మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు

కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది.

Published : 26 Apr 2024 02:14 IST

మళ్లీ 74,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌
సమీక్ష

కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.28 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.11.29 లక్షల కోట్లు పెరిగి, తాజా రికార్డు గరిష్ఠమైన రూ.404.18 లక్షల కోట్ల (4.87 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 1850.45 పాయింట్లు లాభపడింది.

  • సెన్సెక్స్‌ ఉదయం 73,572.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం బలంగా పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, ఒకదశలో 74,571.25 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 486.50 పాయింట్ల లాభంతో 74,339.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 167.95 పాయింట్లు పెరిగి 22,570.35 దగ్గర స్థిరపడింది. 
  •  సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 పరుగులు తీశాయి. ఎస్‌బీఐ 5.10%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.55%, సన్‌ఫార్మా 2.30%, ఐటీసీ 2.02%, ఎన్‌టీపీసీ 1.92%, ఎం అండ్‌ ఎం 1.76%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.62%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.55% లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.25% వరకు నష్టపోయాయి.
  • ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో  యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 5.98% దూసుకెళ్లి రూ.1,127.35 దగ్గర ముగిసింది. బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా అమిత్‌ ఛౌద్రీ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 2025 జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం వర్తిస్తుంది.
  • బలహీన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో  హెచ్‌యూఎల్‌ షేరు 1.25% నష్టపోయి రూ.2,231 వద్ద ముగిసింది.
  •  ఫలితాల ప్రభావంతో నెస్లే ఇండియా షేరు 2.39% పెరిగి రూ.2,562.70 వద్ద ముగిసింది.  
  •  ప్యూర్‌సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ను 94.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.779 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది.
  •  మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ, సీఈఓగా ప్రతీక్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ నవీన్‌ అగర్వాల్‌ గ్రూప్‌ పదవులను చేపట్టనున్నారు.
  •  ఐపీఓ ద్వారా రూ.10,400 కోట్ల వరకు సమీకరించేందుకు వాటాదార్లు అనుమతి ఇచ్చారని ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది.  
  •  3:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసేందుకు ఐనాక్స్‌ విండ్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
  •  వొడాఫోన్‌ ఐడియా షేర్లు గురువారం రికార్డు స్థాయిలో ట్రేడయ్యాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి మొత్తం 1055 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం. ఈనెల 23న, 308 కోట్ల వొడాఫోన్‌ ఐడియా షేర్లు ట్రేడవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఎఫ్‌పీఓలో సమీకరించిన రూ.18,000 కోట్ల వల్ల సంస్థ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, సేవలను విస్తృతం చేస్తామని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ప్రకటించడంతో..  గురువారం షేరు 6.11% పెరిగి రూ.13.89 వద్ద ముగిసింది.
  • జేఎన్‌కే ఇండియా ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 28.07 రెట్ల స్పందన లభించింది. 
  •  ఎమ్‌ఫోర్స్‌ ఆటోటెక్‌ ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 365 రెట్ల స్పందన లభించింది. 
  • డిజిటల్‌ ఛానెళ్లలో ఇటీవల వినియోగదార్లకు తప్పుగా దాదాపు 17,000 క్రెడిట్‌ కార్డులు జారీ అయినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

    నేటి బోర్డు సమావేశాలు: హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ కార్డ్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌


  •  కోటక్‌ బ్యాంక్‌ షేరు ఢమాల్‌: కొత్త వినియోగదారులను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు 10.85% కుదేలై రూ.1643 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1620 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.39,768.36 కోట్లు పతనమై రూ.3.26 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో మార్కెట్‌ విలువ పరంగా అత్యంత విలువైన బ్యాంక్‌ల్లో 5వ స్థానానికి పడిపోయింది. మొదటి నాలుగు స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. షేరు పతనంతో ఆసియాలోనే ధనిక బ్యాంకర్‌గా ఉన్న ఉదయ్‌ కోటక్‌ సంపద 1.3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.10,800 కోట్లు) ఆవిరైంది. బ్యాంక్‌లో ఆయనకు 26% వాటా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు