేరుకు రూ.33 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని సంస్థ నిర్ణయించింది.


ఆడి వాహన ధరలు 2% వరకు పెంపు

దిల్లీ: జర్మనీ వాహన సంస్థ ఆడి, మన దేశంలో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను 2% వరకు  పెంచబోతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, రవాణా వ్యయాల ప్రభావం నుంచి కొంతమేర బయటపడేందుకే వాహన ధరలు పెంచాల్సి వస్తోందని ఆడి ఇండియా అధిపతి బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని