Reliance: సబ్బులు.. శీతల పానీయాల్లో ధరల పోటీ

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 2016లో జియో 4జీతో టెలికాం సేవల రంగంలోకి ప్రవేశించి, ఈ రంగం స్వరూపాన్నే మార్చేసింది.

Updated : 27 Mar 2023 08:25 IST

రిలయన్స్‌ ప్రవేశంతో మారుతున్న చిత్రం

నాడు టెలికాంలో

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 2016లో జియో 4జీతో టెలికాం సేవల రంగంలోకి ప్రవేశించి, ఈ రంగం స్వరూపాన్నే మార్చేసింది. కేవలం డేటాకే ఛార్జీలు.. అది కూడా అప్పటి ధరలతో పోలిస్తే నామమాత్రం వసూలు చేసి, కాల్స్‌ పూర్తి ఉచితంగా మాట్లాడుకునే వీలు కల్పించింది. జియో రాకకు ముందు 1 జీబీ డేటా కొనుగోలుకు చందాదార్లు కనీసం రూ.250 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆ ఛార్జీకే నెలలో 45 జీబీకి మించి డేటాను జియో ఇవ్వడంతో, మొబైల్‌ వాడకం తీరే మారింది. జియో మార్గాన్నే ఇతర సంస్థలూ అనుసరించాల్సి వచ్చింది.

ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీలో

110 బిలియన్‌ డాలర్ల (రూ.9 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగంపై ఆర్‌ఐఎల్‌ దృష్టి సారించింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) పూర్తి స్థాయి అనుబంధ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఆర్‌సీపీఎల్‌ ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలోనే అందుబాటులో ఉంది. దేశం మొత్తం డీలర్‌ నెట్‌వర్క్‌ను నిర్మించి, సూపర్‌ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకునేందుకు సిద్ధమవుతోంది. పలు బ్రాండ్లను కొనుగోలు చేయడంతో పాటు సబ్బుల నుంచి శీతల పానీయాల వరకు ఉత్పత్తులను విడుదల చేస్తోంది. ఈ రంగంలోని దిగ్గజ సంస్థలైన హెచ్‌యూఎల్‌, పీఅండ్‌జీ, రెకిట్‌, నెస్లే ఉత్పత్తుల కంటే 30-35% తక్కువ ధరలకే ఆఫర్‌ చేస్తూ, కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

* సుమారు 9 బిలియన్‌ డాలర్ల (రూ.74,000 కోట్ల) విలువైన శీతల పానీయాల విపణిలో అంతర్జాతీయ దిగ్గజాలైన పెప్సికో, కోకకోలాలతో ఆర్‌ఐఎల్‌ పోటీని ప్రారంభించింది. వేసవి కలిసి రావడంతో, కాంపా కోలాను మళ్లీ విడుదల చేసి, జియో మార్ట్‌, రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో 500 మి.లీ. బాటిల్‌ను రూ.20కు; 2 లీటర్ల సీసాను రూ.49కే అందుబాటులో ఉంచింది.

* 2022లో దేశంలో సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు 21.65 బి.డాలర్ల (రూ.1.78 లక్షల కోట్ల) స్థాయిలో జరిగాయని అంచనా. గ్లిమ్మర్‌ బ్యూటీ సబ్బులు, గెట్‌ రియల్‌ నేచురల్‌ సబ్బులు, ప్యూరిక్‌ హైజీన్‌ సబ్బులను 100 గ్రాములకు ఆర్‌సీపీఎల్‌ రూ.25కే విక్రయిస్తోంది. ఈ విభాగంలో ఇతర కంపెనీల సబ్బులు రూ.34-49 శ్రేణిలో ఉన్నాయి.  వాషింగ్‌మెషీన్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ 2 లీటర్ల ప్యాక్‌ను రిలయన్స్‌ రూ.250కే అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటివే వేరే కంపెనీవి రూ.325పైన ఉన్నాయి.

* పాత్రలను శుభ్రం చేసే సబ్బులను రూ.5, రూ.10, రూ.15 శ్రేణిలో, లిక్విడ్‌ జెల్‌ ప్యాక్‌లను రూ.10, రూ.30, రూ.45 శ్రేణిలో ఆర్‌సీపీఎల్‌ అందిస్తోంది. రూ.1 నుంచీ లిక్విడ్‌ జెల్‌ శాచెట్‌లను విక్రయిస్తూ, పేద వర్గాలనూ ఆకర్షిస్తోంది.


కాంట్రాక్టు తయారీ సంస్థలకూ కలిసి వస్తుంది

ముడిపదార్థాల లభ్యత బాగున్నందున, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను తయారు చేసి అందించే సంస్థలు గత అయిదేళ్లలో బాగా పెరిగాయి. అందువల్ల తాము కోరిన ప్రమాణాల్లో, ఉత్పత్తులను తయారు చేయించుకుని, తమ బ్రాండ్‌పై విడుదల చేయడం ఈ రంగంలోని సంస్థలకు సులభమవుతోందని డెలాయిట్‌ ఇండియా కన్సల్టింగ్‌ భాగస్వామి రజత్‌ వహి పేర్కొన్నారు. రిలయన్స్‌ వంటి సంస్థలు కొత్త బ్రాండ్లను ప్రవేశపెడుతుండటం వీటికి కలిసి వస్తుందని అంచనా వేశారు.  దేశంలోని 1.10-1.13 కోట్ల మేర ఉన్న కిరాణా దుకాణాలకు తమ ఉత్పత్తులను చేరవేయడమే సంస్థలకు ఉన్న అసలైన సవాలుగా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని