Go first: గోఫస్ట్‌ విమానాల కోసం టాటా, ఇండిగో చర్చలు!

స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసిన వాడియా గ్రూప్‌ సంస్థ గో ఫస్ట్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ విమానాలను స్వాధీనం చేసుకునేందుకు అవకాశాలున్నాయేమోనని దేశంలోని విమానయాన సంస్థలు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Updated : 10 May 2023 09:52 IST

దిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసిన వాడియా గ్రూప్‌ సంస్థ గో ఫస్ట్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ విమానాలను స్వాధీనం చేసుకునేందుకు అవకాశాలున్నాయేమోనని దేశంలోని విమానయాన సంస్థలు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. టాటా గ్రూప్‌, ఇండిగోతో పాటు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ కూడా గోఫస్ట్‌ విమాన లీజుదార్లతో చర్చలు జరిపినట్లు వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌, ఇండిగో విడివిడిగా గోఫస్ట్‌ లీజుదార్లతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్‌ల కోసం ఈ రెండు కంపెనీలు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల నిర్వాహకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. 36 విమానాలను తిరిగి స్వాధీనం చేయాలని గోఫస్ట్‌ లీజుదార్లు కోరుతున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గోఫస్ట్‌కు ఆయా విమానాశ్రయాల్లో ఉన్న స్లాట్ల (విమానం రాకపోకలకు కేటాయించిన సమయం) కోసం ఆకాశ ఎయిర్‌తో పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది.

* 2016 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రాట్‌ జీటీఎఫ్‌ ఇంజిన్లను 500 వరకు మార్చాల్సి వచ్చినట్లు గోఫస్ట్‌ తెలిపింది. ఆయా సమయాల్లో విమానాలు కార్యకలాపాలు నిర్వహించకపోవడం వల్ల నష్టాలు పేరుకుపోయాయి. ఈ నెలారంభంలో గోఫస్ట్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిపే సమయానికి 28 విమానాలు నేలపైనే ఉన్నాయి.

* స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న గోఫస్ట్‌పై ఎన్‌సీఎల్‌టీ బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము చేయాల్సిన చెల్లింపులపైనా మధ్యంతర మారటోరియం ఇవ్వాలన్న ఆ సంస్థ అభ్యర్థనపె నిర్ణయం తీసుకోనుంది.


స్పైస్‌జెట్‌ 3 విమానాలను డీరిజిస్టర్‌ చేయండి: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. సంస్థకు చెందిన 3 విమానాలను డీరిజిస్టర్‌ చేయాలంటూ విమానాలను అద్దెకు ఇచ్చిన (లీజింగ్‌) సంస్థలు, పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)ను ఆశ్రయించాయి. ఇప్పటికే పలు కారణాలతో స్పైస్‌జెట్‌కు చెందిన చాలా విమానాలు కార్యకలాపాలు సాగించడం లేదు. ‘విల్మింగ్‌టన్‌ ట్రస్ట్‌ ఎస్‌పీ సర్వీసెస్‌, సబర్మతి ఏవియేషన్‌ లీజింగ్‌, ఫాల్గూ ఏవియేషన్‌ లీజింగ్‌ సంస్థలు ఒక్కో విమానం చొప్పున డీరిజిస్ట్రేషన్‌కు అడిగాయ’ని డీజీసీఏ వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది. పై మూడు విమానాల్లో రెండింటిని చాణ్నాళ్లుగా నడిపించడం లేదని, అందువల్ల తమ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడబోదని స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని