‘ఐటీ’ ఆదాయ అంచనాలపైౖ బెంగ

కొత్త ప్రాజెక్టులు తగ్గడం.. ముఖ్యంగా వేర్వేరు రంగాల సంస్థలు ఐటీ ఆధారిత సేవల వ్యయాలపై కోత విధిస్తున్న నేపథ్యంలో, భారతీయ ఐటీ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Updated : 23 Mar 2024 07:21 IST

యాక్సెంచర్‌ ప్రకటనతో దేశీయంగానూ ప్రకంపనలు
ఈనాడు - హైదరాబాద్‌

కొత్త ప్రాజెక్టులు తగ్గడం.. ముఖ్యంగా వేర్వేరు రంగాల సంస్థలు ఐటీ ఆధారిత సేవల వ్యయాలపై కోత విధిస్తున్న నేపథ్యంలో, భారతీయ ఐటీ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని పలు రేటింగ్‌ సంస్థలు అంచనాలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ  వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో తదితర కంపెనీల షేర్లు శుక్రవారం 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించడం గమనార్హం. అంతర్జాతీయంగానూ పలు ఐటీ సంస్థలు 2024 ఆదాయ అంచనాలపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. యాక్సెంచర్‌ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ  షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది.

ఆసక్తి చూపకపోవడంతో..

పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్‌ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది.  ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్‌, ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. యాక్సెంచర్‌ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చు.

ఖర్చులు తగ్గించుకోవడంపై..

ఆదాయాలు పెరగకపోవడంతో, దేశీయ ఐటీ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే నియామకాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతానికి మన దేశంలో ఇలాంటి పరిస్థితి కొన్ని చిన్నస్థాయి ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తోంది. పెద్ద కంపెనీలు ఇంకా ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు ఏమీ చేయడం లేదు. 

దీర్ఘకాలిక ప్రాజెక్టులు వస్తేనే..

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలకు దీర్ఘకాలిక ప్రాజెక్టుల అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వాటి ఆదాయాల్లో స్థిరత్వం ఉండే అవకాశాలున్నాయని అంటున్నాయి. ఇటీవలి తన నివేదికలోనూ భారతీయ ఐటీ సేవల సంస్థలు 3-5% వృద్ధికే పరిమితం అవుతాయని ‘ఇక్రా’ సంస్థ అంచనా వేసింది. 

కృత్రిమ మేధతోనే..

యాక్సెంచర్‌ మూడో త్రైమాసిక ఫలితాల ప్రకారం.. జనరేటివ్‌ ఏఐ (జెన్‌ఏఐ) విభాగం దాదాపు 600 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,000 కోట్ల) ఆర్డర్లను సంపాదించింది. దీన్నిబట్టి, కృత్రిమ మేధకు ఉన్న గిరాకీని అర్థం చేసుకోవచ్చు. సంస్థలు ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించుకుని, జెన్‌ఏఐ నిపుణుల కోసం.. తమ సిబ్బందికి ఆయా నైపుణ్యాలు నేర్పేందుకు నిధులు కేటాయిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సి ఉంది. కీలకమైన బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాల్లో ఈ ధోరణి కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని