Indian Banks: మన బ్యాంకులకు ఇబ్బందేమీ లేదు

అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ అయిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌తో పాటు సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా దివాలా తీయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated : 14 Mar 2023 08:54 IST

రిటైల్‌ డిపాజిట్లే కాపాడుతున్నాయ్‌

ఈనాడు - హైదరాబాద్‌: అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ అయిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌తో పాటు సిగ్నేచర్‌ బ్యాంక్‌ కూడా దివాలా తీయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలపై ఏ మేరకు ఉంటుందనే అంశంపై ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అయితే భారత్‌లో బ్యాంకుల అప్పులు-ఆస్తుల నిర్వహణ సమర్థంగా ఉండటం, రిటైల్‌ డిపాజిట్లు అధికంగా ఉన్నందున ఎస్‌వీబీ ప్రభావం పెద్దగా ఉండదని ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మెక్వారీ అంచనా వేస్తోంది. మన బ్యాంకులు దేశీయ డిపాజిట్లపైనే ఎక్కువగా ఆధారపడతాయి. విదేశాల నుంచి మన బ్యాంకుల్లో డిపాజిట్లు పెద్ద మొత్తంలో ఉండవు. మన బ్యాంకులు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టడమూ తక్కువే. అక్కడి సంస్థలకూ రుణాలు అంత తేలిగ్గా ఇవ్వవు. ఈ లావాదేవీలు చేయాలంటే ఎన్నో నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ఎస్‌వీబీలో మన దేశీయ బ్యాంకులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి డిపాజిట్లు లేవు. ప్రపంచంలోని ఇతర బ్యాంకుల్లోనూ దేశీయ బ్యాంకుల డిపాజిట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


60 శాతం ప్రజలవే

మన దేశంలోని బ్యాంకుల్లో రిటైల్‌ డిపాజిట్లే అధికం. బ్యాంకు టర్మ్‌ డిపాజిట్లలో దాదాపు 60% ప్రజల పొదుపు సొమ్మే ఉంటుంది.  మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి మిగతా సొమ్ము ఉంటుంది. వడ్డీరేట్లు పెంచుతున్నందున, ఇటీవల మళ్లీ డిపాజిట్లు పెరుగుతున్నాయి. గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు డిపాజిట్లలో దాదాపు 15 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. ఈ సొమ్మునే దేశీయ సంస్థలకు రుణాలివ్వడంతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీల్లో బ్యాంకులు మదుపు చేస్తుంటాయి. అందువల్ల విదేశీ లావాదేవీలు బాగా తక్కువ.  


రుణ ఖాతాలు మెరుగ్గా

ఈ మధ్యకాలంలో బ్యాంకులు మొండి బాకీలు తగ్గించుకుంటున్నాయి. నిరర్థక ఆస్తుల నుంచీ రికవరీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మొండి బాకీలకు కేటాయింపులు (పీసీఆర్‌) 70-80% వరకు ఉంటున్నాయి. కొత్త రుణ ఖాతాలు మొండి బకాయిలుగా మారడం తగ్గింది. మూలధన నిష్పత్తి (సీఏఆర్‌) 11 శాతంగా ఉండాలనేది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధన. దేశంలోని బ్యాంకులన్నింటి సీఏఆర్‌ దీనికంటే ఎంతో అధికంగా ఉంది.  14-15%  వరకు సీఏఆర్‌ ఉన్న బ్యాంకులున్నాయి. దేశీయ బ్యాంకుల పనితీరును ఆర్‌బీఐ అనుక్షణం గమనిస్తుండటమే ఉపకరిస్తోందని బ్యాంకింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే స్వల్పకాలానికి మాత్రం సెంటిమెంట్‌ కాస్త బలహీనం కావచ్చు.


బ్యాంకింగ్‌ సూత్రాలకు విరుద్ధంగా

40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎస్‌వీబీ బ్యాంకు కుప్పకూలడానికి ప్రధాన కారణం.. స్వల్పకాలిక డిపాజిటర్ల సొమ్మును తీసుకెళ్లి, దీర్ఘకాలిక రుణాలుగా ఇవ్వడమే. ఇది బ్యాంకింగ్‌ ప్రాథమిక విధానాలకు విరుద్ధం. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ డబ్బును వెనక్కి తీసుకెళ్లడం ప్రారంభించడంతో, ఇవ్వలేక కుప్పకూలింది. మన దేశంలోనూ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల డెట్‌ ఫథకాలకు ఇబ్బంది ఎదురవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని