కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ అలగప్పన్‌

ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు నూతన ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ అలగప్పన్‌ నియమితులయ్యారు.

Published : 26 Apr 2024 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌:  ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు నూతన ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ అలగప్పన్‌ నియమితులయ్యారు. గురువారం కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నియామకాన్ని ఖరారు చేశారు. ఆయన వెంటనే పదవీ బాధ్యతలు చేపడతారు. అరుణ్‌ 2021 ఫిబ్రవరి నుంచి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. కంపెనీ ఛైర్మన్‌, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఏ.వేలాయన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. 

తగ్గిన ఆదాయం, లాభాలు: మార్చి త్రైమాసికానికి రూ.4,027 కోట్ల మొత్తం ఆదాయం, రూ.209 కోట్ల నికరలాభాన్ని సంస్థ ప్రకటించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.5,519 కోట్లు, నికరలాభం రూ.262 కోట్లుగా ఉన్నాయి. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 27%, నికరలాభం 20% తగ్గాయి.  

  • 2023-24 పూర్తి కాలానికి సంస్థ రూ.22,308 కోట్ల ఆదాయంపై రూ.1,719 కోట్ల నికరలాభాన్ని  నమోదు చేసింది. 2022-23 ఆదాయం రూ.29,784 కోట్లు, నికరలాభం రూ.2,035 కోట్లు ఉన్నాయి.  గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25%, నికరలాభం 16% తగ్గాయి.
  •  రుతుపవనాలు అనుకూలించకపోవడం, చెరువుల్లో నీటి నిల్వ తక్కువగా ఉండటంతో సాగు విస్తీర్ణం తగ్గినందునే ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు క్షీణించినట్లు కోరమాండల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ అన్నారు. దీనికి తోడు సబ్సిడీ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో సవాళ్లూ ఆదాయాలపై ప్రభావం చూపినట్లు తెలిపారు. తమ ఎరువుల కర్మాగారాలు 95% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేశాయని, సస్య రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు 20% పెరిగాయని వివరించారు.

లారస్‌ ల్యాబ్స్‌కు తగ్గిన లాభాలు 

ఈనాడు, హైదరాబాద్‌: లారస్‌ ల్యాబ్స్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.1,440 కోట్ల ఆదాయం, రూ.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.1.40గా నమోదైంది. 2022-23 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 4% పెరిగినా, నికరలాభం 26% క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు 18% ఉంది. వాటాదార్లకు ఒక్కో షేరుకు 40 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.

గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.5,041 కోట్ల ఆదాయాన్ని, రూ.161 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్‌ రూ.2.9గా ఉంది. ఎబిటా మిగులు 15.8% కాగా, నికర లాభాలు 3.2 శాతంగా ఉన్నాయి. 2022-23తో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 17%, నికరలాభం 80% తగ్గాయి.

కారణాలివీ: కొవిడ్‌ మందుల అమ్మకాలు తగ్గడంం లారస్‌ ల్యాబ్స్‌ ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపింది. కానీ ఎఫ్‌డీఎఫ్‌, సీడీఎంఓ, ఆంకాలజీ ఏపీఐ, బయోటెక్‌ విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగేందుకు బలమైన పునాదులు వేసినట్లు తెలిపారు. లాభాలు పెంచుకోడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు.  జంతు రక్షణ, సస్యరక్షణ మందులు, బయోటెక్నాలజీ, సెల్‌- జీన్‌ థెరపీ మందులు అందించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

బోర్డు ఛైర్మన్‌గా డాక్టర్‌ రవీంద్రనాధ్‌: లారస్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్ల బోర్డులో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ల బోర్డుకు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ ఎం.వీ.జీ.రావు పదవీ కాలం మే 17వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో డాక్టర్‌ రవీంద్రనాధ్‌ కంచర్లను ఎంపిక చేశారు. మే 18 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. డాక్టర్‌ రవీంద్రనాధ్‌ లారస్‌ ల్యాబ్స్‌ బోర్డులో 2017 నుంచి ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా కృష్ణ చైతన్య చావ, సౌమ్య చావ నియమితులయ్యారు. స్వతంత్ర డైరెక్టర్‌గా కరణం శేఖర్‌ను ఎంపిక చేశారు.


ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.77 కోట్ల వార్షిక లాభం
10,000కు మించి విద్యుత్తు బస్సుల ఆర్డర్లు
సీతారాంపూర్‌ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం 

ఈనాడు, హైదరాబాద్‌: ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1154.14 కోట్ల ఆదాయాన్ని, రూ.76.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.2022-23తో పోల్చితే ఆదాయం 5.8%, నికరలాభం 17.1% పెరిగాయి. ఎబిటా (వడ్డీ, పన్ను, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) 20.5%   నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 8,232 విద్యుత్తు బస్సుల సరఫరాకు ఆర్డర్లు లభించాయని, బెస్ట్‌- ముంబయి నుంచి లభించిన 3,000 బస్సుల రిపీట్‌ ఆర్డర్‌ ఇందులో ఉన్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కేవీ ప్రదీప్‌ వెల్లడించారు. దీంతో తాము సరఫరా చేయాల్సిన బస్సుల సంఖ్య 10,000ను మించిందని అన్నారు. ఇప్పటి వరకు 1,746 విద్యుత్తు బస్సులను వినియోగదార్లకు అందించామన్నారు. 2023-24 మార్చి త్రైమాసికంలో 131 బస్సులను సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ చేతిలో 10,969 బస్సులకు ఆర్డర్లు ఉన్నందున, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించినట్లు వివరించారు. హైదరాబాద్‌ సమీపంలోని  సీతారాంపూర్‌ యూనిట్లో పాక్షికంగా బస్సుల ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ యూనిట్‌ నుంచి మొదటి బ్యాచ్‌ విద్యుత్తు బస్సులను వినియోగదార్లకు సరఫరా చేసినట్లు తెలిపారు.


సైయెంట్‌ లాభం రూ.173 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, ఐటీ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,489 కోట్ల ఆదాయాన్ని, రూ.173 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంతో పోల్చి చూస్తే ఆదాయం 2.8%, నికరలాభం 9.1% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి సైయెంట్‌ ఆదాయం రూ.5,911 కోట్లు కాగా, దీనిపై నికరలాభం రూ.689 కోట్లు నమోదైంది. వార్షికాదాయం 16%, నికరలాభం 31.6% పెరిగాయి. వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.30 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరం అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు సైయెంట్‌ సీఎండీ కృష్ణ బొదనపు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ ఆర్డర్‌ బుక్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉందని  వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు