పిగోకు రూ.16 కోట్ల పెట్టుబడులు

ఉద్యోగులు, విద్యార్థులు హాస్టళ్లు ఎంచుకునేందుకు సహకరించే ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ పిగోకు రూ.16 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.

Published : 13 Jul 2023 03:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులు, విద్యార్థులు హాస్టళ్లు ఎంచుకునేందుకు సహకరించే ఆన్‌లైన్‌ అగ్రిగేటర్‌ పిగోకు రూ.16 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని ఇప్పటికే అందుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ హరికృష్ణ తెలిపారు. వచ్చే ఏడాది సిరీస్‌ సి ఫండింగ్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. హాస్టళ్లలో ముందస్తు చెల్లింపు విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ‘బిజ్లీ బడ్డీ’ని ప్రారంభించినట్లు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇందుకోసం రేడియస్‌ సినర్జీస్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎస్‌ఐపీఎల్‌), ఐటీ కారిడార్‌ హాస్టల్స్‌ సంఘం (ఐటీసీహెచ్‌ఏ)తో కలిసి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనివల్ల హాస్టల్‌లో ఉన్న వారి విద్యుత్‌ ఖర్చు 30% వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 20 వేల హాస్టళ్లతో పిగో కలిసి పనిచేస్తోందని, వీటిల్లో 4 లక్షల మంది ఉంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే 4,000 హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఒకటి, రెండు రోజుల కోసం నగరానికి వచ్చే విద్యార్థుల సౌకర్యం కోసం క్లౌడ్‌ స్టేను ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రేడియస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిసింగ్‌, ఐటీసీహెచ్‌ఏ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌ పాల్గొన్నారు.


ఎంజీ విద్యుత్తు ఎస్‌యూవీ రూ.28 లక్షలు

దిల్లీ: విద్యుత్తు ఎస్‌యూవీ జడ్‌ఎస్‌ ఈవీలో టాప్‌ఎండ్‌ మోడల్‌ను రూ.27.89 లక్షలకు ఆవిష్కరించినట్లు ఎంజీ మోటార్‌ ఇండియా బుధవారం ప్రకటించింది. లెవల్‌ టు అటానమస్‌ డ్రైవింగ్‌ సాంకేతికతను ఈ వాహనంలో అమర్చినట్లు తెలిపింది. ట్రాఫిక్‌ జామ్‌, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టే అవకాశంపై హెచ్చరికలు, వేగంపై హెచ్చరికలు ఇస్తూ వాహన నియంత్రణలో డ్రైవర్‌కు సాయం, సౌకర్యం అందించడంలో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (అడాస్‌) ఉపకరిస్తుందని పేర్కొంది. 50.3 కిలో వాట్‌ అవర్‌ బ్యాటరీని ఒకసారి ఛార్జి చేస్తే 461 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే ఈ వాహనాన్ని పరిమిత కాలం పాటే విక్రయిస్తామని పేర్కొంది. తమ మొత్తం విక్రయాల్లో విద్యుత్తు వాహనాల (ఈవీ) వాటాను 25 శాతానికి చేర్చాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాధించే క్రమంలోనే సాగుతున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తాము ఆవిష్కరించిన రూ.7.98 లక్షల (ఎక్స్‌షోరూం) కామెట్‌ కారు, ఈవీల్లో అత్యంత అందుబాటు ధర వాహనంగా గుర్తు చేశారు.
నీ ఈ ఏడాది తొలి 6 నెలల్లో 29,040 వాహనాలను విక్రయించామని, గతేడాది ఇదే సమయంలో అమ్మిన 24,074 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 20.62% అధికమని గుప్తా తెలిపారు. 2022 మొత్తంమీద కంపెనీ 48,063 వాహనాలను విక్రయించింది.


2 వేల విద్యుత్‌ వాహనాలు  పిక్‌యూకు అందించనున్న బిగాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: వస్తు డెలివరీ సేవలను అందించేందుకు 2 వేల విద్యుత్‌ బైకులను పిక్‌యూ సంస్థకు అందిస్తున్నట్లు బిగాస్‌ తెలిపింది. ఇందుకోసం బైక్‌బజార్‌ రుణాన్ని అందించనుంది. విద్యుత్‌ వాహనాలతో డెలివరీ సేవలను అందించేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని బిగాస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కబ్రా అన్నారు. పిక్‌యూ, బైక్‌బజార్‌ భాగస్వామ్యం వల్ల బీ2బీ విభాగంలో అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణహితంగా డెలివరీ సేవలను అందించేందుకు విద్యుత్‌ వాహనాలను ఉపయోగిస్తున్నామని పిక్‌యూ సీఈఓ ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డెలివరీ భాగస్వాములకు ‘లీజ్‌ టు ఓన్‌’ కింద వీటిని అందిస్తున్నామని తెలిపారు.


డాక్టర్‌ రెడ్డీస్‌ క్యాన్సర్‌ ఔషధంపై ఎఫ్‌డీఏ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే రిటుక్సిమాబ్‌ బయోసిమిలర్‌ను సమీక్షించేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అంగీకరించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. దీంతోపాటు ఐరోపా మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ), యూకే మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) కూడా ఈ ఔషధాన్ని సమీక్షించనున్నాయని తెలిపింది. కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారని, అధిక నియంత్రణలు ఉండే మార్కెట్లలో దీన్ని ప్రవేశ పెట్టడం ద్వారా బయోసిమిలర్స్‌ ఉత్పత్తుల్లో మరో మైలు రాయిని సాధించినట్లు అవుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ బయోలాజికల్స్‌ గ్లోబల్‌ హెడ్‌ జయంత్‌ శ్రీధర్‌ తెలిపారు. 2030 నాటికి 150 కోట్ల మంది రోగుల అవసరాలకు తగ్గట్టుగా పలు విభాగాల్లో కీలక బయోసిమిలర్లను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రిటుక్సిమాబ్‌ను భారత్‌ సహా 25 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది.


మ్యాక్స్‌విజన్‌కు రూ.1,300 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య రంగంలోని సంస్థలకు పెట్టుబడులు సమకూర్చే క్వాడ్రియా క్యాపిటల్‌, నేత్ర చికిత్సలు అందించే మ్యాక్స్‌విజన్‌ ఐ హాస్పిటల్‌కు రూ.1,300 కోట్లను అందించనుంది. తొలి దశలో రూ.600 కోట్లు సమకూర్చి, మాక్సివిజన్‌లో మైనార్టీ వాటా తీసుకోనుంది. ఆ తర్వాత రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టి, మరికొంత వాటా చేజిక్కించుకుంటుందని మ్యాక్స్‌విజన్‌ వెల్లడించింది. ఈ మొత్తంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించబోతున్నట్లు మ్యాక్స్‌విజన్‌ ప్రమోటర్‌, ఛైర్మన్‌ డాక్టర్‌ జీఎస్‌కే వేలు తెలిపారు. మ్యాక్స్‌విజన్‌కు ఉన్న మార్కెట్‌ అవకాశాలు, సాంకేతికతను మరో దశకు తీసుకెళ్లేందుకు తమ పెట్టుబడులు తోడ్పడతాయని  క్వాడ్రియా క్యాపిటల్‌ దక్షిణాసియా అధిపతి సునీల్‌ ఠాకూర్‌ వివరించారు. మ్యాక్స్‌విజన్‌ సీఈఓ సుధీర్‌ వీఎస్‌ మాట్లాడుతూ కంటి చికిత్సల మార్కెట్‌ మరో అయిదేళ్ల పాటు ఏటా 12% పెరుగుతుందనే అంచనా ఉందన్నారు. దీనికనుగుణంగా నాణ్యమైన చికిత్స అందిస్తామన్నారు.


అజయ్‌ సింగ్‌ నుంచి స్పైస్‌జెట్‌కు రూ.500 కోట్లు

దిల్లీ: స్పైస్‌జెట్‌లో మరో రూ.500 కోట్ల పెట్టుబడిని, ఆ సంస్థ ప్రమోటరు, ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ పెట్టనున్నారు. స్పైస్‌జెట్‌ ఆర్థిక స్థితి మెరుగయ్యేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అత్యవసర రుణ హామీ పథకం కింద అదనంగా రూ.206 కోట్ల మేర రుణాన్ని పొందేందుకూ ఇది మార్గం చూపుతుందని కంపెనీ తెలిపింది. తాజా మూలధనాన్ని సమీకరించేందుకు ఉన్న అవకాశాలను స్పైస్‌జెట్‌ డైరెక్టర్ల బోర్డు పరిశీలించింది. కంపెనీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే ఉద్దేశంతో అజయ్‌ సింగ్‌ రూ.500 కోట్లు ఇవ్వనున్నారని స్పైస్‌జెట్‌ తెలిపింది. ‘స్పైస్‌జెట్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఉంది. సంస్థ పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు నా పూర్తి సహకారం ఉంటుంది. వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేయడం ద్వారా విమానయాన రంగ విపణిలో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆదాయాలు, లాభాలను పెంచుకునేందుకు కంపెనీకి ఈ నిధులు ఉపయోగపడతాయ’ని అజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని